రోజుకు సగటున ఒక వ్యక్తి ఎన్ని గ్రాముల పాలు తాగుతున్నాడో తెలుసా?
జాతీయ పాల దినోత్సవం సందర్భంగా అధికారులు ఏమి చెప్పారంటే...
జాతీయ పాల దినోత్సవం సందర్భంగా అధికారులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం పాల దినోత్సవాన్ని నిర్వహించారు. క్షీర విప్లవ పితామహుడు డా. వర్గీస్ కురియన్ జన్మదినం సందర్భంగా ఈ పాల దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించింది.
పాలు మానవ ఆరోగ్యానికి సంపూర్ణ ఆహారం అని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకులు డా. దామోదర్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో 8 కోట్లకు పైగా రైతులు పాడి రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచ పాల ఉత్పత్తిలో 24.64 శాతం భారతదేశం వాటా కాగా, గత తొమ్మిదేళ్లలో దేశంలో పాల ఉత్పత్తి 58 శాతం పెరిగిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పరంగా గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 2024-25లో రాష్ట్రంలో 139.46 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగింది. దీంతో దేశంలో 7వ స్థానంలో నిలిచింది. సుమారు 25 లక్షల మంది రైతులు పశుపోషణ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ప్రస్తుతం పాలు, పాల ఉత్పత్తుల విలువ రూ. 713.9 బిలియన్లుగా ఉండగా, 2033 నాటికి దీన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వినూత్న రాయితీ పథకాలు అమలు చేస్తోంది.
21వ అఖిల భారత పశుగణన (2025) ప్రకారం రాష్ట్రంలో 46 లక్షల ఆవులు (దేశంలో 14వ స్థానం), 62.19 లక్షల గేదెలు (6వ స్థానం) ఉన్నాయి. 2033 నాటికి పాల ఉత్పత్తిని 150 లక్షల టన్నులకు చేర్చి, 15 శాతం వార్షిక వృద్ధి రేటుతో దేశంలో తొలి మూడు స్థానాల్లో నిలవాలన్న లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది.
ఆసక్తికర విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి రోజుకు సగటున 719 గ్రాముల పాలు వినియోగిస్తున్నాడు. ఇది జాతీయ సగటు (459 గ్రాములు) కంటే బాగా ఎక్కువ.
పశుపోషకుల సంక్షేమం, ఉత్పాదకత పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. రైతు సేవా కేంద్రాల ద్వారా ఇంటింటికీ పశు వైద్య సేవలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, గర్భకోశ వ్యాధుల చికిత్స, లింగ నిర్ధారిత వీర్య నాళికల పంపిణీ, పశు బీమా, సంచార పశు వైద్య వాహనాలు, గోకులాలు, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, దాణా, పశుగ్రాస అభివృద్ధి పథకాలు అమలు జరుగుతున్నాయి.
“పాడి రంగం గ్రామీణ గౌరవానికి, ఆర్థిక స్థిరత్వానికి చిహ్నం. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ రైతులకు అండగా ప్రభుత్వం నిలవాలి” అని ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పాల దినోత్సవ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు.