వరద బాధితులకు వైసీపీ భారీ విరాళం.. ప్రకటించిన వైఎస్ జగన్

ఏపీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడిక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఆహారం, తాగునీరు, ఔషధాలు వంటి నిత్యావసరాలు కూడా లభించక వేల మంది తల్లడిల్లుతున్నారు.

Update: 2024-09-03 14:23 GMT

ఏపీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడిక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఆహారం, తాగునీరు, ఔషధాలు వంటి నిత్యావసరాలు కూడా లభించక వేల మంది తల్లడిల్లుతున్నారు. వారికి అన్ని రకాల సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం తలమున్కలవుతోంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సోమవారం విజయవాడలోని కృష్ణలంక ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం తిరిగి వెళ్లిన జగన్.. పార్టీ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అందులో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరపున వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు మాజీ సీఎం. వరదల వల్ల అల్లాడిపోతున్న ప్రజల కోసం తమ పార్టీ కోటి రూపాయలు విరాళంగా అందిస్తుందని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అంతా కలిసి తీసుకున్నట్లు తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం మాత్రం తాముంటామని, వరదల్లో చిక్కుకున్న వారికి సరైన సహాయక చర్యలు అందడం లేదని ఆయన మండిపడ్డారు. అధికారం ఉన్న ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప.. ప్రజలకు అందించాలని సహాయసహకారాలను మాత్రం సరైన పద్దతిలో అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లక్షలాది మందికి నిత్యావసరాలు నిల్

‘‘వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదు. లక్షలాది మంది కనీసం ఆహారం, తాగునీరు, ఔషధాలు కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నారు. తమకు సహాయం అందడం లేదని ఫిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు’’ అని వైసీపీ నేతలు పలువురు చెప్పారు. వరద ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ కూడా ప్రచారా ఆర్భాటం, ఫేమస్ కావాలన్న ఉద్దేశంతోనే ఉన్నాయే తప్ప ప్రజలకు సహాయం చేయాలన్న ఆలోచనతో లేవని ఆరోపించారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. తన ఫొటోలు, వీడియోలపై పెడుతున్న శ్రద్ధలో ఒక్కభాగం కూడా ప్రజలకు అందించే చర్యలపై పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేసింది వైసీపీ. అధికార యంత్రాంగం కూడా ఏకాడికి సీఎం అంటకాగుతూ ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలన్న తాపత్రయంతోనే కనిపిస్తోందని, ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని, ఫలితంగా వరద బాధితులు ఆహారం, ఔషధాలు కూడా అందగా అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది వైసీపీ.

ప్రభుత్వం విఫలమైంది: జగన్

‘‘నా పర్యటనలో ప్రజల కష్టాలను స్వయంగా చూశాను. వారికి సహాయం అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. కూటమి ప్రభుత్వం తప్పిదం వల్లే వరదలు ముంచెత్తాయి. కానీ నింద మాత్రం వైసీపీపైన మోపడానికి ప్రయత్నిస్తున్నారు. వరద బాధితుల కోసం పార్టీ తరపు రూ.కోటి విరాళం ప్రకటిస్తున్నాం. ఈ విరాళం ఏ రూపంలో ఇవ్వాలనేది చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని ప్రకటించారు.

Tags:    

Similar News