కేటీఆర్ వీడియోలను బయటపెట్టిన కాంగ్రెస్

ఒక వైపు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు పాత వీడియోలను బయటకు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Update: 2024-10-02 07:30 GMT

మూసీ ప్రాజెక్టు అభివృద్ధి, హైడ్రా పనితీరుపై ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నానా గోలచేస్తున్న విషయం తెలిసిందే. ఏకకాలంలో ఇటు మూసీ నది సుందరీకరణ పనులపైన అటు హైడ్రా కూల్చివేతలపైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్, సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నానా రచ్చచేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రిస్టేజ్ గా తీసుకున్న పై రెండు ప్రాజెక్టులను ఎలాగైనా సరే ఆపించేయాలన్న ఆలోచనతో కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, క్యాడర్ నానా గోల చేస్తున్నారు. బాధితులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగా రెచ్చగొడుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఒక వైపు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు పాత వీడియోలను బయటకు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇంతకీ ఆ వీడియోల్లో ఏముంది ? ఏముందంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కేటీఆర్ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టును టేకప్ చేశారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెరువులు, కుంటలు, కాల్వల ఆక్రమణలపై వివిధ శాఖల ఉన్నతాధికారులపై సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారుల సమీక్షలో కేటీఆర్ మాట్లాడుతు చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించి చేసిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలని ఆదేశించారు. బుల్డోజర్లు, జేసీబీలతో ఆక్రమణలు కూల్చేసేటపుడు ముందుజాగ్రత్తగా పోలీసులను కూడా బందోబస్తు పెట్టుకోమని కూడా సలహా ఇచ్చారు. ఆక్రమణలను తొలగించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. ఇదే సమయంలో అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

అందులో ఏముందంటే హైదరాబాద్ పరిధిలో 25 వేల ఆక్రమణలున్నట్లు చెప్పారు. ఈ 25 వేల ఆక్రమణలను ప్రభుత్వం కూల్చేస్తుందన్నారు. కూల్చివేతలకు ఎవరు అడ్డుపడినా తమ ప్రభుత్వం లెక్కచేయదని కూడా కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఇన్నివేల ఆక్రమణలను కూల్చేయాలంటే ప్రభుత్వం చాలా కఠినంగా ఉండాల్సిందే అన్నారు. ఇపుడీ వీడియోను కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తోంది.

ఇదే సమయంలో మూసీనది ప్రాజెక్టుపై మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ అసెంబ్లీలో ఒక ప్రకటనచేశారు. ఆ ప్రకటన ఏమిటంటే మూసీనదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలు, నిర్మాణాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ద్రోన్లతో సర్వే చేయించి మూసీనదికి రెండువైపులా 10వేల నిర్మాణాలున్నట్లు గుర్తించామని చెప్పారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మాణాలన్నింటినీ తొలగిస్తామని కేటీఆర్ స్పష్టంగా ప్రకటించారు. ఇపుడీ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇదే విషయమై మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మీడియా మాట్లాడుతు మంత్రిగా ఉన్నపుడు కేటీఆర్ మొదలుపెట్టిన ప్రాజెక్టునే ఇపుడు తాము అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును కాంగ్రెస్ కొత్తగా టేకప్ చేసింది కాదన్నారు. మంత్రిగా ఉన్నపుడు కేటీఆర్ ఏర్పాటుచేసిన కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఇపుడు తమ ప్రభుత్వం పనులు మొదలుపెట్టిందన్నారు.

తాము అధికారంలో ఉన్నపుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఒకలాగ వ్యవహరించి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరోలాగ వ్యవహరిస్తున్నట్లు దుద్దిళ్ళ ఎద్దేవాచేశారు. అధికారంలో నుండి దిగాపోయామన్న బాధతోనే మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జనాలను కేటీఆర్, హరీష్ రెచ్చగొడుతున్నట్లు మంత్రి మండిపోయారు. తమ ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడంలేదన్నారు. నిర్వాసితులను కన్వీన్స్ చేసి మూసీ పరివాహక ప్రాంతంనుండి దూరంగా తీసుకెళ్ళి డబుల్ బెడ్ రూములను కేటాయిస్తున్నట్లు చెప్పారు. పేదలు రోగాలతో, వరదలతో బాధలు పడుతునే ఉండాలని కేటీఆర్ అనుకుంటున్నారా అని మంత్రి ఎదురు ప్రశ్నించారు. మంత్రి బయటపెట్టిన విషయంతో పాటు కాంగ్రెస్ రిలీజ్ చేసిన వీడియోలతో కేటీఆర్ డబుల్ గేమ్ బయటపడినట్లయ్యింది. మరి అధికారంలో ఉన్నపుడు తాను చేసిన ప్రకటనలపై ఇపుడు కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News