ఆ వూర్లో రాముడికి గుడి కట్టింది దళితులే, పూజారులు దళితులే...

భగవంతుడికి బ్రాహ్మణ పూజారులు మాత్రమే పూజలు చేయాలా ? బ్రాహ్మణేతరులు పూజలు చేస్తే అపచారం జరిగినట్లేనా ? బ్రాహ్మణేతరులు పూజలు చేస్తే భగవంతుడు స్వీకరించడా ?

Update: 2024-11-24 05:53 GMT

భగవంతుడికి బ్రాహ్మణ పూజారులు మాత్రమే పూజలు చేయాలా ? బ్రాహ్మణేతరులు పూజలు చేస్తే అపచారం జరిగినట్లేనా ? బ్రాహ్మణేతరులు పూజలు చేస్తే భగవంతుడు స్వీకరించడా ? ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఎవరు ఇవ్వగలరు ? భగవంతుడికి మనుషులంతా ఒకటే అన్నారు కొందరు. కాబట్టి పూజారులుగా బ్రాహ్మణులే కాదు బ్రాహ్మణేతరులు కూడ ఉండవచ్చన్నారు మరికొందరు. మిగిలిన ప్రాంతాల్లో ఏమోగాని ఖమ్మం జిల్లా(Khammam district) ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామం(Vallabhi village)లో మాత్రం దశాబ్దాలుగా ఒక దళిత కుంటుంబం(Dalit priest) శ్రీరాముడిని(Lord Sri Ram)సేవిస్తోంది. భక్తితో పూజలు, అర్చనలు కూడా చేస్తోంది. భగవంతుడికి దళితకుటుంబం పూజలు చేయటం ఏమిటని ఆలోచించకుండా జనాలు కూడా దేవాలయానికి వస్తున్నారు, పూజలు చేయించుకుంటున్నారు.



 దీనికి సంబందించిన వివరాలు తెలుసుకోవాలంటే సుమారు 90 ఏళ్ళు వెనక్కు వెళ్ళాల్సిందే. వల్లభి గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. ఆలయంలో ప్రతిఏడాది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అలాంటి ఉత్సవాల సందర్భంలో ఊరిపెద్దలు, అగ్రవర్ణాల వాళ్ళు దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాలను చూస్తున్నారు. ఊరంటే అగ్రవర్ణాలే కాదు కదా బడుగు, బలహీనవర్గాలతో పాటు దళితులు కూడా ఉంటారు. అగ్రవర్ణాలతో పాటు బడుగు, బలహీనవర్గాలు గ్రామంలోనే ఉంటే దళితులు గ్రామశివార్లలో మాత్రమే ఉండాలి. దశాబ్దాల కాలంనాటి కట్టుబాట్లు అవి. అందుకనే దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాలు చూడటానికి దళితకుటుంబాలకు అవకాశంలేదు. దళితులు దేవాలయాల్లోకి అడుగుపెట్టేందుకే లేదన్నపుడు ఇక దేవాలయాల్లో జరుగుతున్న ఉత్సవాలను చూసే అవకాశం ఎక్కడ దొరుకుతుంది.



 అయితే 90 ఏళ్ళక్రితం వేణుగోపాలస్వామి దేవాలయం దగ్గర ఒక ఘటన జరిగింది. ఆ ఘటనే శ్రీ సీతారామస్వామి దేవాలయం నిర్మాణానికి పునాదివేసింది. ఇంతకీ అప్పుడు ఏమి జరిగింది ? ఏమిజరిగిందంటే ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాలను చూడాలని వంగూరి రామస్వామితో పాటు కొందరు దళితులకు అనిపించింది. అనిపించిందే ఆలస్యం వెంటనే దేవాలయం ప్రహరిగోడ పైన ఎక్కి కూర్చున్నారు. గొడమీద కూర్చుని ఉత్సవాలను చూస్తున్న దళితులను ఎవరో గమనించారు. వెంటనే ఆ విషయం దేవాలయంలోనే ఉన్న పెద్దలకు చేరవేశారు. ఇంకేముంది అందరూ ఒక్కసారిగా దేవాలయం బయటకు వచ్చి ప్రహరిగోడ మీద కూర్చున్న రామస్వామితో పాటు ఇతరులను కిందకు దింపారు. దళితులు దేవాలయం గోడను ఎక్కటమే కాకుండా ఉత్సవాలను చూడటం వల్ల దేవుడు మైలపడ్డాడని, దేవాలయం అపవిత్రమైపోయిందంటూ నానా గోలచేసి తీవ్రంగా అవమానించారు. ఊరు జనాలందరి ముందు దళితులను అనరాని మాటలని తీవ్రంగా అవమానించారు.



అంతమంది ముందు తమకు జరిగిన అవమానంతో తనింటికి వచ్చేసిన రామస్వామి రోజులు గడిచినా అవమానాన్ని మాత్రం మరచిపోలేకపోయారు. కొద్దిరోజుల తర్వాత దళితవాడలోని అందరినీ సమావేశపరిచి తమ వాడలోనే చిన్న దేవాలయాన్ని నిర్మించాలని రామస్వామి ప్రతిపాదించారు. అందుకు మిగిలిన వాళ్ళు కూడా అంగీకరించారు. దాంతో వెంటనే తమ ఇళ్ళ మధ్యలోనే రామస్వామి చిన్న ఆలయంలాగ నిర్మించి అందులో సీతారామలక్ష్మణ సమేత హనుమంతుడి చిత్రపటాన్ని పెట్టి కొలవటం మొదలుపెట్టారు. చిన్నప్పటినుండి రామస్వామికి శ్రీరాముడిపైన ఉన్న భక్తి అపారం. అందుకనే వేణుగోపాలస్వామి దేవాలయంలో అవమానం జరిగినా చిత్రపటం పెట్టి పూజలు మొదలుపెట్టింది మాత్రం శ్రీరాముడికే. శ్రీరాముడి చిత్రపటం పెట్టిన రామస్వామికి పూజలు, నైవేధ్యాలు అంటే ఏమిటో కూడా తెలీదు. తెలిసిందల్లా శ్రీరాముడి చిత్రపటం ముందు దీపం వెలిగించి, భక్తితో దణ్ణం పెట్టుకోవటమే. శ్రీరాముడి చిత్రపటం పెట్టి తనకొచ్చిన నాలుగు పద్యాలు చెప్పుకుంటు అదే పూజలుగా రామస్వామి రోజులు వెళ్ళదీశారు. దళితవాడలో దేవాలయం నిర్మించారని తెలుసుకున్న అగ్రవర్ణలు పెద్ద గోలచేసినా చివరకు చేసేదిలేక



రామస్వామి పెద్దకొడుకు వంగూరి చినముత్తయ్య కూడా తండ్రితో పాటే చిత్రపటానికి పూజలు, దీపారాధన చేసేవారు. 1988లో రామస్వామి కాలంచేశారు. తండ్రి వారసత్వాన్ని చినముత్తయ్య కూడా చాలా సంవత్సరాలు కొనసాగించారు. చినముత్తయ్య హయాం వచ్చేసరికి ఊరిలోని కొందరు అభ్యుదయవాదులు చినముత్తయ్యకు పూజలు, నైవేధ్యాల గురించి కొన్ని విషయాలను వివరించారు. దేవాలయంలో చేసే పూజలు, వాటి విధానాల గురించి కూడా చెప్పారు. దాంతో శ్రీరాముడిపైన ఉన్న శ్లోకాలు, పద్యాలను చినముత్తయ్య కంఠతా పట్టి వాటితోనే పూజలు చేసేవారు. అదే సమయంలో పూరిపాక స్ధానంలో బండలతో చిన్నపాటి నిర్మాణం చేసి దేవాలయం అనిపించారు. దళితవాడలోనే నిర్మించిన దేవాలయం కాబట్టి చుట్టుపక్కల గ్రామాల్లోని దళితులంతా వల్లభి దళితవాడలో నిర్మించిన దేవాలయానికి రావటం మొదలుపెట్టారు.



కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 2021లో చినముత్తయ్య చనిపోయారు. అయితే అప్పటికే చినముత్తయ్యతో పాటు మనవడు వంగూరి అనంతరాములు దేవాలయంకు రావటం మొదలుపెట్టారు. శ్రీరాముడి మీద భక్తితో అనంతరాములు కూడా పూజావిధానాలను నేర్చుకున్నారు. అయితే ఇక్కడే ట్విస్టంతా ఉంది. అదేమిటంటే చినముత్తయ్య ఉన్నపుడే అంటే 2019 ప్రాంతంలోనే జిల్లాలోని ఆర్ఎస్ఎస్(RSS), వీహెచ్పీ(VHP) ప్రముఖులు తరచూ దేవాలయాన్ని సందర్శించేవారు. వాళ్ళే ఖమ్మం టీటీడీ(TTD) కల్యాణమండపంలో పనిచేసే ఒక అధికారి దగ్గరకు అనంతరాములును తీసుకెళ్ళారు. పూజారి భక్తి గురించి, పూజలగురించి వివరించి తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నడుస్తున్న వేదపాఠశాలలో చేర్పించమని అడిగారు. సదరు అధికారి టీటీడీతో మాట్లాడి అనంతరాములును వేదపాఠశాలలో చేర్పించారు.



అనంతరాములు వేదపాఠశాలలో చేరటమే ఇక్కడ పెద్ద ట్విస్టు. రెండేళ్ళపాటు వేదపాఠశాలలో అనంతరాములు చదువుకున్నారు. వేదపాఠశాలలో అనంతరాములు నిత్యపూజలు, అర్చన, దీపారాధన, దూపదీప నైవేధ్యాలు, సత్యనారాయణవ్రతం, వరలక్ష్మీ వ్రతం, గణపతిపూజలు, శ్రీరామ కల్యాణం, షోడషోపచార పూజ, దూపదీప నైవేద్య విధానం మొత్తాన్ని నేర్చుకున్నారు. వేదపాఠశాలలో థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా చేయిస్తారు. థియరీ అంటే పుస్తకాల ఆధారంగా మంత్రాలు, విధానాలను బట్టీపట్టించటం. ప్రాక్టికల్స్ అంటే పుస్తకాలలో నేర్చుకున్నదాన్ని ఆచరణలో చేయించటం. ప్రాక్టికల్స్ అంటే కొందరు విద్యార్ధులను గ్రూపులుగా విడదీసి వారితో పూజా విధానాలు, మంత్రాలను చెప్పించేవారు. అధ్యాపకులకు బాగా నమ్మకం కుదిరినతర్వాత కొందరిని తిరుపతితో పాటు చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకు తీసుకెళ్ళి ప్రత్యక్షంగా మంత్రోచ్ఛరణ, పూజా విధానాల్లో పాల్గొనే అవకాశం కల్పించేవారు.



అలాగ అనంతరాములుకు దేవాలయాల్లో సీనియర్లతో ఉంటు నిత్యపూజలు, ధూపదీప నైవేద్యాలు, అర్చనలు చేయించటం అలవాటు అయ్యింది. దేవాలయంలో పూజలు చేయించటానికి అవసరమైన మంత్రాలు, శ్లోకాలు, ఆశీర్వచన మంత్రాలు, వ్రతాలు అన్నింటిలోను పరీక్షలు పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చారు. అలాగే సర్టిఫికేట్లు అందుకున్న వేదపాఠశాల విద్యార్ధుల్లో అనంతరాములు కూడా ఉన్నాడు. వేదపాఠశాలలో రెండేళ్ళ చదువు, శిక్షణ తర్వాత అనంతరాములు తిరిగి వల్లభికి వచ్చి పూజలు మొదలుపెట్టాడు. 2021లో చినముత్తయ్య చనిపోయిన తర్వాత అనంతరాములే దేవాలయానికి పూర్తిస్ధాయి పూజారిగా స్ధిరపడ్డాడు. ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన చిన్న దేవాలయం స్ధానంలో పెద్దదేవాలయాన్ని నిర్మించాలన్న ఉద్దేశ్యంతో అనంతరాములు ఊరిపెద్దలందరిని కలిసి విజ్ఞప్తిచేశాడు. తరాలుమారుతున్న కొద్ది ఆలోచనలు మారుతాయన్నట్లుగా ఊరిలోని జనాల మనస్తత్వంలో కూడా మార్పొచ్చింది.



దేవాలయంలో అనంతరాములు చేస్తున్న పూజలు, అర్చనలు, చేయిస్తున్న వ్రతాల గురించి విన్న ఊరిలోని పెద్దలు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతో నిధుల సమీకరణ జరిగి సుమారు కోటిరూపాయలతో దేవాలయ పునర్ నిర్మాణం జరిగింది. చినముత్తయ్య హయాంలోనే ఏర్పడిన చిన్న విగ్రహాల స్ధానంలో దేవాలయం పునర్ నిర్మాణం సమయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణ, హనుమంత విగ్రహలు వచ్చి చేరాయి. ఈ విగ్రహాలను మహాబలిపురంలోని ఒక స్ధపతి తయారుచేశారు. భువనేశ్వరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి చేతులమీదుగా దేవాలయ పునర్ నిర్మాణం, ధ్వజస్ధంభంతో పాటు విగ్రహాల ప్రతిష్ట జరిగింది.

వేదపాఠశాలే జీవితాన్ని మార్చింది



ఇదే విషయాన్ని దేవాలయం పూజారి వంగూరి అనంతరాములు ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు తన జీవితాన్ని టీటీడీ వేదపాఠశాల(TTD Vedic school) మార్చేసిందన్నారు. ‘2 ఏళ్ళ పాటు పాఠశాలలో తాను గోత్రనామాలతో అర్చనలు చేయించటం, ఆశీర్వచనమంత్రాలు, అన్నప్రాసన, వివాహా మంత్రాలు, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసం చేయించటంలో శిక్షణ తీసుకున్న’ట్లు చెప్పారు. ‘పంచాగ పఠనం, పంచాంగం చూసి దోషాలు చెప్పటం, మంచిరోజులు, తిధి, వార, నక్షత్రాలు చూసి రాశిఫలాలు చెప్పటం కూడా నేర్చుకున్నా’నని చెప్పారు. ఇప్పటివరకు 25 వివాహాలు చేయించినట్లు చెప్పారు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కారణంగానే ధూప, దీప నైవేధ్యాల పథకంలో దేవాలయానికి ప్రతినెలా రు. 10 వేలు అందుతున్న’ట్లు చెప్పారు. ‘కామన్ గుడ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం మంజూరుచేసిన రు. 40 లక్షలకు గ్రామస్తులు, చుట్టుపక్కల భక్తులు అందించిన రు. 60 లక్షల విరాళాలు కలిపి మొత్తం కోటిరూపాయలతో దేవాలయాన్ని పునర్ నిర్మించిన’ట్లు అనంతరాములు చెప్పారు.

జిల్లాలో దళితులే పూజారులుగా ఉన్న దేవాలయం ఒక్కటే

 



 ఇపుడిపుడే దేవాలయంకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందన్నారు. ‘ఎంతమంది భక్తులు వస్తున్నా, పూజలు చేయించుకుంటున్నా ఇంకా కొంతమంది తనను దళితుడననే వివక్షతోనే చూస్తున్న’ట్లు వాపోయారు. అప్పలనర్సింహపురం, ఖానాపురం, అయ్యగారిపల్లి, కమలాపురం నుండి భక్తులు తరచూ దేవాలయంకు వస్తుంటారని చెప్పారు. ‘శ్రీరామనవమితో పాటు ముఖ్యరోజుల్లో భక్తుల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంద’న్నారు. ‘దేవాలయంకు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి యాదవులు, గౌడ్లు, పద్మశాలీలు ఎక్కువగా వస్తుంటార’ని చెప్పారు. ‘తనకు తెలిసినంతలో ఖమ్మం జిల్లా మొత్తం మీద దళితులే నిర్మించి, దళితులే పూజారిగా ఉన్నది వల్లభిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఒక్కటే’ అని అనంతరాములు గర్వంగా చెప్పారు.

Tags:    

Similar News