కేటీఆర్ తోకముడిచారా ?
ఎప్పుడైతే మూసీ ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశంకు రెడీ అని చెప్పిందో కేటీఆర్ కంగుతిన్నట్లున్నారు.
మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ తోకముడిచినట్లే ఉన్నారు. మూసీనది ప్రాజెక్టుపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మూసీ ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశంకు రెడీ అని చెప్పిందో కేటీఆర్ కంగుతిన్నట్లున్నారు. పైగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావును మూసీనది సుందరీకరణ ప్రాజెక్టుపై చర్చలకు పిలిచే బాధ్యతను రేవంత్ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపైన పెట్టినట్లు బహిరంగంగానే ప్రకటించారు. ఈ విషయాన్ని బహుశా కేటీఆర్ ఏమాత్రం ఊహించినట్లు లేదు. అందుకనే అప్పటినుండి మూసీనదిపై దూకుడు కాస్త తగ్గించారు.
కొద్ది రోజుల గ్యాప్ తర్వాత పార్టీ ఆఫీసులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో సమావేశమయ్యారు. తర్వాత సహచర నేతలతో కలిసి మాట్లాడుతు మూసీ సుందరీకరణపై అఖిలపక్ష సమావేశంకాదని, మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలతో సమావేశం నిర్వహించాలని కొత్తగా డిమాండ్ చేశారు. మూసీ విషయంలో పార్టీల అభిప్రాయాలు కాదట, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సరికొత్త పద్దతికి తెరలేపారు. మూసీ సుందీరకరణ వెనుక భారీ కుంభకోణం ఉంది కాబట్టి ప్రజలకు అదేంటో వివరించి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు కేసీఆర్, కేటీఆర్ ఏ విషయంలో కూడా అఖిలపక్ష సమావేశం పెట్టిందే లేదు. ఏ విషయం మీదకూడా అసలు ప్రతిపక్షాలతో మాట్లాడాల్సిన అవసరమే లేదన్నట్లుగా తండ్రి, కొడుకులు వ్యవహరించారు. ప్రతిపక్షాలను అసలు రాజకీయపార్టీలుగానే తండ్రి, కొడుకులు గుర్తించేందుకు ఇష్టపడలేదు. అందుకనే పదేళ్ళ అధికారంలో విషయం ఏదైనా సరే తమిష్టప్రకారమే వ్యవహరించారు. అలాంటిది ఇపుడు మూసీ ప్రాజెక్టుపై రేవంత్ అఖిలపక్ష సమావేశం అనగానే కేటీఆర్ ఉలిక్కిపడింది. అఖిలపక్షం పేరుకే కాని అక్కడ జరిగేదేమీ ఉండదని కేటీఆర్ కు బాగా తెలుసు. ఎందుకంటే పదేళ్ళు తాము ఎలా వ్యవహరించారో ఇపుడు రేవంత్ కూడా అదే దారిలో నడుస్తున్నారని కేటీఆర్ కు బాగా తెలుసు.
అఖిలపక్షం పేరుతో నిర్వహించే సమావేశంకు తాను హాజరుకాకుండా ప్రజలతో సమావేశం పెట్టాలని డిమాండ్ చేస్తున్నది. ఇక్కడ సమస్య ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును టేకప్ చేసిందే కేటీఆర్. ఇపుడదే ప్రాజెక్టును రేవంత్ మరింత ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. తాము అధికారంలో ఉన్నపుడు మూసీనదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలు, నిర్మాణాలను క్లియర్ చేయాలని ఆదేశించిన కేటీఆర్ ఇపుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఈ విషయం అంతా అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. అప్పుడు కేటీఆర్ సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులు పడకతప్పదు. ఆ పరిస్ధితిని ముందుగానే ఊహించిన కేటీఆర్ అఖిలపక్షం విషయంలో తోకముడిచినట్లు కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఇక హైడ్రా గురించి మాట్లాడుతు బిల్డర్లను బెదిరించేందుకే ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చిందని ఆరోపించారు. హైడ్రాపేరుతో వసూళ్ళు జరగుతున్నట్లు కేటీఆర్ మండిపడ్డారు. బిల్డర్లు, వ్యాపారవేత్తల నుండి రేవంత్ సర్కార్ వసూళ్ళు చేస్తున్నట్లు చెప్పారు. రేవంత్ వల్ల హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆరోపించారు. దామగుండం నేవీ స్టేషన్ ఏర్పాటుపై మాట్లాడుతు రేవంత్ ఏమన్నా ఆర్మీలో పనిచేశాడా అని ఎద్దేవా చేశారు. ఉన్నట్లుండి రేవంత్ కు దేశరక్షణ గుర్తొచ్చిందే అని ఎగతాళి చేశారు. రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రా లేక బీజేపీలో ఉన్నారా అని సందేహం వ్యక్తంచేశారు. మూసీ ప్రాంతంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలిచ్చి, నల్లా, కరెంట్ బిల్లులు కట్టించుకుని ఇపుడు అవే ఇళ్ళని కూల్చేస్తామని చెప్పటాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. మూసీ పేరుతో రేవంత్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని జనాల్లోకి తీసుకెళతామని కేటీఆర్ ప్రకటించారు.