మచిలీపట్నం వైపే మొంథా తుపాను!

రాత్రి 8 గంటల ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం

Update: 2025-10-28 11:34 GMT
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుపాన్ వేగంగా తీరానికి చేరుకుంటోంది. వాతావరణశాఖ తాజా సమాచారం ప్రకారం, గడిచిన గంటలో ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం ఈ తుపాన్ మచిలీపట్నం నుంచి 70 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 150 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ లెక్కన చూస్తే తుపాను బందరు (మచిలీపట్నం) వద్ద తీరాన్ని తాకవచ్చు.

police at RK Beach at Visakhapatnam

అనధికార అంచనా ప్రకారం, తుపాన్ ఈ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో మచిలీపట్నం సమీప తీరాన్ని తాకే అవకాశం ఉంది. తుపాన్‌ కదలిక అదే వేగంతో కొనసాగితే మచిలీపట్నం ప్రాంతాన్ని రాబోయే 4–6 గంటల్లో తాకవచ్చు. ఒకవేళ అక్కడ తాకకపోతే కాకినాడ తీరాన్ని రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 1 గంట మధ్య దాటవచ్చు. కాకినాడలో కూడా తీరాన్ని తాకకపోతే విశాఖపట్నం తీరాన్ని రేపు తెల్లవారుజామున దాటవచ్చు. ఎక్కడ తాకుతుందనే దానిపై వాతావరణ శాఖ ఇంకా నిర్ధారణకు రాలేదు.
తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీరానికి దగ్గరగా రాగానే తుపాన్ తీవ్రత మరింత పెరగనుంది.
వచ్చే 24 గంటల్లో గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొండప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారి జగన్నాథకుమార్ తెలిపారు.
హెచ్చరికలు జారీ
కాకినాడ పోర్టు వద్ద 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, విశాఖపట్నం, గంగవరం: 9వ నంబర్ హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం: 8వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. వాతావరణశాఖ తెలిపిన ప్రకారం, తుపాన్ తీరం దాటే సమయంలో సుమారు గంటన్నరపాటు అత్యధిక ప్రభావం ఉంటుంది.

ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అయితే కొన్ని ప్రైవేటు వాతావరణ సంస్థలు మాత్రం మొంథా తుపాను దిశ మార్చుకుందని, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైపు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈనేపథ్యంలో వాతావరణశాఖ పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్‌ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం ఉదయం వరకు గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు తెలంగాణలోని భద్రదాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో, ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో ఆకస్మిక వరదలు( ఫ్లాష్‌ ఫ్లడ్స్‌) సంభవించే అవకాశముందని తెలిపింది.
Tags:    

Similar News