ఏపీలో పెరుగుతున్న భూగర్భజలం

ఏడాదిలో 0.65 మీటర్ల భూగర్భ జలం పెరుగుదల కనిపించిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2025-11-27 07:03 GMT

ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భజల మట్టాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగాయి. రాష్ట్రవ్యాప్త సగటు గత ఏడాది 7.45 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది 6.80 మీటర్లకు చేరుకుంది. అంటే ఏడాది కాలంలోనే సగటున 0.65 మీటర్ల భూగర్భజలం పెరిగినట్టు అయింది. ఈ విషయాన్ని భూగర్భజల శాఖ అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కు నివేదించారు.

ప్రాంతాలవారీగా చూస్తే కోస్తాంధ్రలో గత ఏడాది 6.77 మీటర్లుండగా, ఈ ఏడాది 6.56 మీటర్లకు చేరింది (0.21 మీటర్ల పెరుగుదల). రాయలసీమలో మరింత పురోగతి కనిపిస్తోంది. 9.00 మీటర్ల నుంచి 7.34 మీటర్లకు చేరుకుంది (1.66 మీటర్ల పెరుగుదల). రాయలసీమ ప్రాంతంలో భారీగా రీఛార్జి ప్రాజెక్టులు, వర్షపాతం పెరగడం, నీటి పరిరక్షణ చర్యలు ఈ ఫలితానికి కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయినప్పటికీ ఇంకా సవాళ్లు మిగిలే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5,697 గ్రామాల్లో భూగర్భజల మట్టం 8 మీటర్ల కంటే దిగువనే ఉంది. ఈ గ్రామాల్లో ప్రత్యేక రీఛార్జి కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భజల మట్టాన్ని 3 మీటర్ల లోపు తీసుకురావాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. “ఇప్పటివరకు సాధించిన ప్రగతి సంతృప్తికరమే అయినా, లక్ష్యం ఇంకా దూరంగానే ఉంది. అన్ని జిల్లాల్లోనూ సమన్వయంతో నీటి సంరక్షణ, రీఛార్జి చర్యలను మరింత వేగవంతం చేయాలి” అని ఆయన ఆదేశించారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం గత రెండేళ్లుగా కురిసిన అతి భారీ వర్షాలు, జలజీవన్ మిషన్ కింద చేపట్టిన రీఛార్జి పిట్లు, పర్కులేషన్ ట్యాంకులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, వ్యవసాయంలో సూక్ష్మ నీటిపారుదల పద్ధతుల పెరుగుదల వంటి అంశాలన్నీ కలిసి ఈ సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి.

అయితే రాష్ట్రంలో ఇంకా 35-40 శాతం ప్రాంతాలు సెమీ-క్రిటికల్, ఓవర్-ఎక్స్‌ప్లాయిటెడ్ విభాగంలోనే ఉన్నాయన్న వాస్తవం గుర్తుంచుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రభుత్వం పెట్టుకున్న 3 మీటర్ల లక్ష్యం సాధించాలంటే ఇంకా ఐదారేళ్ల పాటు నిరంతరాయంగా, దూకుడుగా చర్యలు కొనసాగించాల్సి ఉంటుందని భూగర్భజల నిపుణులు అంచనా వేస్తున్నారు.

మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ భూగర్భజల పరిరక్షణలో స్థిరమైన పురోగతి సాధిస్తున్నదని స్పష్టమైన సంకేతం వచ్చింది. ఈ దిశలో ప్రభుత్వం చూపిస్తున్న చురుకుదనం కొనసాగితే రాబోయే రెండు మూడేళ్లలోనే రాష్ట్ర భూగర్భజల చిత్రం డ్రామాటిక్‌గా మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News