చంద్రబాబుపై మోదీ కోపం తగ్గిందా?

2014 ఎన్డీఏ మిత్రులుగా ఉన్న చంద్రబాబు, మోదీలు 2019లో విడిపోయారు. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తిరిగి ఇరువురు 2024లో కలిశారు.

Update: 2024-05-10 07:17 GMT

ప్రధాని నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న కోపం తగ్గిందా.. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబులు మనస్పూర్తిగా కలిసి పోయారా లేక లోపల కత్తులు పెట్టుకొని పైకి కలిసిపోనట్లు నటిస్తున్నారా అనేది ఇప్పుటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. గతంలో ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకొని బయటకొచ్చి, ఈ ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి, పీఎం మోదీతో చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మరో సారి తెరపైకి వచ్చింది. ఎన్డీఏ కూటమి తరపున చిలకలూరిపేటలో తొలి సారి నిర్వహించిన సభలో ఎడ ముఖం, పెడ ముఖంగా ఉన్న చంద్రబాబు, మోదీలు ఇటీవల విజయవాడలో నిర్వహించిన రోడ్‌షోలో చిరు నవ్వులు చిందిస్తూ, మాట్లాడుకుంటూ ముందుకు సాగడంతో చంద్రబాబు, మోదీల మధ్య ఉన్న గ్యాప్‌ అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

2014లో మిత్రులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఏపీలో జరిగిన 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ ట్రావెల్‌ చేసింది. టీడీపీ ఎన్డీఏలో పార్టనర్‌ అయింది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీకి 102, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. నాడు మోదీ మంత్రి వర్గంలో కూడా టీడీపీ సభ్యులు మంత్రి పదవులు దక్కించుకున్నారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బీజేపీతో అప్పటి వరకు జత కట్టిన టీడీపీ ఎన్డీఏతో కటీఫ్‌ చేసుకుంది. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ బీజేపీకి దగ్గర కావడంతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందనే టాక్‌ అప్పట్లో నడిచింది.
పరస్పర విమర్శలు
ఈ నేపధ్యంలో బీజేపీ, ప్రధాని మోదీలపై చంద్రబాబు కత్తి కట్టారు. ఎన్నికల ప్రచారాల్లో విమర్శల వర్షం గుప్పించారు. రాష్ట్రానికి అమలు చేయాల్సిన విభజన చట్టంలోని హామీల అమల చేయకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీలను విబేధించి బయటకు వచ్చినట్లు చెప్పారు. ప్రధాని మోదీ తనకంటే జూనియర్‌ అని, కరుడుగట్టిన ఉగ్రవాదని, మంచివాడు కాదని, సొంత భార్యనే చూసుకోనివాడు ఇక దేశాన్ని, దేశ ప్రజలను ఏమి చూసుకుంటాడని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ గుంటూరు వస్తున్న సందర్భంగా టీడీపీ శ్రేణులతో పాటు చంద్రబాబుసైతం నల్ల చొక్కాలు ధరించి మోదీకి వ్యతిరేకంగా తీవ్రంగానే నిరసనలు తెలిపడంతో పాటు మోదీ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రం పట్ల బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీలు దుర్మార్గంగా వ్యవహరించారని, అందుకే తన వంటి సీనియర్‌ నేత కూడా నల్ల చొక్కా వేసుకోవలసి వచ్చింది. మోదీ 2002లో రాజకీయాల్లోకి వస్తే తాను 1978లోనే ఎమ్మెల్యే అయ్యాను. ప్రధానిని గౌవరంగా సార్‌ అని పిలిస్తే రాజధాని అమరావతికి మట్టి, నీళ్లు ముఖాన కొట్టి పోతారా అని ప్రశ్నించారు. టీడీపీతో పెట్టుకుంటే ఖబడ్దార్‌ అని బీజేపీని హెచ్చరించారు. బీజేపీ కుట్రలు ఇతర రాష్ట్రాల్లో చెల్లుతాయోమో కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాగవని హెచ్చరించారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ కూడా చంద్రబాబును తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు. కూటములు కట్టడంలోను, కూటములు మార్చడంలోను, సొంత మామను వెన్నుపోటు పొడవడంలోనూ బాబు తన కంటే సీనియర్, చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదని, కూలిపోతున్న టీడీపీ పార్టీ నిర్మాణమని అని నాడు మోదీ ఘాటుగానే విమర్శలు గుప్పించారు.
కక్ష సాధింపులు
ఇవన్నీ మనసులో పెట్టుకున్న మోదీ చంద్రబాబుపై కోపం పెంచుకున్నారనే టాక్‌ ఆ పార్టీ వర్గాల్లో ఉంది. నాటి నుంచి చంద్రబాబుపై కక్ష తీర్చుకునేందుకు మోదీ ఎదురు చూశారనే చర్చ కూడా టీడీపీ శ్రేణుల్లో ఉంది. చంద్రబాబు అరెస్టు సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సహకరించారని, దీని వల్లే చంద్రబాబు అరెస్టు సాధ్యమైందనే చర్చ కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో జరిగింది. 2019 ఎన్నికల ముందుకు నుంచి మూడు నెలల క్రితం వరకు చంద్రబాబు, మోదీలు కలుసుకోలేదు. తర్వాత పొత్తుల నేపథ్యంలో ఢిల్లీలో ఇటీవల కలుసుకోవడం చేశారు. గతాన్ని గుర్తు పెట్టుకున్న మోదీ పొత్తుల సమయంలో కావాలనే చంద్రబాబుకు అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగింది. ఈ నేపథ్యంలోనే చిలకలూరిపేట సభకు వచ్చిన ప్రధాని మోదీ చంద్రబాబుతో టచ్‌మీనాట్‌గానే ఉన్నారని, 2014కు ముందు ఉన్నంత ఫ్రీగా ఇద్దరు మాట్లాడుకోలేక పోయారని, అయితే విజయవాడ రోడ్‌ షో సమయానికి మాటలు, చిరునవ్వులు, కౌగిలింతలు చోటు చేసుకోవడంతో ఇరువురి మధ్య ఇగోలు సర్థుమణిగి ఉంటాయని అటు బిజేపీ, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News