కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజా జీవనంలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఐటీ, ఈ–గవర్నెన్స్ అంశాలతో పాలనలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత కీలకమన్నారు. సోమవారం విశాఖలోని ఓ హోటల్లో సివిల్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స ్ఫర్మేషన్ పేరిట కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించే 28వ జాతీయ ఈ–గవర్నెన్స్ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, తదితర అంశాలపై సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన సదస్సునుద్దేశించి ప్రసంగించారు. ఇంకా ఆయనేమన్నారంటే?
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పెరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈసేవ, మీసేవల ద్వారా పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లాం. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మన మిత్ర పేరిట 751 పౌర సేవలు అందిస్తున్నాం. ఐటీ సంస్కరణల వల్ల విస్తృత ప్రయోజనాలను అందిపుచ్చుకో గలుగుతున్నాం. గతంలో నాలెడ్జి ఎకానమీ ద్వారా తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో రాణిస్తున్నారు. ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టును ప్రారంభించాం. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంస్థలతో కలిసి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో అక్కడ ఒక ఎకో సిస్టం ఏర్పాటవుతుంది. క్వాంటమ్ కంప్యూటర్లు, పరికరాల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఏపీలో వైద్య సేవలను అనుసంధానం చేసే సంజీవని ప్రాజెక్టును చేపట్టాం.
ఈ ఫైల్స్‌తో శరవేగంగా నిర్ణయాలు..
ఈ–ఫైల్స్, ఈ–కేబినెట్ లాంటి వాటితో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశాల్లో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా కీలకం కాబోతోంది. పాలనా ట్రాన్స్ ఫర్మేషన్‌ను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. సర్వీసులు, ఉద్యోగాలు, ఉత్పాదన అంశాలు వేగంగా మారుతున్నాయి. వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదంతో ఏపీ ముందుకు వెళ్తోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నూతన పారిశ్రామికవేత్తలను, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం.
టెక్నాలజీతో వైద్య సేవల అనుసంధానం..
టెక్నాలజీతో వైద్య సేవలను అనుసంధానించేలా చర్యలు తీసుకున్నాం. సంజీవని పేరిట డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టాం. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలుకు ఈ టెక్నాలజీని అందిస్తాం. భవిష్యత్తు అంతా డేటా టెక్నాలజీ ఆధారంతోనే నడుస్తుంది. ఈజ్ ఆఫ్ లివింగ్ విధానం ప్రజలకు చేరువ చేయాలి. ప్రస్తుతం యాప్‌ల ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలు విదేశాలకు వెళ్తున్నాయి. గతంలో బిజినెస్ ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా మన యువతకు ఉద్యోగావకాశాలు లభించాయి.
సెమీ కండక్టర్‌పై దృష్టి సారించాలి..
ప్రస్తుతం సెమీ కండక్టర్ పరిశ్రమపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. సెమీ కండక్టర్ పరిశ్రమను ఏపీకి కేటాయించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ప్రధాని స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. దానికనుగుణంగా మన దేశంలోని ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్స్‌గా మారాలి. ఏపీలో టెక్నాలజీ పరంగా స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్‌టెక్ పార్కులు ఉన్నాయి. చాలా మంది యువత ఐఐఎం, ఐఐటీల నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎంపికవుతున్నారు. ఇంకెందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఇది మనందరికీ గర్వకారణం. జాతీయ అభివృద్ధిలో ఏపీ కూడా భాగస్వామి అవుతుంది. ప్రపంచంలో ఐటీలో భారతీయులు చాలా నిపుణులు. నిష్ణాతులు. అందుకే ప్రపంచ దేశాల్లో వీరు తమ ప్రతిభతో ఐటీ రంగంలో రాణిస్తున్నారు. కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) వినియోగంలో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో మనదేశమే ఉంది. రెండు రోజులు జరిగే ఈ–గవర్నెన్స్ సదస్సులో కొత్త సంస్కరణలకు ఆలోచనలు పంచుకోండి.
నా పీపీటీకి బిల్ గేట్స్ ఆశ్చర్యపోయారు..
నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యాక బిల్ గేట్స్ ఢిల్లీ వస్తున్నారని తెలిసి ఆయన్ను కలవాలనుకున్నా. ఆయనతో పది నిమిషాలు కావాలని అడిగాను. ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో నేనిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ)కు బిల్‌గేట్స్ ఆశ్చర్యపోయి ఏం కావాలని అడిగారు. మేం అన్ని రంగాల్లో మేధావులం. మాకు మీ సపోర్టు కావాలన్నాను. ఇండియాలో ఐటీ విప్లవానికి నేను ప్రధాన పాత్ర పోషించాను. హైదరాబాద్‌లో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు ఒక చరిత్ర. అప్పట్లో బీఎస్‌ఎన్‌ఎల్, ఇంటర్నేషనల్ కాల్స్ రెండే ఉండేవి. నా కొడుకు అమెరికాలో చదువుకునే రోజుల్లో ఫోన్‌లో మాట్లాడితే వేలల్లో బిల్లు చెల్లించేవాడిని. అప్పటి ప్రధాని వాజ్‌పేయికి సెల్‌ఫోన్ల ఆవశ్యకతపై రిపోర్టు ఇచ్చాను. ఆ తర్వాత 2జీ నుంచి ఇప్పడు 6జీకి వచ్చాం. ఈ–గవర్నెన్స్‌ను తొలిసారిగా నేనే ప్రారంభించాను.
అప్పట్లో ఎస్‌ఎం కృష్ణే నాకు పోటీ..
ఆ రోజుల్లో టెక్నాలజీలో నాకు కర్నాటక సీఎం ఎస్‌ఎం కృష్ణ ఒక్కరే పోటీ. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలూ ఆరోగ్యకరమైన పోటీనిస్తున్నాయి. గతంలో హైదరాబాద్ ఐటీకి పునాది. నలుగురు ఐటీ మేధావుల్లో ఒకరు భారతీయుడు ఉంటున్నాడు. ప్రతి నలుగురి భారతీయుల్లో ఒకరు ఏపీకి చెందిన వారు కావడం గర్వకారణం. వికసిత భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.