వచ్చే నెలనుంచి అన్న క్యాంటిన్‌లు, రూ.5కే భోజనం: మంత్రి నారాయణ

అన్న క్యాంటీన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాం. మూడు వారాల్లో తొలి విడత క్యాంటీన్లు ప్రారంభం అవుతాయి. వీటి నిర్వహణ ఎవరికి ఇవ్వాలన్న అంశాలపై చర్చిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు.

Update: 2024-06-16 09:18 GMT

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై టీడీపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ ఉత్తర్వులపై సీఎం సంతకం చేశారు. తాజాగా అతి త్వరలో అన్న క్యాంటీన్లను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. ఈ అంశంపైనే ఆయన ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. భవనాల్లో కావాల్సిన అవసరాలు, నిర్మించాల్సిన భవనాలు, సగం నిర్మాణంలో ఆగిన భవనాలకు సంబంధించిన అన్ని వివరాలతో నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు నారాయణ.

మూడు వారాలే

అన్న క్యాంటీన్ల కోసం పేదల ఎదురు చూపులు మూడు వారాల్లో ముగుస్తాయని మంత్రి నారాయణ వివరించారు. ‘‘మూడు వారాల్లో మళ్ళీ రూ.5 భోజనం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే దీనిపై కసరత్తులు ప్రారంభించేశాం. అందుబాటులో ఉన్న అన్న క్యాంటీన్ల భవనాల్లంటిలో పునః ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అన్న క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి అన్న వివరాలను పరిశీలిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. అన్న క్యాంటీన్లు మూడు నెలల్లో ప్రారంభించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం’’ అని వివరించారు.

రూ.58 రాయితీ ఇచ్చాం..

‘‘గతంలో అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చినప్పుడు రూ.73కు మూడు పూటల భోజనం అందించడానికి ఇస్కాన్ ముందుకొచ్చింది. కానీ పేదలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వం రూ.5 భోజనం అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే మూడు పూటలకు 15 రూపాయలే. మిగిలిన రూ.58ను ప్రభుత్వమే ఇస్కాన్‌కు అందించింది. అప్పట్లో అన్న క్యాంటీన్లలో రోజుకు 2.25 లక్షల మంది భోజనం చేసేవారు. 2014-2019 మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో 4.25 కోట్ల మంది అన్న క్యాంటీన్ల సేవలను వినియోగించుకున్నారు’’ అని ఆయన తెలిపారు.

‘ఆ విషయాలపై ఆలోచన చేస్తున్నాం’

‘‘అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు అంతా సిద్ధమైంది. మరో మూడు వారాల్లో తొలివిడత క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. ఇక్కడి భోజన సదుపాయాలపై ఇస్కాన్‌తో చర్చించాం. వారు తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభించగలమని చెప్పారు. ఈ విషయంపై వారితో ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి. మరోసారి అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యత ఇస్కాన్‌కే ఇవ్వాలా? లేకుంటే టెండర్లను పిలవాలా? అన్న అంశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విషయాల్లో తుది నిర్ణయాలు తీసుకుంటాం. వాటి ప్రకారం అన్న క్యాంటీన్ల విషయంలో ముందడుగు వేస్తాం’’ అని చెప్పారు. అనంతరం గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ఇస్కా సంస్థకు ఉన్న సెంట్రలైజ్‌డ్ కిచెన్స్ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి అని విమర్శలు గుప్పించారు. ప్రజల కడుపు కొట్టిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని, ఆంధ్రను రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం కూడా వారిదేనంటూ మండిపడ్డారు నారాయణ.

Tags:    

Similar News