మూడు కొత్త కార్యక్రమాలు చేపట్టిన ఎన్నికల సంఘం
జనన మరణాల జాబితా ఆధారంగా మరణించిన ఓటర్ల వివరాలు అప్ డేట్ చేయాలని నిర్ణయించింది.;
By : The Federal
Update: 2025-05-01 15:50 GMT
ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మరింతగా మెరుగుపరచడం, ఓటువేసే ప్రక్రియను పౌరులకు మరింత సులభతరం చేసే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం మూడు కొత్త కార్యక్రమాలకు నాంది పలికినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. ఎన్నికల కమిషనర్‌లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల సమక్షంలో రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో ఈ ఏడాది మార్చి నెలలో నిర్వహించిన సమావేశంలో భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ కొత్త కార్యక్రమాలను గురించి ప్రకటించినట్లు తెలిపారు.
దీనిప్రకారం జనన మరణాల రిజిష్ట్రార్ జనరల్ నుంచి నమోదైన మరణాలకు సంబంధించిన మరణ «ధృవీకరణ ఎలక్ట్రానిక్ పద్ధతిలో డేటాను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఎప్పటికప్పుడు తీసుకొనే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఫారం–7లో దరఖాస్తు అందనప్పటికీ బూత్ స్థాయి అధికారులు(బిఎల్‌ఓ)లు ఈ జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీచేసి ఓటర్ల సమాచారాన్ని ధృవీకరించడానికి అవకాశం కలుగుతుందన్నారు.
ఓటరు సమాచార స్లిప్(విఐఎస్)లను ఓటర్ల స్నేహపూర్వకంగా రూపొందించడంలో భాగంగా దీని డిజైన్‌ను మార్చాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిప్రకారం క్రమ సంఖ్య, ఓటరు పార్ట్ నెంబరు పెద్దగా, ప్రముఖంగా కనిపించేలా దీనిని డిజైన్ చేశారు. తద్వారా ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని సులభంగా గుర్తించేందుకు వీలుకావడంతోపాటు ఓటర్ల జాబితాలో ఓటర్ల పేర్లను త్వరగా గుర్తించేందుకు అవకాశం కలుగుతుంది.
ఓటర్ల «ధృవీకరణ, ఓటర్ల నమోదు, ఇతర ఎన్నికల సంబంధిత ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే సమయంలో బిఎల్‌ఓలను ఓటర్లు సులభంగా గుర్తించేందుకు వీలుగా ఇఆర్‌ఓల ద్వారా నియమితులైన బూత్ స్థాయి అధికారులకు ఇకపై ప్రామాణిక ఫోటో గుర్తింపు కార్డులను అందజేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తద్వారా ఓటర్ల నమోదు, జాబితాల తనిఖీ వంటి కార్యక్రమాల సందర్భంగా బిఎల్‌ఓలను గుర్తించి, వారితో ఓటర్లు నమ్మకంగా వారి సమచారాన్ని పంచుకొనేందుకు అవకాశం కలుగుతుంది. ఎన్నికల సంబంధ విధులకు సంబంధించి భారత ఎన్నికల సంఘం, ఓటర్ల మధ్య బిఎల్‌ఓలు మొదటి స్థాయి అనుసంధాన వ్యవస్థగా వున్న నేపథ్యంలో ఇంటింటి సందర్శనలకు వెళ్లేటపుడు ప్రజలు వారిని సులువుగా గుర్తించేలా వుండాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.