రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టండి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర సీఎస్, డీజీపీలకు లేఖ రాశారు.;
By : The Federal
Update: 2025-05-19 16:03 GMT
ఆపరేషన్ సిందూర్ అనంతరం రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని, తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర డీజీపీకి పవన్ కల్యాణ్ సోమవారం లేఖ రాశారు.
అందులో పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతిపరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం వచ్చింది. దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం అవసరం. విజయనగరంలో ఒక యువకుడికి ఐ.ఎస్.తో సంబంధాలున్నాయని, పేలుళ్లకు కుట్ర పన్నిన విషయాన్ని తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించి అరెస్టు చేసిన క్రమంలో మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాలి. ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల ఉనికిపై, వారి కదలికలపైనా అన్ని జిల్లాల అధికారులు తక్షణం అప్రమత్తమై, ఎక్కడైనా ఉగ్ర జాడలు కనిపిస్తే వారిపైన సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల పరిధిలో ఈ తరహా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. కాబట్టి తీర ప్రాంత నిఘా, తీర ప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
పహల్గాం ఉగ్ర దాడులు, తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని అక్రమ వలసదారులు, ఉగ్రవాద సానుభూతి పరులపై ఇప్పటి వరకూ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించి మరింత లోతుగా విచారణ చేపట్టాలని కోరారు. ఉత్తరాంధ్ర, గోదావరి, మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. స్లీపర్ సెల్స్, తీవ్రవాద సానుభూతిపరుల ఉనికిని గుర్తించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని తెలిపారు. గుంటూరుతోపాటు ఇతర జిల్లాల్లోనూ రోహింగ్యాల ఉనికిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. వీరిలో కొందరికి రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నాయనే సమాచారం వస్తోందని, ఇది ఆందోళనకర పరిణామం అని తెలిపారు.
అనుమానితుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ మొదలైన గుర్తింపు పత్రాలు ఎలా పొందారు? వారికి ఆశ్రయం ఎవరు ఇచ్చారు? స్థానికంగా వారికి ఎవరు సౌకర్యాలు కల్పిస్తున్నారు? వారికి సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థల గుర్తింపు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. జాతీయ భద్రత, ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలకు పవన్ కల్యాణ్ సూచించారు.