ఆంధ్రా మద్యం స్కాం చిక్కుల్లో మాజీ ఐఏఎస్ అధికారి

ఏపీలో మద్యం కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఐదుగ్గురు అరెస్ట్ అయ్యారు. మరో ఐదుగ్గురు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.;

Update: 2025-05-03 09:56 GMT
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి

వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ద్వారా కొనుగోలు చేసిన మద్యంలో భారీ ఆర్థిక అక్రమాలు జరిగాయని నమోదైన కేసు మలుపులు తిరుగుతోంది. పోలీసులు విచారిస్తున్న కొద్దీ కేసులో నిందితులు పెరుగుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 35 మందిని నిందితులుగా నమోదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారిస్తోంది. కేసు సంక్లిష్టత, రాజకీయ నేపథ్యం, న్యాయపోరాటాలు దీన్ని రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మార్చాయి. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇపుడు ఒక ఐఎఎస్ అధికారికి కూడా చిక్కులు మొదలయ్యాయి. ఆయన పేరు కె. ధనుంజయ్ రెడ్డి

మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డిపై ఆరోపణలు

ఈ మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ్ రెడ్డి పేరు తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇది కీలక పరిణామం. కె ధనుంజయ్ రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం కార్యదర్శిగా ఉన్నారు. ఈ మద్యం కుంభకోణంలో సంపాదన ఆధారిత ఎక్సైజ్ విధానంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిట్ నివేదిక ప్రకారం ధనుంజయ్ రెడ్డి ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్)తో కలిసి పనిచేసినట్లు సిట్ ఆరోపిస్తోంది. రాజ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐటీ సలహాదారుగా పనిచేశాడు. ధనుంజయ్ రెడ్డి బెయిల్ పిటీషన్ తిరస్కరణ, సిట్ దర్యాప్తు కొనసాగుతుండటం ఆయనకు చట్టపరమైన సవాళ్లను పెంచుతోంది. హైకోర్టు తీర్పు, తదుపరి విచారణ ఈ కేసు దిశను నిర్ణయించే అవకాశం ఉంది.

ఎవరీ ధనంజయ్ రెడ్డి

ఆయన 2006 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినపుడు ఆయన కేంద్ర సర్వీసు లనుంచి డిప్యూటేషన్ మీద వచ్చారు.అప్పటి నుంచి ఆయనకు ఐఎఎస్ హోదా ఇప్పించేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. అది బాగా జాప్యం అయింది. మొత్తానికి ఐఎఎస్ సాధించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే ఆయన్ను తన పేషీలోకి తీసుకున్నారు. ఆయనకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అసలు ఆయనకకు ఐఏఎస్‌ హోదా రావడమే చిత్రవిచిత్రంగా జరిగింది. 2024లో ఆయన రిటైర్ అయ్యారు.

కెసిరెడ్డితో కలిసి మద్యం సరఫరా ఆర్డర్ లు

రాజ్ కెసిరెడ్డి, ఇతర నిందితులతో ధనుంజయ్ రెడ్డి కలిసి మద్యం సరఫరా ఆర్డర్‌ల (ఆర్డర్ ఫర్ సప్లై - OFS) జారీలో లంచాలు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లంచాలు నెలకు రూ. 50 నుంచి 60 కోట్ల వరకు సేకరించబడినట్లు సిట్ తేల్చింది. ఇది మొత్తం రూ. 3,200 కోట్లకు చేరుకుందని అంచనా. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం విధానం (ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ - APSBCL ద్వారా నిర్వహణ)లో ధనుంజయ్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధానం ద్వారా, ప్రముఖ బ్రాండ్‌లను తొలగించి, కొత్త, తక్కువ పేరున్న బ్రాండ్‌లను ప్రోత్సహించినట్లు సిట్ తెలిపింది. ఈ కొత్త బ్రాండ్‌ల నుంచి లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ (సీ-టెల్)ను తొలగించి, మాన్యువల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడంలో ధనుంజయ్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సిట్ ఆరోపిస్తోంది. దీని వల్ల లంచాల ఆధారంగా ఆర్డర్‌లు జారీ చేయడం సులభమైందని, ప్రముఖ బ్రాండ్‌ల మార్కెట్ వాటా 2018-19లో 53 శాతం నుంచి 2023-24 నాటికి 5 శాతానికి పడిపోయిందని సిట్ పేర్కొంది. ధనుంజయ్ రెడ్డి నాడు వైఎస్సార్సీపీ నాయకులైన విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, ఇతరులతో కలిసి ఈ కుంభకోణాన్ని నిర్వహించినట్లు సిట్ ఆరోపిస్తోంది. లంచాలు వీరికి చేరినట్లు సిట్ నివేదికలో పేర్కొన్నది.

కేసులో ప్రధాన నిందితులు

ఈ కేసులో గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కె రాజశేఖర్ రెడ్డి (రాజ్ కెసిరెడ్డి) ప్రధాన నిందితుడు. సిట్ రిమాండ్ నోట్ ప్రకారం, రాజ్ కెసిరెడ్డి రూ. 3,200 కోట్ల మేర అక్రమ సేకరణలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు రాజ్ కెసిరెడ్డి (ఎ1) ని ఏప్రిల్ 21, 2025న సిట్ ద్వారా హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. పి దిలీప్ (ఎ30) ను మే 2, 2025న చెన్నైలో అరెస్ట్ చేశారు. అంతకు ముందు బూనేటి చాణక్య (ఎ8) ను అరెస్ట్ చేశారు. ఈయన కెసిరెడ్డి తోడల్లుడుగా చెబుతున్నారు. ఎస్పీవై ఆగ్రోస్ అధినేత సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏపీబీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న వీరిని కలిపి ఒక సారి, విడివిడిగా విచారించాలని సిట్ నిర్ణయించింది. కొందరిని ఇప్పటికే విచారించింది. ఈనెల 6 వరకు వీరందరికీ రిమాండ్ గడువు ఉంది. కెసిరెడ్డి బంధువులు, ఆయనతో సన్నిహిత సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరిగా పోలీసులు అరెస్ట్ లు చేస్తున్నారు.


బెయిల్ దరఖాస్తు చేసుకున్నవారు

ఎంపీ పీవీ మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. ఏప్రిల్ 3, 2025న హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. కేసులో ఆయన నిందితుడు కాదని, అందువల్ల ముందస్తు బెయిల్ అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. తన పేరు కెసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించినందున బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొంటూ సుప్రీం కోర్టులో మిథున్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటీషన్ ఈనెల 13న విచారణకు రానుంది. కెసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏప్రిల్ 21, 2025న కోర్టు తాత్కాలిక ఉపశమనం నిరాకరించి, విచారణను వాయిదా వేసింది. కె ధనుంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీరి బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇంకా పెండింగ్‌లో ఉంది. సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటీషన్ కూడా హైకోర్టులో పెండింగ్ లో ఉంది.

కెసిరెడ్డి సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారు?

రాజ్ కెసిరెడ్డి సిట్ జారీ చేసిన బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 179 కింది నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ సెక్షన్ కింద నోటీసులు జారీ చేయడం అనేది నేరపూరిత విచారణలో సహకరించని వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి అధికారం ఇస్తుంది. రాజ్ కెసిరెడ్డి తన వాదనలో ఈ నోటీసులు అక్రమమని, సిట్‌కు తనను విచారించే అధికార పరిధి లేదని పేర్కొన్నాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర నివాసి కావడంతో, ఆంధ్రప్రదేశ్ సిట్‌కు తనపై నోటీసులు జారీ చేసే అధికారం లేదని వాదించాడు. రాజ్ కెసిరెడ్డి సిట్ దర్యాప్తును రాజకీయంగా ప్రేరేపితమైనదిగా ఆరోపించాడు. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైఎస్ఆర్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ కేసును ఉపయోగిస్తోందని, తనను తప్పుడు సాక్ష్యాల ఆధారంగా ఇరికించారని ఆయన వాదన. సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ ఇంకా విచారణలో ఉంది, కానీ ఇప్పటివరకు ఎలాంటి తాత్కాలిక ఉపశమనం లభించలేదు.

చెన్నైలో అరెస్ట్ అయిన పి దిలీప్ ఎవరు?

ఈ కేసులో రాజ్ కసిరెడ్డితో సన్నిహితంగా పనిచేసిన వ్యాపారవేత్తగా పి దిలీప్ ను పోలీసులు గుర్తించారు. చెన్నైలో సిట్ బృందం ఆయనను అరెస్ట్ చేసింది. సిట్ ప్రకారం దిలీప్ హవాలా లావాదేవీల ద్వారా కుంభకోణంలో సేకరించిన నిధులను లాండరింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో హవాలా ఆపరేటర్లతో దిలీప్ కు సంబంధాలు ఉన్నట్లు సిట్ ఆరోపిస్తోంది. సిట్ రిమాండ్ నోట్ ప్రకారం మద్యం వ్యాపారంలో అక్రమంగా సేకరించిన రూ. 50 నుంచి 60 కోట్ల నెలవారీ కిక్‌బ్యాక్‌లను హవాలా నెట్‌వర్క్‌ల ద్వారా లాండరింగ్ చేశారు. ఈ లావాదేవీలలో దిలీప్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కేసు నేపథ్యం...

సిట్ ప్రకారం 2019-2024 మధ్య వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏపీఎస్‌బీసీఎల్ ద్వారా మద్యం వ్యాపారంలో అక్రమాలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. నెలవారీ రూ. 50 నుంచి 60 కోట్ల కిక్‌బ్యాక్‌లు కొన్ని లిక్కర్ బ్రాండ్‌ల నుంచి సేకరించారు. ఈ బ్రాండ్‌లకు ప్రభుత్వ రిటైల్ షాపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. యునైటెడ్ స్పిరిట్స్, పెర్నాడ్ రికార్డ్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల మార్కెట్ వాటా 2018-19లో 53.12 శాతం నుంచి 2023-24 నాటికి 5.25 శాతానికి పడిపోయింది. వీటికి బదులుగా వైఎస్ఆర్‌సీపీతో సంబంధాలున్న స్థానిక బ్రాండ్‌లు (ఉదా. ఆంధ్ర గోల్డ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్ విస్కీ) ప్రమోట్ చేశారు.

రాజకీయ నేపథ్యం..

వైఎస్ఆర్‌సీపీ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. సిట్ దర్యాప్తు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార చర్య అని, ఆధారాలు లేకుండా నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తోంది. సిట్ మాత్రం ఈ కేసు రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల నష్టం కలిగించిన భారీ కుంభకోణమని, దీనిలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు నేరుగా లేదా పరోక్షంగా పాల్గొన్నారని వాదిస్తోంది.

ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అక్రమాలు, రాజకీయ పోరాటాల సంగమంగా మారింది. ప్రస్తుతం రాజ్ కెసిరెడ్డి, పి దిలీప్‌లు కస్టడీలో ఉండగా, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వంటి వారు బెయిల్ కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. సిట్ దర్యాప్తు మరింత లోతుగా వెళితే మరిన్ని పేర్లు, ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేసు న్యాయస్థానాల్లో నిజమైన ఆర్థిక కుంభకోణంగా నిరూపితమవుతుందా? లేక రాజకీయ కుట్రగా మిగిలిపోతుందా? అనేది భవిష్యత్తులోనే తేలనుంది.

Tags:    

Similar News