విశాఖ కార్పొరేటర్ల పంట పండింది!
జీవీఎంసీ బడ్జెట్ ముందు భలే నజరానా. ఒక్కొక్కరికీ రూ.25 వేల గిఫ్ట్ కూపన్లు. ఇంతకీ శనివారం బడ్జెట్ మీటింగ్ జరుగుతుందా?;
By : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-03-28 03:30 GMT
కొంతమంది ప్రజా ప్రతినిధులు జనం సొమ్ముతో జల్సాలు చేస్తుంటారు. తమను గెలిపించిన ప్రజలు ఏమనుకుంటారోనన్న ఇంగితం కూడా మరిచిపోతారు. పదవిలో ఉన్నంతకాలం కాసులు వెనకేసుకుంటే చాలనుకుంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు. చాలామంది అదే పనిలో ఉంటారు. ఆ తర్వాతే ప్రజల సేవైనా.. ఇంకేదైనా! ఇప్పడు ఈ జల్సాలకు అదనంగా గిఫ్ట్ కూపన్లు అందుకుంటున్నారు. ఎందుకనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..!
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కార్పొరేటర్లకు ఇప్పుడో పంట పండింది. ఈనెల 29న (శనివారం ఉదయం 11 గంటలకు) కౌన్సిల్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమయం ఆసన్నమైంది. ఆ బడ్జెట్‌లో కార్పొరేటర్లు కొర్రీలు పెట్టకుండా, దేనికీ అడ్డు తగలకుండా ఉండటానికి తాయిలాలు ఇస్తుంటారు. ఏటా బడ్జెట్‌లో ఇలా ఏదో రూపంలో తాయిలాలు ఇవ్వడం ద్వారా ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌కు ముందు కూడా ఆ రివాజే రిపీటయింది. కొద్ది రోజులు ముందుగా బడ్జెట్ కాపీలను కార్పొరేటర్లకు వారి ఇళ్ల వద్ద అందజేస్తారు. వాటితో పాటే ఈ కూపన్లు ఇస్తుంటారు. గత సంవత్సరం ఇలా ఒక్కొక్కరికి రూ.20 వేల కూపన్లు ఇచ్చారు. ఈసారి ఆ మొత్తాన్ని మరికొంత పెంచి రూ.25 వేలు చేశారు. ఈ గిఫ్ట్ కూపన్లను గురువారం నాడే వారి ఇళ్లకు చేరవేశారు. ప్రజల నుంచి వివిధ పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్మును కార్పొరేటర్లు, అధికారులు నిస్సిగ్గుగా పంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన కార్పొరేటర్లు విలాసాలు...విహార యాత్రలతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చెయ్యడం సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అధ్యయన యాత్రల పేరిట జీవీఎంసీ నిధులతో తరచూ ఇతర రాష్ట్రాలకు షికార్లు వెళ్లున్నారు. నగరంలో కొన్నాళ్లుగా పలు ప్రాంతాల్లో వీధి లైట్లు వెలగడం లేదు. సరిగా మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల నిర్వహణ వంటి విషయాల్లో నిధుల లేమి అంటూ తప్పించుకుంటున్నారు. అయితే ఇది కొత్త సంప్రదాయం కాదని, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నదేనని కొంతమంది కార్పొరేటర్లు సమర్థించుకుంటున్నారు.
ఎంతమందికీ కూపన్లు?
జీవీఎంసీలో మొత్తం మేయర్ సహా 98 మంది కార్పొరేటర్లున్నారు. వీరిలో 21వ వార్డు కార్పొరేటర్ సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ గెలిచాక ఎమ్మెల్సీగాను, కొన్నాళ్ల తర్వాత ఎమ్మెల్యేగాను ఎన్నికయ్యారు. ఆ వార్డుకు మళ్లీ ఎన్నిక జరగలేదు. అందువల్ల జీవీఎంసీలో 97 మంది కార్పొరేటర్లే ఉన్నారు. వీరితో పాటు జీవీఎంసీలో కీలక స్థానాల్లో ఉన్న కొంతమంది అధికారులకు కూడా ఈ గిఫ్ట్ కూపన్లు ఇస్తుంటారు. ఇలాంటి వారు మరో 50 మంది వరకు ఉంటారు. కార్పొరేటర్లు, అధికారులు వెరసి దాదాపు 150 మందికి గిఫ్ట్ కూపన్లు వారి వారి ఇళ్ల వద్ద అందజేశారు. 150 మందికి రూ.25 వేల చొప్పున లెక్కిస్తే ఆ మొత్తం రూ.35 లక్షలు అవుతుంది. అనధికారికంగా ఇచ్చే ఈ గిఫ్ట్‌ల సొమ్మును అధికారిక రికార్డుల్లో మరో రూపంలో చూపిస్తుంటారు. జీవీఎంసీ పాలకవర్గం ఎన్నికై నాలుగేళ్లు పూర్తయింది. మరో ఏడాది పాటు వీరు కార్పొరేటర్ల పదవిలో ఉంటారు. ఏడాదిలో పదవి నుంచి దిగిపోనున్న వీరు ఈ గిఫ్ట్ కూపన్లు అందుకుని ఖుషీగా ఉన్నారు. జీవీఎంసీ కార్పొరేటర్లకు ఇచ్చిన రూ.25 వేల విలువ చేసే కూపన్లతో బంగారం/ వెండి వస్తువులు గాని, లేదా వస్త్రాలు, దుస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. విశాఖ నగరంలోని సీఎంఆర్‌లో ఇవి చెల్లుబాటు అవుతాయి.
ఒకరిద్దరు మినహా..
జీవీఎంసీ కార్పొరేటర్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా ఈ గిఫ్ట్ కూపన్లు తీసుకున్నారు. వీరిలో ఒకరు 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఈయన జనసేన నుంచి ఎన్నికయ్యారు. ప్రజల సొమ్ముతో ఇచ్చే ఈ కూపన్లు అనైతికమని భావించి తన కూపన్‌ను తిరిగి అధికారులకు ఇచ్చేశారు. తనకిచ్చిన గిఫ్ట్ కూపన్‌ను జీవీఎంసీ అదనపు కమీషనర్ ఫైనాన్స్ ఎస్‌ఎస్‌వర్మకు అందజేశారు. ఇలా కార్పొర్పొరేటర్లు, అధికారులకు గిఫ్ట్ కూపన్ల ద్వారా సుమారు రూ.35 లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేయడం మేయర్, డిప్యూటీ మేయర్లకు తగదన్నారు. ఈ మొత్తాన్ని వార్డుల్లోని సమస్యలకు వెచ్చిస్తే సముచితంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.
ఇంతకీ బడ్జెట్ సమావేశం జరుగుతుందా?
ఇప్పటికే జీవీఎంసీలో మేయర్ కుర్చీ కోసం కూటమి నేతలు కుస్తీలు పడుతున్నారు. వైసీపీ చేతిలో ఉన్న మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి కిందా మీదా పడుతున్నారు. వైసీపీ కార్పొరేటర్లకు ప్రలోభపెట్టి ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను టీడీపీ, జనసేన పార్టీల్లోకి లాగేసుకున్నారు. వాటికి ఆశపడ్డ కార్పొరేటర్లు నిస్సిగ్గుగా జంప్ చేసేశారు. ఇలా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన సంఖ్యకు చేరువలోకి వచ్చేశారు. ఆ బలంతో మేయర్‌పై కూటమి నేతలు అవిశ్వాసం నోటీసును కూడా ఇటీవల కలెక్టర్‌కు అందజేశారు. ఇంతలో ఇప్పటికే పార్టీ ఫిరాయించి కూటమి కోటలోకి చేరిన కార్పొరేటర్లు మళ్లీ వైసీపీ గూటికి వెళ్లిపోకుండా కూటమి నేతలు, మిగిలి ఉన్న కొద్ది మంది కార్పొరేటర్లను కూటమి నేతలు తన్నుకు పోకుండా వైసీపీ నేతలు ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. కొందరు కార్పొరేటర్లను సుదూరంగా తీసుకుపోయి క్యాంపులు నిర్వహిస్తున్నారు. వారికి సకల రాచమర్యాదలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో శనివారం జరిగే బడ్జెట్‌పై నీలి నీడలు అలముకున్నాయి. బడ్జెట్ జరగడం అనుమానమేనని కార్పొరేటర్లు అంటున్నారు. తమకు కోరం ఉన్నా బడ్జెట్ సమావేశం నిర్వహించడం ఇష్టం లేదని కూటమి నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం బడ్జెట్ సమావేశం ఎలా జరుగుతుందోనన్న ఉత్కంఠ జీవీఎంసీ వర్గాలతో పాటు నగర వాసుల్లోనూ ఉంది.