మంత్రి నారాయణకు చుక్కలు చూపిస్తున్న రాజధాని రైతులు

ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పై మండిపాటు, ఎందుకంటే..

Update: 2025-12-09 05:30 GMT
స్థలం: యండ్రాయి గ్రామం. రెండో విడత భూ సమీకరణపై గ్రామ సభ.
ఓ రైతు గట్టిగా అరుస్తూ:
“సార్… మా భూములు ఇస్తే మా పిల్లలకు ఏం దక్కుతుంది? లీజు ఎంత? హామీ ఏంటి? స్పష్టంగా చెప్పండి!”
MLA భాష్యం ప్రవీణ్ (కొద్దిగా అసహనంగా).. “అన్నీ నేను చూస్తాను. ప్రభుత్వం ఏమి చెబుతుందో అదే అమలు చేస్తుంది. ఇక ప్రశ్నలు ఎందుకు?”
ఇంకో రైతు.. “మొదటి విడతలో వాళ్లకు ఎంత ఇచ్చారు? మాకు అంతకన్నా ఎక్కువే కావాలి? ఎకరానికి ఏడాదికి కనీస కౌలు (లీజు) రూ. 60 వేలు ఇవ్వాలి. ఇది మా హక్కు!”
MLA ప్రవీణ్ కాస్తంత కఠిన స్వరంతో... “చర్చలు నా ద్వారానే జరగాలి. మీ అంతట మీరు వెళ్లి మంత్రిని కలిస్తే గందరగోళం జరుగుతుంది. కూర్చుని మాట్లాడుకుందాం.”
ఇంకో రైతు ఆవేశంగా.. “మేము నేరుగా మంత్రి నారాయణతో మాట్లాడతాం! మా భవిష్యత్తు మా చేతుల్లో ఉండాలి, అన్నిటికీ షరతులు పెడితే ఎలా!”
ఇట్లాంటి సీన్లు ఒక్క యండ్రాయిలోనే కాదు, రెండో విడత భూ సమీకరణకు పూనుకున్న 7 గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో గ్రామసభలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రైతులు మాట్లాడుతుండగానే మహిళా రైతులు కూడా ఒక్కుదుటున వేదిక మీదకు వచ్చి డిమాండ్లు చెబుతున్నారు.
మహిళా రైతులు ప్రజాప్రతినిధులకు సూటిగానే ప్రశ్నలు సందిస్తున్నారు. “మా పిల్లల చదువు? మా ఆరోగ్య సదుపాయాలు? మా ఊళ్ళకు వచ్చే అభివృద్ధి? ఇవి చెప్పకపోతే మాకు భరోసా ఎలా వస్తుంది?” అని అడుగుతున్నారు. “లీజు పెంచండి! హామీలు స్పష్టం చేయండి! అప్పుడే మీ మాట వింటాం!” అంటున్నారు.
దీంతో స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధుల మొహాల్లో అసహనం వ్యక్తమవుతుండగా రైతులు చెబుతున్న వాటిని ఎలా పరిష్కరించాలో అర్థం కాక భూ సమీకరణకు ప్రధాన బాధ్యత వహిస్తున్న మంత్రి నారాయణ, ఇతర అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
అమరావతి రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం కాకముందే రైతుల డిమాండ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. గ్రామ సభల్లో రైతులు, ఎమ్మెల్యేల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యండ్రాయి గ్రామంలో MLA భాష్యం ప్రవీణ్ వ్యవహారశైలి రైతుల అసంతృప్తిని మరింత పెంచింది.
లీజు పెంచాలన్నదే ప్రధాన డిమాండ్...
మొదటి విడత భూ సమీకరణలో ఇచ్చిన పొలం ఎకరానికి 30,000 (మెట్ట), 50,000 (మాగాణి, సాగునీటి సౌకర్యం ఉన్న భూములు) లీజు రేట్లు ఇప్పుడు సరిపోవని రైతులు స్పష్టం చేస్తున్నారు.
రెండో విడతలో కనీసం ఎకరానికి 60,000 రూపాయలు వార్షికంగా ఇవ్వాలని, లేదా ఫేజ్–1 రైతులకు అమల్లో ఉన్న ప్రస్తుత రేట్లను తమకూ ఇవ్వాలని వాదిస్తున్నారు. మంత్రి నారాయణతో ఇటీవల జరిగిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.
ఈ సమావేశంలో భూ సమీకరణ కింద తీసుకునే ఎకరం భూమికి 1,800 చదరపు గజాల ప్లాటు ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. ఇంకో సమావేశంలో రైతులు మరో రెండు కీలక డిమాండ్లను మంత్రి ముందుంచారు. అవి- వార్షిక లీజును రూ.60 వేలకు పెంచడం, ఎకరానికి 1,800 చదరపు గజాల ప్లాటును అభివృద్ధి చేసి ఇవ్వడం. ముందుగా ఈ ప్రతిపాదనలను నారాయణకు అందజేశారు. వాటిని ముఖ్యమంత్రికి ఇమ్మని మంత్రి నారాయణను కోరారు.
ఇక, చిన్న రైతుల కథ వేరుగా ఉంది. చిన్నతరహా రైతుల్ని చిన్నచూపు చూస్తున్నారని మండిపడుతున్నారు. ఎకరం, అర ఎకరం ఉన్న చిన్న రైతులకు అన్యాయం జరక్కుండా చూడాలని కోరుతున్నారు. మొదటి విడతలో భూమిలేని పేదలకు నెలకు రూ.5,000 ఇచ్చినట్లే- భూమి పరిమాణం ఎంతైనా- పరిహారం సమానంగా ఉండాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతులు చేస్తున్న ప్రధాన డిమాండ్లలో విద్య–ఆరోగ్యంపై స్పష్టత, రాష్ట్ర రాజధాని అభివృద్ధి జోన్ పరిధిలోకి వచ్చిన తర్వాత ఏ ఆసుపత్రులు అందుబాటులో ఉంటాయి?
పిల్లలకు ఎలాంటి విద్యాసంస్థలు అందుబాటులో ఉంటాయి?, తమ గ్రామాల భవిష్యత్తు ఏమవుతుంది? వంటివి ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క పోవడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.
రైతులు అడిగే ప్రశ్నలకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ సమాధానం చెప్పకపోవడంతో ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కటీ తన ద్వారానే జరగాలనుకునే తీరు మంచిది కాదని, రైతుల మాటకు విలువ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో నేరుగా మంత్రి నారాయణతోనే మాట్లాడతాం అంటూ పట్టుబడుతున్నారు. దీంతో నారాయణపై వత్తిడి పెరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నా అదంత తేలికగా కనిపించడం లేదు. రైతుల డిమాండ్లు, రాజకీయ అసంతృప్తి, ప్యాకేజ్‌పై స్పష్టత లేమి వంటివి ఈ ప్రక్రియకు ఆటంకాలుగా నిలుస్తున్నాయి. దీనికితోడు ప్రజాసంఘాల నుంచి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు సి.రామచంద్రయ్య వంటి కొందరు ప్రముఖుల నుంచి వస్తున్న వ్యతిరేకత కూడా ప్రతిబంధకాలుగా ఉన్నాయి.
Tags:    

Similar News