ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ

మార్చి 29 నాటికి పదవీ కాలం ముగియనుండటంతో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.;

By :  Admin
Update: 2025-02-24 10:20 GMT

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మరో ఐదు ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చి 29తో పదవీ కాలం ముగియనుండటంతో ఈ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను సోమవారం జారీ చేసింది. వీరిలో టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు ఉన్నారు.

ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్సీలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పీ అశోక్‌బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం మార్చి 29కి ముగియనుంది. వీరిలో యనమల రామకృష్ణుడు, పీ అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, బీ తిరుమల నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు. అయితే జంగా కృష్ణమూర్తి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అవ్వగా ఎన్నికల సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరంతా ఎమ్మెల్యే కోటా కింద గెలుపొందిన ఎమ్మెల్సీలు.
ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు మార్చి 3న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. మార్చి 10న నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. మార్చి 11న నామినేషన్ల పరిశీలన, మార్చి 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 20 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. అదేరోజు పోలింగ్‌ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలను ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో రెండు పట్టభద్రులు, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. మార్చి 27న పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.
Tags:    

Similar News