చేజ్ చేసి సీజ్ అయిన మాజీ పోలీస్!
ఆయన మాజీ పోలీస్ అధికారి, మాజీ ప్రజా ప్రతినిధి. పోలీసు వాహనాన్ని చేజ్ చేసి చివరకు పోలీసుల వలలో బంధీ అయ్యారు? ఎవరా మాజీ పోలీస్. ఏమి జరిగింది?;
ఆయన మాజీ పోలీస్ అధికారి. పోలీస్ నిబంధనలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. అయితే ఏదో ఒకటి చేసి రోజు వారీ వార్తల్లోకి ఎక్కాలని తపన పడుతున్నాడు. పోలీసు వాహనాలు చేజ్ చేయకూడదని, పోలీసుల అదుపులో ఉన్న వారిపై చేయి చేసుకో కూడదని తెలిసి కూడా పోలీసు వాహనాన్ని అడ్డగించి ఆ వాహనంలో ఉన్న నిందితునిపై చేయి చేసుకున్నాడు. ఆ నిందితునితో ఈ మాజీ పోలీస్ కు ఏమైనా కక్షలు ఉన్నాయా? అంటే అవేమీ లేవు. కేవలం ప్రచారం కోసమే ఇదంతా చేశాడు.
ఇంతకూ ఆ మాజీ పోలీస్ అధికారి ఎవరనుకుంటున్నరా? హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గత ప్రభుత్వంలో గెలిచిన మాజీ సీఐ గోరంట్ల మాధవ్. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంపీ మాధవ్ ఒక వెలుగు వెలిగారు. అయితే ఆయన ఒక మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించారని పరువు పోగొట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు తిరిగి సీటు దక్కలేదు. అయితే వైఎస్సార్సీపీ నాయకునిగా నిత్యం పోలీసులతో ఏదో సందర్భంలో గొడవలు పడుతూనే ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోలు కిరణ్ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈయన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వెంటనే కిరణ్ ను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కిరణ్ ను ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసులతో గొడవ పడుతున్న గోరంట్ల మాధవ్ (ఫైల్ ఫొటో)
మంగళగిరి నుంచి కిరణ్ ను గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకుపోయేందుకు నిర్ణయించారు. విజయవాడలో ఉన్న గోరంట్ల మాధవ్ కిరణ్ మంగళగిరి పోలీసుల అదుపులో ఉన్నారని తెలుసుకుని, కిరణ్ పై దాడి చేసేందుకు వెళ్లారు. అక్కడి నుంచి పోలీసులు గుంటూరుకు బయలుదేరటంతో పోలీసు వాహనాన్ని మాధవ్ వాహనం అనుసరిస్తూ గుంటూరులోని చుట్టుగుంట సెంటర్ కు చేరుకోగానే చేజ్ చేసి వాహనంలో ఉన్న కిరణ్ ను బయటకు లాగి కొట్టబోయారు. మా నాయకుడు వైఎస్ జగన్ భార్య భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఎలా సహిస్తామంటూ మండి పడ్డారు.
మాధవ్ తమ విధులకు అడ్డుతగలటం, తమ అదుపులో ఉన్న కిరణ్ పై దాడికి యత్నించడంతో పోలీసులు మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు. నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించి ఒక రూములో కూర్చోబెట్టారు. విషయం జిల్లా ఎస్పీకి తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు మాధవ్ ను తరలించారు. గురువారం రాత్రి పది గంటల తరువాత కూడా అక్కడే ఉంచారు.
పోలీస్ విధులకు ఆటంకం కలిగించడం, పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై దాడికి ప్రయత్నించిన నేరం కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసు పనితీరు గురించిన తెలిసిన మాధవ్ ఎందుకు ఇలా ప్రవర్తించారనే చర్చ మొదలైంది.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించేందుకు ఇది మంచి అవకాశమని భావించిన మాధవ్ ఈ విధంగా చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తాను పోలీస్ వాహనాన్ని చేజ్ చేసేందుకు ప్రయత్నించే సమయంలో ఆయనతో పాటు వాహనంలో ఆయన స్నేహితులు, సన్నిహితులు కొందరు ఉన్నారు.