Revanth and defection MLAs|పదినియోజకవర్గాలపైన రేవంత్ ఫోకస్ పెట్టాడా ?
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలకు కాంగ్రెస్ పార్టీలోని ఒరిజినల్ నేతలకు కొన్నిచోట్ల పడటంలేదు.;
రాబోయే స్ధానికసంస్ధలఎన్నికలకు సంబంధించి రేవంత్ పదిఅసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణాలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా రేవంత్(Revanth) ప్రత్యేకంగా పదినియోజకవర్గాల మీదమాత్రమే ఎందుకు దృష్టిసారించినట్లు ? ఎందుకంటే ఈ 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎంఎల్ఏ(BRS MLAs)లు కాంగ్రెస్(Congress) లోకి ఫిరాయించారు కాబట్టే. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలకు కాంగ్రెస్ పార్టీలోని ఒరిజినల్ నేతలకు కొన్నిచోట్ల పడటంలేదు. దాంతో పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో గొడవలవుతున్నాయి. పరిస్ధితి ఇలాగే కంటిన్యు అయితే తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీకి నష్టంతప్పదు. ఆ నష్టం రేవంత్ ప్రభుత్వంపై నెగిటివ్ గా పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ అందుకనే ఫిరాయింపు ఎంఎల్ఏలతో పాటు వచ్చిన నేతలకు, ఒరిజినల్ నేతలకు మధ్య సయోధ్య కుదర్చాలని నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలకు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చినట్లు పార్టీనేతల టాక్.
స్టేషన్ ఘన్ పూర్ నుండి కడియంశ్రీహరి, ఖైరతాబాద్ నుండి దానం నాగేందర్, రాజేంద్రనగర్ నుండి ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి నుండి అరెకపూడి గాంధి, పటాన్ చెరు నుండి మహిపాల్ రెడ్డి, భద్రాచలం నుండి తెల్లం వెంకటరావు, గద్వాల నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బాన్సువాడ నుండి పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ళ నుండి కాలే యాదయ్య, జగిత్యల నుండి డాక్టర్ సంజయ్ కుమార్ ఎంఎల్ఏలుగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. తాము కాంగ్రెస్ లోకి ఫిరాయించటంతో పాటు తమమద్దతుదారులను కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ నుండి తమతో పాటు కాంగ్రెస్ లోకి వచ్చారు కాబట్టి ఎంఎల్ఏలు తమ మద్దతుదారులకే టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు.
ఫిరాయింపు ఎంఎల్ఏలను కాపాడుకోవాలి కాబట్టి రేవంత్ జిల్లాల మంత్రులతో పాటు ఇన్చార్జి మంత్రులకు కూడా వీళ్ళకు టాప్ ప్రయారిటి ఇవ్వమని ఆదేశించారు. దాంతో ఫిరాయింపులపై పోటీచేసిన ఓడిపోయిన కాంగ్రెస్ నేతలతో పాటు వాళ్ళ మద్దతుదారులకు నియోజకవర్గాల్లో పెద్దగా బాగా ప్రాధాన్యత దక్కటంలేదు. పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహారాలు, పనుల్లో కూడా ఫిరాయింపు ఎంఎల్ఏలతో పాటు వాళ్ళ మద్దతుదారుల మాటే చెల్లుబాటు అవుతుండటంతో ఒరిజినల్ నేతలతో వాళ్ళమద్దతుదారులకు మండిపోతోంది. దాంతో నియోజకవర్గాల్లో తరచూ వివాదాలు రేగుతున్నాయి. ఒక్కోసారి వివాదాలు పెరిగిపోయి భౌతిక దాడులకు కూడా దారితీస్తున్నాయి. ఈమధ్య జగిత్యాల(Jagityal)లో జరిగిన దాడి ఘటనే ఉదాహరణ.
జగిత్యాలలో ఫిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ కు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంఎల్సీ జీవన్ రెడ్డి(Jeevanreddy)కి ఏమాత్రం పడటంలేదు. కారణాలు ఏవైనా ఈమధ్య సంజయ్ మద్దతుదారుడు ఎంఎల్సీ మద్దతుదారుడిపై దాడిచేశాడు. ఆ దాడిలో ఎంఎల్సీ మద్దతుదారుడు చనిపోయాడు. దాంతో నియోజకవర్గంలో ఎంఎల్ఏ-ఎంఎల్సీ మద్దతుదారుల మధ్య పెద్ద గొడవే అయ్యింది. వీళ్ళని సర్దుబాటు చేయటానికి మంత్రులు జోక్యంచేసుకోవాల్సొచ్చింది. మంత్రుల జోక్యం కారణంగా ఇద్దరి మధ్యా జరిగిన సర్దుబాటు తాత్కాలికమేనని అందరికీ తెలుసు. సంజయ్ పై జీవన్ రెడ్డి మద్దతుదారులు లోలోపల మండిపోతున్నారు. ఈనేపధ్యంలో రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఎంఎల్ఏ-ఎంఎల్సీ ఏకంకాకపోతే గ్రూపుల కారణంగా పార్టీనష్టపోవటం ఖాయం. పై ఇద్దరిలో పోటీకి టికెట్ ఏవర్గానికి దక్కినా ప్రత్యర్ధివర్గం కచ్చితంగా వ్యతిరేకం చేస్తుందనే ప్రచారం నియోజకవర్గంలో పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అభ్యర్ధులను ఓడించటానికి బీఆర్ఎస్, బీజేపీ(BJP)లు అవసరంలేదని కాంగ్రెస్ లోని వర్గాలే ఒకదాన్ని మరోవర్గం ఓడిస్తుందనే ప్రచారం హైలైట్ అవుతోంది.
జగిత్యాలలోనే కాకుండా మిగిలిన ఫిరాయింపు నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిణామాలే జరగాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కోరుకుంటోంది. ఎందుకంటే కాంగ్రెస్ లోని రెండువర్గాలు ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకుంటే ముందు లాభపడేది తామే అని బీఆర్ఎస్ నేతలు చాలాఆశలు పెట్టుకున్నారు. ఫిరాయింపు నియోజకవర్గాల్లో స్ధానికసంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయంటే రేవంత్ కు ఇబ్బందులు తప్పవు. ఎలాగంటే బీఆర్ఎస్ లోని ఇంకా కొంతమంది ఎంఎల్ఏలను లాగేసుకునేందుకు రేవంత్ పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. ఎంతమంది ఎంఎల్ఏలను వీలుంటే అంతమందినీ లాగేసుకుని కారుపార్టీని పూర్తిగా దెబ్బకొట్టాలన్నది రేవంత్ లక్ష్యం. స్ధానికసంస్ధల ఎన్నికల్లో మిగిలిన నియోజకవర్గాలతో పాటు ఫిరాయింపుల నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ మంచిఫలితాలు సాధిస్తేనే కారుపార్టీలోని మరింతమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించేందుకు ధైర్యంచేస్తారు.
ఇలాంటి అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఫిరాయింపు నియోజకవర్గాల్లో వివాదాల సర్దుబాటుకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఫిరాయింపు నియోజకవర్గాలున్న జిల్లాల మంత్రులు, ఇన్చార్జిమంత్రులకు రేవంత్ సయోధ్య బాధ్యతలను అప్పగించారు. పై నియోజకవర్గాల్లోని ఫిరాయింపు ఎంఎల్ఏలకు పార్టీలోని ఒరిజినల్ నేతలకు మధ్య వీలైనంత తొందరగా సయోధ్యచేయాలని రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ఎందుకంటే స్ధానికసంస్ధల ఎన్నికలు ఫిబ్రవరి లేదా ఏప్రిల్ నెలల్లో జరగుతాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. టికెట్లపంపిణీలో కూడా రెండువర్గాలకు కేటాయింపులు చేసేట్లుగా రాజీసూత్రం అమలుచేయబోతున్నట్లు తెలిసింది. ప్రతినియోజకవర్గంలోను సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీల స్ధానాలు కొన్ని వందలుంటాయి. కాబట్టి పోస్టుల సంఖ్యను బట్టి ఫిరాయింపులకు కొన్ని, పార్టీలోని నేతలకు మిగిలినవి కేటాయించేట్లుగా రేవంత్ రాజీసూత్రాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం. మరీ రాజీసూత్రం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ? వర్గాలు పార్టీవిజయంకోసం ఏమేరకు ఏకతాటిపై నిలుస్తాయన్నది చూడాల్సిందే.