ఫైబర్‌నెట్ మాజీ ఎండీ సస్పెండ్.. కారణం అదేనా!

ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-08-19 10:48 GMT

ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ కార్పొరేషన్‌లో ఆయన భారీగా అవినీతికి పాల్పడ్డారని, దానిని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఎనలేని ప్రయత్నాలు చేశారని సర్కార్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కూడా మధుసూధన్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో వెల్లడించింది. పదవిలో ఉన్నంత కాలం ఆయన పలువురు ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని, తన తప్పులు బట్టబయలు కాకుండా రికార్డుల ట్యాంపరింగ్‌కు కూడా మధుసూదన్ పాల్పడ్డారని కూడా ఆరోపణలు ఉన్నాయని ప్రభుత్వం తన ఆదేశాల్లో వివరించింది.

సాక్ష్యాలను ధ్వంసం చేయడం, అవినీతికి పాల్పడటం ద్వారా మధుసూదన్.. కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారని ప్రభుత్వం తెలిపింది. ఆయన పాల్పడిన అన్న అక్రమాలను సమగ్ర విచారణ చేపడుతున్నామని, ఈ విచారణ పూర్తయ్యే వరకు ఆయనను విధుల నుంచి తొలగిస్తున్నామంటూ సస్పెండ్ చేసింది. ఈ విచారణ పూర్తయ్యే వరకు మధుసూదన్.. హెడ్‌ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని కూడా ఆంక్షలు విధించింది. తప్పని పరిస్థితుల్లో సదరు ఉన్నతాధికారుల పర్మిషన్‌తోనే బయటకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. ఫైబర్‌ నెట్ కార్పొరేషన్‌లో రూ.800 కోట్ల అవినీతి జరిగిందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే మధుసూదన్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు వ్యవస్థల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సర్కార్ దృష్టి సారిస్తోంది. తాజాగానే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సీఐడీ అదుపులోకి తీసుకుంది.

ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల తలదన్నేలా వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ పలువురు అధికార పక్ష నేతలు కీలక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మద్యం కుంభకోణంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సీఐడి అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణంపై ఆయన కీలక పాత్ర పోషించారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఈరోజు ఆయన అరెస్ట్‌తో మరింత దృఢపడ్డాయి. ప్రస్తుతం ఆయనను సీఐడీ అధికారులు అజ్ఞాత ప్రాంతంలో విచారిస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.


డిప్యుటేష్ పొడిగింపు కోసం లేఖ

రైల్వే అకౌంట్స్ సర్వీస్‌లో ఉన్న మధుసూదన్ రెడ్డి.. 26 ఆగస్టు 2019న డిప్యూటేషన్‌పై ఏపీకి వచ్చారు. ఇక్కడ ఫైబర్ నెట్ ఎండీగా విధులు నిర్వర్తించారు. ఆయన డిప్యుటేషన్‌ ఈ నెల 22తో ముగుస్తుంది. ఫైబర్‌నెట్‌లో జరిగిన అక్రమాలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మధుసూదన్ డిప్యుటేషన్‌ను పొడిగించాలని రైల్వే బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖలో ఫైబర్ నెట్ అక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా జోడించింది. ఈ నేపథ్యంలోనే మధుసూదన్ డిప్యుటేషన్‌ను మరో ఆరు నెలలు పొడిగించాలని కోరింది.

Tags:    

Similar News