సర్వేపల్లిలో సోమిరెడ్డి సంగతేంటో చూస్తానన్న వైసీపీ నేత కాకాణి

86రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి;

Update: 2025-08-20 09:49 GMT
జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి కాకాణి కి స్వాగతం పలుకుతున్న అభిమానులు
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. 86 రోజుల రిమాండ్ తర్వాత బయటికొచ్చారు. ఈసందర్భంగా జైలు ప్రాంగణంలో కాకాణి అనుచరులు హల్‌చల్‌ చేశారు. ఆయన జైలు నుంచి బయటకు రాగానే ఉద్విగ్న పరిస్ధితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు ఆయన్ను హత్తుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనుచరులు పెద్దఎత్తున ఎదురేగి స్వాగతం పలికారు. ఊరేగింపుగా ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం నాయకుల తీరును విమర్శించారు.
‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు. ఏడు పీటీ వారెంట్‌లు వేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మా లక్ష్య సాధనలో జైళ్లు అడ్డంకి కాదు. నెల్లూరు జిల్లా ప్రజలే నా ఆస్తి. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి దుర్మార్గం. సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అడ్డే లేకుండా పోయింది. ఆ దోపిడీని అడ్డుకుంటాం. ప్రభుత్వంపై పోరాటానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాం’’ అని కాకాణి అన్నారు.
కూటమి ప్రభుత్వం కాకాణిపై వరుసగా కేసులు పెట్టగా ఒక్కోదాంట్లో బెయిల్‌ మంజూరు అవుతూ వచ్చింది. రుస్తుం మైనింగ్‌ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్‌ లభించినట్లయ్యింది. బెయిల్‌పై ప్రాసిక్యూషన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
Tags:    

Similar News