ప్రభుత్వంలో సినిమా పాత్రను పవన్ కల్యాణ్ ప్రతిబింబించాడా?
సినిమా పరిశ్రమలోని ముఖ్యులను ఉప ముఖ్యమంత్రి, సీనీ హీరో పవన్ కల్యాణ్ చీల్చి చెండాడారు. గౌరవం ఇచ్చినా దక్కించుకోవడం లేదనేది ఆయన మాట.;
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ప్రభుత్వం, సినీరంగం రెండు కళ్లు లాంటివి. సినిమా వాళ్ల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వ బాధ్యతను గుర్తుకు తెచ్చుకుంటూ పవన్ కల్యాన్ విడుదల చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం పాలన మొదలు పెట్టి దాదాపు ఏడాది కావస్తున్నా పాలకులపై కనీస గౌరవం చూపేందుకు కూడా సినీ పరిశ్రమ వారు రావడం లేదంటే పాలకులకు ఎలా ఉంటుందో ఆయన చేసిన ప్రకటన తెలిపిందని చెప్పొచ్చు. తెలుగు చిత్రసీమ ఏకీకృతంగా సహకరించడంలో విఫలమైనందుకు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. సినీ రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధిని ప్రోత్సహించే ప్రభుత్వ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, చిత్రసీమ కనీస మర్యాద, ఐక్యతను చూపించడంలో విఫలమైందని పవన్ కల్యాణ్ తీవ్రమైన స్పందన, వివరణాత్మక ప్రకటన తెలియజేస్తోంది.
ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలుగు చిత్రసీమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అధికారికంగా సమావేశం కాలేదు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వంటి సంస్థలు మర్యాదపూర్వక సమావేశాలను మొదులు పెట్టలేదు. పవన్ కల్యాణ్ ఏకీకృత ప్రాతినిధ్యం కోసం పదేపదే పిలుపునిచ్చినప్పటికీ జరగక పోవడం ఆయనకు కోపం తెప్పించిందనేది సీనీ ప్రముఖుల వాదన. దిల్ రాజు, అల్లు అరవింద్, డి సురేశ్ బాబు, వై సుప్రియ, చిన్న బాబు, సి అశ్వనీదత్, నవీన్ ఎర్నేని వంటి ప్రముఖ నిర్మాతలు తమ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచమని కోరడానికి వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని సంప్రదించారు. ఈ విచ్ఛిన్న విధానం పరిశ్రమ ఒక ఐక్య యూనిట్‌గా పనిచేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని భావించిన పవన్ కల్యాణ్ ను కలవరపరిచేలా చేసిందనే వాదన కూడా ఉంది.
ఎన్‌డీఏ ప్రభుత్వం సహకరించే వైఖరిని గత ప్రభుత్వం కఠిన వైఖరితో పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పోల్చారు. గత ప్రభుత్వం అగ్ర నటులు, సాంకేతిక నిపుణులను అవమానించిందని, వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని కక్ష సాధింపులకు దిగిందని, సినిమా విడుదల సమయంలో థియేటర్ల వద్ద తహసీల్దార్లను నియమించి అడ్డంకులు సృష్టించిందని ఆరోపణలు ఉన్నాయి. అయతే ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యవస్థాగత అభివృద్ధిని నొక్కిచెప్పింది. వ్యక్తిగత అనుబంధాలతో సంబంధం లేకుండా సినిమాలను ప్రోత్సహించింది. ఉదాహరణకు అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన సినిమా విడుదలకు మద్దతు ఇచ్చింది. ఈ మార్పును పరిశ్రమ గుర్తించకపోవడం, కృతజ్ఞత లేకపోవడం వంటివి ‘రిటర్న్ గిఫ్ట్’గా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ నిరాశకు ఇవి కూడా కారణాలని చెప్పొచ్చు.
పరిశ్రమలో ఐక్యత లేకపోవడం, బాధ్యతారాహిత్యాన్ని బహిరంగంగా ఎత్తిచూపుతుంది. వ్యక్తిగత లాబీయింగ్‌ను ఇకపై అనుమతించేది లేదని సంకేతం ఇచ్చారు. పరిశ్రమ సంస్థల అధికారిక ప్రతినిధులతో మాత్రమే చర్చలు జరుపుతామని, వ్యక్తిగత అభ్యర్థనలను సంబంధిత విభాగాలకు పంపుతామని నిర్ణయించారు తన ప్రకటనలో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ప్రభుత్వ చురుకైన చర్యలను వివరిస్తుంది. పరిశ్రమ అభివృద్ధి పట్ల దాని నిబద్ధతను చూపిస్తుంది. ఈ పాలసీ పరిశ్రమ హోదా కల్పించడం, 24 చిత్ర సంబంధిత విభాగాలలో నైపుణ్యాలను పెంపొందించడం, వర్క్‌షాప్‌లు, సెమినార్‌ల ద్వారా సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పరిశ్రమ మాత్రం కృతజ్ఞతా రాహిత్యంతో ఉందని ఆయన ప్రకటన చెబుతోంది.
థియేటర్ కార్యకలాపాలలో వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించే ఆలోచనగా పవన్ కల్యాణ్ మాటలు ఉణ్నాయి. పారదర్శకత, ప్రేక్షకుల సంక్షేమంపై పవన్ కల్యాణ్ దృష్టిని ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వం, ముఖ్యంగా లీజుకు తీసుకున్న థియేటర్లలో పన్ను విధానాలను పరిశీలిస్తోంది. టికెట్ అమ్మకాలు పన్ను, ఆదాయం మధ్య అసమానతలను పరిష్కరించే అవకాశం కనిపిస్తోంది. ఆహార పానీయాల అధిక ధరలు, పేలవమైన పారిశుధ్యం, మంచినీటి సౌకర్యాల కొరత వంటి సమస్యలు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, స్థానిక అధికారుల ద్వారా తనిఖీలకు ప్రేరేపించాయి. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి వంటి నగరాలలో మల్టీప్లెక్స్‌ల సంఖ్య, టికెట్ ధరలు, కార్యకలాపాల తేడాలను పరిశీలించడానికి సినిమాటోగ్రఫీ విభాగానికి ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన ప్రకటన తెలుపుతోంది.
పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా, చిత్రసీమ వ్యక్తిగా ఉన్నందున ఆయన పాత్ర ఎలా ఉండాలో ప్రతిబింబించే విధంగా ప్రకటన ఉందనే చర్చ రాష్ట్ర ప్రజల్లో జరుగుతోంది. ఈ సమస్యను వ్యక్తిగత, వృత్తిపరమైనదిగా ఉందనే వాదన కూడా కొందరు సినీ రంగంలోని వారి నుంచి వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను పరిశ్రమ మరచిపోయినట్లు కనిపించడం, ఎన్‌డీఏ ఏకీకృత అభివృద్ధి దృష్టితో సమన్వయం చేయడంలో విఫలం అయిందనే నిరాశ పవన్ కల్యాణ్ లో కనిపిస్తోంది. వివరణాత్మక ప్రజా ప్రకటన జారీ చేయడం ద్వారా పవన్ కల్యాణ్ స్పష్టమైన అంచనాలను నిర్దేశించాలని, పరిశ్రమను ఐక్యత వైపు నడిపించాలని, అభివృద్ది పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించాలని, అసహకారాన్ని సహించబోమని సంకేతం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అర్థమవుతోంది. ఇకపై పవన్ కల్యాణ్ అధికారిక ప్రతినిధులతో మాత్రమే చర్చలు జరుపుతామని చెప్పటం విశేషం.