నామినేటెడ్ పోస్టులపై టీడీపీలో అసంత్రుప్తి

ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీపై టీడీపీలో అసంత్రుప్తులు ఉన్నాయి. సీనియర్లను బుజ్జగించే పనిలో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.

Update: 2024-09-26 12:40 GMT

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నామినేడెడ్ పోస్టుల ఎంపికలో పనిచేసే వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించలేదనే అసంత్రుప్తి టీడీపీలోని సీనియర్ నాయకుల్లో ఉంది. 20 కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమించారు. వంద మందికి పైన డైరెక్టర్లను నియమించారు. వారి వివరాలు నేరుగా ఆయా శాఖలకు పంపించారు. ఎవరినైతే పోస్టులు దక్కాయో వారికి నేరుగా విషయం తెలియజేశారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో ఆచి తూచీ అడుగులు వేశామని చెబుతున్నారే కాని అటువంటిదేమీ కనిపెంచలేదని పార్టీ వారే అంటున్నారు.

బీసీలకు సంబంధించి 56 కార్పొరేషన్ లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ లకు ఇంకా నియామకాలు జరగలేదు. ప్రస్తుతం ప్రకటించిన డైరెక్టర్లు, చైర్మన్ పోస్టుల్లో సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పటం విశేషం. కూటమి ప్రభుత్వం కావడంతో కార్పొరేషన్ చైర్మన్ ల విషయంలో ఆచి తూచీ అడుగులు వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పూర్తి అంసత్రుప్తిలో ఉన్నట్లు తెలిసింది. మొదటి నుంచీ తనకు ఆర్టీసీ చైర్మన్ పోస్టు వస్తుందనే ధీమాలో ఉన్నారు. పార్టీ టిక్కట్ దక్కలేదు. అనుకున్న ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కలేదు. దీంతో కక్కలేక మింగలేక ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నప్పటికీ ఎందుకు పక్కన బెట్టారో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయని ఉమా అనుచరులు, సహచరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్ పోస్టును మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు ఇచ్చారు. కొనకళ్లకు

ఇచ్చిన ప్రయారిటీ తనకు ఎందుకు ఇవ్వలేదనేది ఉమా వాదన. పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి తీసుకు పోవడంలో ఎప్పుడూ ముందుంటున్నానని చంద్రబాబు వద్ద అన్నట్లు సమాచారం.

సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పలువురు సీనియర్లు ఆశించారు. వారికి పదవి దక్కలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ గా జనసేన నేత తోట మెహర్‌ సుధీర్‌ను నియమితులయ్యారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా జనసేన పార్టీ కార్యదర్శి నాదెండ్ల మనోహర్ ఉండటం వల్ల కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా జనసేనకే కేటాయించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ వంటి వారికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన కూడా తెరపైకి వచ్చింది. కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే స్థాయి వారికి డైరెక్టర్లుగా అవకాశం కల్పించి అది గొప్పగా చెప్పుకోవడం ఏమిటనేది ప్రశ్న. గతంలో వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వంతల రాజేశ్వరి తెలుగుదేశంలో చేరారు. గత ఎన్నికల్లో ఆమెకు సీటు దక్కలేదు. నామినేటెడ్ పదవుల్లో నైనా చైర్మన్ అవకాశం ఉంటుందని భావించింది. అయితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో డైరెక్టర్ పదవి ఇచ్చారు. సివిల్ సప్లైస్ లో చాలా మంది సీనియర్లకు డైరెక్టర్లుగా ఇవ్వడంపై అసంత్రుప్తి ఉంది.

బీజేపీ నుంచి లంకా దినకర్ ను 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ గా నియమించారు. ఒకప్పుడు లంకా దినకర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడేనని, అటువంటి వారికి అవకాశాలు ఇచ్చి పార్టీ కోసం డెడికేటెడ్ గా పనిచేస్తున్న వారికి అవకాశాలు కల్పించడం లేదని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై కూడా బీజేపీలో అసంత్రుప్తి పెరుగుతోందని బీజేపీలోని సీనియర్లు చెబుతున్నారు.

కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ ల చైర్మన్లు, డైరెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. చాలా మందికి పదవులు రాలేదనే అసంత్రుప్తిలో ఉన్నారని నాకు తెలుసు. పదవులు అయిపోలేదు. 20 కార్పొరేషన్లకే ఇచ్చాం. ఇంకా చాలా కార్పొరేషన్ లు ఉన్నాయన్నారు. దీనిని బట్టి పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తీవ్ర అసంత్రుప్తి ఉందనేది స్పష్టమవుతోంది.

గతంలో ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు, పార్టీకి ఎప్పటి నుంచో విధేయులుగా ఉన్నవారు, సమర్ధత ఆధారంగా వీటిని భర్తీ చేసినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా నెల్లూరు జిల్లాకు చెందిన అబ్దుల్ అజీజ్ ను నియమించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ గా అనిమిని రవినాయుడును నియమించారు. ఏపీ హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్ గా బత్తుల తాత్యబాబుకు అవకాశం దక్కింది. ఏపీ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (ఏపీ ట్రైకార్) చైర్మన్ గా బొరగం శ్రీనివాసులును నియమించారు. ఏపీ మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్ గా దామచర్ల సత్యను నియమించారు. సీడాప్ ఛైర్మన్ గా దీపక్ రెడ్డిని నియమించారు. 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ గా బీజేపీ నేత లంకా దినకర్ కు అవకాశం ఇచ్చారు. ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్ గా కర్రోతు బంగార్రాజును నియమించారు. ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డికు అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) చైర్మన్ గా మంతెన రామరాజు ను నియమించారు. ఏపీ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా నందం అబద్దయ్య ను నియమించారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నూకసాని బాలాజీకి అవకాశం దక్కింది. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణకు, వైస్ చైర్మన్ గా పిఎస్‌ మునిరత్నంను నియమించారు. ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణకు అవకాశమిచ్చారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పిల్లి మాణిక్యాల రావును నియమించారు. ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి ఛైర్మన్ గా పీతల సుజాతను నియమించారు. ఏపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన) ను నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ గా జనసేన నేత తోట మెహర్‌ సుధీర్‌ను నియమించారు. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా వజ్జా బాబురావుకు అవకాశమిచ్చారు. ఏపీ టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ టిడ్కో ఛైర్మన్ గా జనసేన నేత వేములపాటి అజయ్‌కుమార్‌ ను నియమించారు.


Tags:    

Similar News