విశాఖలో రహేజా కంపెనీకి గ్రీన్ సిగ్నల్
రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు, క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి కూడా ఈ భేటీలో ఆమోదం లభించిందని మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం దాదాపు మూడున్నర గంటలపాటు సాగింది. ఈ సమావేశంలో సుమారు 70 అజెండా అంశాలపై మంత్రులు సుధీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థలు, నిపుణులు, ఈ విడిభాగాల సంస్థలకు ఏపీ కేంద్రంగా మారుతోందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ఈ మిషన్ ద్వారా ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని, దీంతో 5 వేల మంది నిపుణులు, స్టార్టప్‌లు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆమోదం ద్వారా రాష్ట్రం డీప్ టెక్ రంగంలో ముందంజలో నిలబడనుందని, జాతీయ క్వాంటమ్ మిషన్‌కు (ఎన్‌క్యూఎం) అనుగుణంగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేయడానికి దోహదపడనుందని మంత్రి వివరించారు.
పరిశ్రమలు, భూమి కేటాయింపులు
మంత్రివర్గ సమావేశంలో పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ జిల్లా కాపులుప్పాడలో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతి, ఓర్వకల్లులో కొత్త పరిశ్రమలకు కూడా ఆమోదం లభించింది. డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఓర్వకల్లులో 50 ఎకరాల భూమి కేటాయింపును మంత్రివర్గం ఆమోదించింది. నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంటు కోసం బిర్లా గ్రూప్‌కు భూమి కేటాయింపు, ఓర్వకల్లులో సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్‌కు 100 ఎకరాల కేటాయింపు, అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా లిమిటెడ్‌కు 150 ఎకరాల భూమి కేటాయింపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
కృష్ణా జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద ఇన్నోవేషన్ పార్కు ఏర్పాటుకు ఆమోదం, అనంతపురంలో టీఎంటీ బార్ ప్లాంట్‌కు 300 ఎకరాలకు పైగా భూమి కేటాయింపు కూడా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ అనుసంధాన స్పేర్ వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతి మండలంలో 20-30 వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. విశాఖపట్నంలో ఐటీ సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్కు ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాలు విశాఖలో రానున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు (నవంబర్ 14-15)కు ముందుగా తీసుకున్నవని, ఈ సదస్సు ద్వారా మరో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పార్థసారథి వెల్లడించారు.