ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ పథకం
ఏపీలో అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు 100 రోజుల గడువు;
By : Amaraiah Akula
Update: 2025-08-11 07:08 GMT
ఆంధ్రప్రదేశ్‌లో అనుమతులు పొందకుండా ఏర్పాటు చేసిన వేల సంఖ్యలో లేఔట్లు, వాటిలో ప్లాట్‌లు కొనుగోలు చేసిన వేలాది మంది యజమానుల సమస్యకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ (లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) రూపంలో పరిష్కారం అందిస్తోంది. ఈ పథకం ఇంకా 100 రోజులు మాత్రమే అమల్లో ఉంటుంది.
సవరించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకం (LRS) కింద రాష్ట్రవ్యాప్తంగా అనుమతి లేని లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది అవకాశాన్ని ఇచ్చింది. ఈ మేరకు జూలై 26న ప్రభుత్వం GO Ms. No. 134ను జారీ చేసింది.
ఎల్‌ఆర్‌ఎస్ అర్హత
2025 జూన్ 30 లోపు అనుమతి లేని లేఔట్‌లో ప్లాట్ కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అందరూ అర్హులు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటే, ఆ ప్లాట్‌ను ఎల్‌ఆర్‌ఎస్‌లో క్రమబద్ధీకరించుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13,667 లేఔట్లు అధికార అనుమతులు పొందకుండా వేసినట్లు అంచనా. వాటిలో ప్లాట్లు విక్రయించబడటంతో, ఆస్తి యజమానులు చట్టపరమైన అనుమతులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దరఖాస్తు విధానం
సమీపంలోని లైసెన్స్ కలిగిన సాంకేతిక నిపుణుడు (LTP) ద్వారా లేదా స్వయంగా ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్లలో రిజిస్ట్రేషన్ పత్రాలు, లేఔట్ కాపీ, రూ. 10,000 కంటే తక్కువ కాకుండా ఫీజు చెల్లించాలి. మనం పెట్టుకున్న దరఖాస్తు సక్రమంగా ఉందని భావించి సంబంధిత శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని రాయితీలు కూడా ప్రకటించింది. 45 రోజుల్లో పూర్తి ఫీజు చెల్లిస్తే 10% రాయితీ, 45–90 రోజుల్లో చెల్లిస్తే 5% రాయితీ, 14% ఓపెన్ స్పేస్ ఛార్జ్‌లో 7% రాయితీ ఇస్తారు.
దరఖాస్తులు 2025 అక్టోబర్ నెలాఖరు వరకు మాత్రమే స్వీకరిస్తారు.
పరిశీలన & క్రమబద్ధీకరణ ప్రక్రియ
పురపాలక లేదా నగరపాలక సంస్థ సిబ్బంది సైట్‌ను పరిశీలించి ఇన్ ప్రిన్సిపల్ లేఔట్ ప్యాటర్న్ తయారు చేస్తారు. కనీసం 30 అడుగుల రహదారులు ఉండేలా నమూనా రూపొందించి ప్రజల అభ్యంతరాలు తీసుకుంటారు. అభ్యంతరాలు లేని లేఔట్‌లకు మిగిలిన ఫీజు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు.
లేఔట్ వివరాలు తెలుసుకునే విధానం
సమీప పట్టణాభివృద్ధి సంస్థ వద్ద లేఔట్ ప్లాన్ (LP) నంబర్ ఇచ్చి, ఆ లేఔట్‌కి అనుమతులు ఉన్నాయా లేవా తెలుసుకోవచ్చు. రాజధాని ప్రాంతం (సీఆర్డీఏ)లోని 29 గ్రామాలను మినహాయించి, మిగతా ప్రాంతాలకు ఎల్‌ఆర్‌ఎస్ వర్తిస్తుంది. సీఆర్‌డీఏ కూడా ప్లాట్ల క్రమబద్ధీకరణకు త్వరలో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
క్రమబద్ధీకరణ వల్ల ప్రయోజనాలు
ఇళ్ల నిర్మాణానికి పట్టణ స్థానిక సంస్థల నుంచి అనుమతులు లభిస్తాయి. మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమం అవుతుంది. బ్యాంకుల నుంచి ఇళ్ల నిర్మాణ రుణాలు పొందవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ఓ హెల్ప్‌లైన్ నంబర్ ఇచ్చింది. ఈ నెంబర్ కి 79816 51881 ఫోన్ చేసి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు. పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో లేఔట్ ప్లాన్ (LP) నంబర్ ఇస్తే, ఆ లేఔట్‌కి అనుమతులు ఉన్నాయా లేవా తెలుసుకోవచ్చు.