ఏపీకి తుపాను గండం తప్పినట్టేనా?

ఆంధ్రప్రదేశ్‌కు ‘సెన్యారా’ తుఫాన్‌ ముప్పు తప్పినట్టేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Update: 2025-11-23 09:44 GMT
ప్రస్తుతం తీవ్ర అల్పపీడన ఉపగ్రహ ఛాయా చిత్రం

కొద్ది రోజులుగా ఏపీని తుఫాన్‌ భయం వెంటాడుతోంది. మొన్నటి మొంథా తుఫాన్‌ రాష్ట్రంలో ఊహించినంతగా ప్రాణ నష్టం లేకపోయినా భారీ పంట, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. దీంతో రానున్న ‘సెన్యారా’ తుఫాన్‌ ఎలాంటి విపత్తును తెచ్చి పెడుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సెన్యారా తుఫాను చూపు ఆంధ్రప్రదేశ్‌ వైపే ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏం జరుగుతుందోనని ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌ వైపు కాకుండా పశ్చిమ బెంగాల్‌/బంగ్లాదేశ్‌ వైపు మళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

26 నుంచి భారీ వర్షాలు కురుస్తాయనుకున్నా..
దక్షిణ అండమాన్‌ సముద్రంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇదివరకే అంచనా వేసింది. ఆపై అది బుధవారం నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 26 నుంచి దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అయితే మారిన వాతావరణ పరిస్థితుల్లో వాయుగుండం తుపానుగా బలపడ్డాక దిశ మార్చుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఇదీ..
ఐఎండీ ఆదివారం నాటి నివేదిక ప్రకారం.. అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ 26 (బుధవారం) నాటికి తుఫాన్‌ (సెన్యార్‌)గా బలపడనుంది.
తుఫాన్‌ దిశ మార్చుకుంటుందా?
తొలుత వేసిన అంచనాల మేరకు తుఫాన్‌ నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించకుండా ఆగ్నేయ బంగాళాఖాతంలోనే కొనసాగనుంది. ఆపై అది దిశ మార్చుకుని పశ్చిమ బెంగాల్‌/బంగ్లాదేశ్‌ వైపు పయనించే అవకాశం ఉంది. అనంతరం అక్కడ తీరాన్ని దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా తుఫాన్‌ ముందస్తుగా అంచనా వేసినట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు వాటిల్లే అవకాశాల్లేవని వాతావరణ శాఖ అధికారి ఒకరు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు. అందువల్ల ఎవరూ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారాయన. ఈ తుఫాన్‌ ఏపీ తీరానికి చాలా దూరంలోనే దిశ మార్చుకుని పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించే వీలున్నందున రాష్ట్రంలో భారీ వర్షాలు కూడా కురవవని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 27వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి వర్షం/జల్లులే తప్ప చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలకు ఆస్కారం లేదని ఐఎండీ ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన నివేదికలో Ðð ల్లడించింది.
కొమరిన్‌ ప్రాంతంలో మరో అల్పపీడనం..
ఒకపక్క అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుండగా.. మరోపక్క మంగళవారం కొమరిన్, శ్రీలంక, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. అయితే ఈ అల్పపీడనం ఒకట్రెండు రోజుల్లో బలహీన పడడం గాని లేదా అరేబియా సముద్రంలో విలీనం కావడం గాని జరుగుతుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా బంగాళాఖాతం/అరేబియా సముద్రంలో వాయుగుండాలు లేదా తుఫాన్లు సంభవించినప్పుడు వాటికి చేరువలో (దాదాపు 200 కి.మీల దూరంలో) అల్పపీడనాలు ఏర్పడితే వాటిలో విలీనమై పోతాయి. కానీ మంగళవారం ఏర్పడే అల్పపీడనం.. బుధవారం ఏర్పడబోయే వాయుగుండానికి చాలా దూరంగా (500 కి.మీలలో) ఉండడం వల్ల విలీనానికి ఛాన్స్‌ లేదు. దీంతో శ్రీలంక సమీపంలో ఏర్పడబోయే అల్పపీడనం పొరుగున ఉన్న అరేబియా సముద్రంలోకి పయనించి అక్కడ వాయుగుండంగా బలపడేందుకు అవకాశాలున్నట్టు చెబుతున్నారు. మంగళవారం నాటి అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చని అంటున్నారు.
అల్పపీడనం వెళ్లాకే తుఫాన్‌కు కదలిక..
తాజా వాతావరణ పరిస్థితుల్లో మంగళవారం ఏర్పడడే అల్పపీడడనం బలహీనపడడమో లేక అరేబియాలోకి పయనించడమో జరిగేదాకా ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం, తుఫాన్‌కు కదలిక రాదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అప్పటివరకు అది మందగమనంతో ఉంటుందని, ఆ తర్వాతే అది దిశ మార్చుకునేందుకు వీలుందని, ఆపై పుంజుకుంటుందని వీరు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News