చలో సిద్దేశ్వరం.. పిలుపునిచ్చిన బొజ్జా దశరథరామిరెడ్డి

సిద్దేశ్వరం అలుగు 8వ వార్షికోత్సవం జూన్ 10న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు.

By :  Admin
Update: 2024-06-06 08:52 GMT

సిద్దేశ్వరం అలుగు 8వ వార్షికోత్సవం జూన్ 10న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకలను అంతా కలిసి విజయంవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాయలసీమ కరువు పరిష్కారానికి, శ్రీశైలం ప్రాజెక్ట్ జీవిత కాలం పెంచడానికి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం తప్పక చేయాల్సి ఉందని వివరించారు దశరథరామిరెడ్డి. ఈ సందర్బంగానే నంద్యాల సమితి కార్యాలయంలో సిద్దేశ్వరం అలుగు 8 వ వార్షికోత్సవ కరపత్రాలను సమితి కార్యవర్గ సభ్యులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రాయలసీమ అభివృద్ధికి అనేక హక్కులను కల్పించినప్పటికీ ఈ హక్కులు అమలుకు నోచుకోలేదు. గతంలో ఉన్న నీటి హక్కులను కూడా పాలకులు విస్మరించి రాయలసీమకు ద్రోహం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వేలాది మంది రైతులతో 31 మే 2016న రాయలసీమ ప్రజా సంఘాలు నిర్వహించాయి’’ అని ఆయన గుర్తు చేశారు.

ఈ చారిత్రాత్మక రాయలసీమ ఉద్యమ నేపథ్యంలో పాలకులు రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ‘‘సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలు రాయలసీమ అంశాలను తమతమ మ్యానిఫెస్టోలలో ప్రకటించాయి. కానీ పాలకులు 10 సంవత్సరాలుగా ప్రకటనలతో, కంటి తుడుపు చర్యలతో రాయలసీమను మోసం చేశారు. దీనితో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు పురోగతి సాధించకపోగా, సాగునీటి నిర్మాణాలు శిథిల నిర్మాణాలుగా నేడు దర్శనమిస్తున్నాయి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మన సాగునీటి హక్కులకు కేంద్రం అక్టోబర్ 2023లో తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌తో గండి కొడుతున్నా.. పాలక ప్రతిపక్షాలు నోరు మెదపక రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు హక్కుగా ఉన్న నీటిని కూడా పొందకుండా ఉండే పరిస్థితిని కలగజేస్తున్నాయి’’ అని విమర్శించారు.

సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన 8 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన డిమాండ్లు:-

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 41 శాతం భూభాగం ఉన్న రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో 41 శాతం నిధులు కేటాయించడంతో పాటు, రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతంతో సమానంగా రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో మరో 20 శాతం నిధులను అదనంగా కేటాయించాలి.

2. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ సాగు నీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాలి. విభజన చట్టం ప్రకారం దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెల్పాండ్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి, తద్వారా ఆదా అయిన కృష్ణా జలాలను పైప్రాజెక్టులకు అందించాలి.

3. రాయలసీమలో చట్టబద్ధమైన నీటి హక్కులను పరిరక్షిస్తూ, వాటి సంపూర్ణ వినియోగానికీ ప్రాజెక్టుల సక్రమ నిర్వహణకు కావలసిన గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, RDS కుడి కాలువ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలి.

4. రాయలసీమ ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు చేయాలి.

5. కల్వకుర్తి- నంద్యాల హైవేలో భాగంగా కృష్ణా నది పై నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్ బదులు “రోడ్ - కం‌ - అలుగు” నిర్మించేటట్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని నూతన ప్రభుత్వం ఒప్పించాలి.

6. పాలనా వికేంద్రీకరణలో భాగంగా చేపట్టాల్సిన హైకోర్టు, కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం, సీడ్ హబ్ (ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ది సంస్థ, విత్తన ధృవీకరణ కేంద్ర ప్రధాన కార్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు), హార్టికల్చర్ హబ్ (హర్టీకల్చర్ కమిషనరేట్, ఉద్యానవన విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం, హర్టీకల్చర్ మార్కెటింగ్, నిల్వ గిడ్డంగులు, రవాణా తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటు) అనేక రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, కార్పొరేషన్ కార్యాలయాలను రాయలసీమలో ఏర్పాటు చేయాలి.

7. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీ, గుంతకల్ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, అనంతపురంలో ఎయిమ్స్, చిత్తూరు జిల్లాలో బీహెచ్ఈఎల్ తదితర అంశాలను అత్యంత ప్రాధాన్యతతో సాధించాలి.

రాయలసీమ సమాజం ఇప్పుడు మేలుకోకపోతే రాయలసీమ భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది. రాయలసీమ తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు, పరిశ్రమల అవసరాలకు నీరు లభించని పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో భావితరాలు రాయలసీమలో నివసించడానికి, యువతకు ఉద్యోగాలకు, మొత్తం మీద రాయలసీమ భవిష్యత్తుకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో జూన్ 10, 2024 న చేపడుతున్న సిద్దేశ్వరం అలుగు 8 వ వార్షికోత్సవంలో పెద్ద ఎత్తులో విద్యార్థులు, యువత, రైతులు కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు, వివిధ వృత్తుల నిపుణులు, ప్రజలు పాల్గొని రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు పాలకులపై ఒత్తిడి పెంచే కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాద్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, రాఘవేంద్ర గౌడ్, మహేశ్వరరెడ్డి, పట్నం రాముడు, కొమ్మా శ్రీహరి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.

Tags:    

Similar News