రేవంత్ ను ప్రాధేయపడుతున్న గ్రూప్-1 అభ్యర్ధులు
తమ జీవితాలు రోడ్డుమీద పడుతున్నట్లు చెప్పారు. తమ బాధలు రేవంత్ సానుభూతితో వినాలని విజ్ఞప్తి చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్ధులు రేవంత్ రెడ్డిని ప్రాధేయపడుతున్నారు. వెంటనే జీవో 29ని రద్దు చేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరుతున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్ధుల్లో కొందరు జీవో 29ని వెంటనే రద్దుచేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలనే డిమాండుతో కొంతకాలంగా నానా రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్ధుల ఆందోళనలకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతిస్తున్నాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ అభ్యర్ధులకు మద్దతు పలికి శనివారం గంటలపాటు కూర్చున్న విషయం తెలిసిందే. అభ్యర్ధులు ఏమనుకున్నారో ఏమో ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆపీసు గాంధీభవన్ దగ్గర పెద్ద గోలచేశారు.
అక్కడ పోలీసులు అభ్యర్ధులను అడ్డుకుని చెదరగొట్టేయటంతో మీడియా సమావేశం పెట్టాలని అనుకున్నారు. మీడియా సమావేశం పెట్టబోతున్నట్లు అందరికీ సమాచారం పంపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మీడియా సమావేశాన్ని కూడా జరగనియ్యలేదు. ఈ సందర్భంగా అభ్యర్ధులు రేవంత్ ను రిక్వెస్టు చేసుకున్నారు. తమ జీవితాలు రోడ్డుమీద పడుతున్నట్లు చెప్పారు. తమ బాధలు రేవంత్ సానుభూతితో వినాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ ను ప్రాధేయపడుతున్నామని, కొద్దిగా కనికరించి జీవో 29ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రిలిమ్స్ హాల్ టికెట్లు, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్ల వేరువేరుగా ఉన్నట్లు చెప్పారు.
చరిత్రలో రెండు హాల్ టికెట్లకు వేర్వేరు నెంబర్లు రావటం ఎప్పుడూ రాలేదన్నారు. ఇపుడు హాల్ టికెట్లకు రెండు వేర్వేరు నెంబర్లు ఎలా వచ్చాయని ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ సమస్యలను సానుభూతితో పరిశీలించి తమను పిలిపించి చర్చలు జరపాలని అభ్యర్ధులు కోరారు.