మహిళలకు మొండి చేయి చూపారు
కూటమి ప్రవేశప్టెంది కోతల బడ్జెట్. మూడు సూపర్ సిక్స్‌లు ఎగిరి పోయాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు.;
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు మొండి చేయి చూపారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద ఆయన శనివారం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. కూటమి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కోతల బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదన్నారు. బడ్జెట్‌లో సమతూకం లేదు, సమగ్రత లేదు అంటూ మండిపడ్డారు.
బడ్జెట్‌లో చూపిన అంకెలన్నీ మోసపూరితమైనవని ధ్వజమెత్తారు. సొంత పన్నులు రూ. 15వేల కోట్లు పెరుగుతాయని చెప్పారని, ఎలా పెరుగుతాయో అనేది కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా తీసుకొస్తారా? లేక మద్యం తాగించి వసూళ్లు చేస్తారా? అని ప్రశ్నించారు. కేంద్రం వాటాపై ఒక మాట కూడా బడ్జెట్‌లో లేదని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలతో సూపర్ సిక్స్ అంటూ ప్రజలను నమ్మించి ఓట్టేయించుకున్నారని అన్నారు. తీరా గెలిచిన తర్వాత హామీల్లోని వాటిని మరిచి పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రారంభంలోనే సూపర్ సిక్స్‌ల్లో మూడు సిక్స్‌లు ఎగిరి పోయాయన్నారు. తక్కినవి కూడా సంఖ్యలు తగ్గిస్తారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే డిఎస్సీ ఇస్తామని ఉద్యోగాలు ఎగ్గొట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖకు కూటమి ఇస్తున్న ప్రాధాన్యత, దానికి కేటాయించిన నిధులు చూస్తోంటే కడుపు తరుక్కు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.