వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్‌గా ఉన్న నారా లోకేష్ పేర్కొన్నారు. మంత్రివర్గ సహచరులతో కలిసి పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతున్నాయని, ఈ క్రమంలో ప్రతిష్టాత్మత సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో మరో అడుగు ముందుకు పడిందని, రాష్ట్రానికి కొత్తగా మరో 4 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, సిఫి, సత్వా, బివిఎం, ఎఎన్‌ఎస్‌ఆర్ సంస్థలు రూ.20,216 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన 9వ ఎస్‌ఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 50,600 మందికి ఉద్యోగ, ఉపాథి అవకాశాలు లభిస్తాయని లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన సబ్ కమిటీకి చైర్మన్‌గా ఉన్న నారా లోకేష్ ఈ సమావేశంలో ఆయా పెట్టుబడులు గురించి వివరించారు. ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖ ఖ్యాతి మరింతగా పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ పెట్టుబడులపై ఆయా సంస్థలతో జరిపిన చర్చలు, వాటి స్థితిగతులు, బలాబలాలు వెల్లడించారు. అనంతరం సిఎం చంద్రబాబు మాట్లాడుతూ... భవిష్యత్ పెట్టుబడులకు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని అన్నారు. విశాఖలో భూమి లభ్యత తక్కువగా ఉందని... ఇప్పటికే అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ సహా అనేక సంస్థలకు భూములు ఇస్తున్నామని చెప్పారు.
ఈక్రమంలో విశాఖకు వచ్చే సంస్థలకు అనువైన భూమిని చూపాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల సమస్యలు రాకుండా ప్రణాళికలు అమలు చేయాలని సిఎం ఆదేశించారు. పూణె, బెంగుళూరు వంటి పట్టణాల్లో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలను ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావించగా... అటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. విమానాశ్రయం–రైలు కనెక్టవిటీ, హైవే రోడ్లు, మెట్రో వంటి వాటిపై ముందస్తు ప్రణాళికలతో అధికారులు పనిచేయాలన్నారు. పూణె, బెంగుళూరు వంటి చోట్ల నేడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మన దగ్గర తలెత్తకుండా చూడాలన్నారు. కంపెనీలను ఏర్పాటు చేయడంతో పాటు సామాన్య ప్రజలు ఆయా ప్రాంతాల్లో నివసించడానికి అవసరమైన ఎకో సిస్టం కూడా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రణాళికలు అమలు చేయాలని సిఎం అన్నారు.
ముందుకొచ్చిన కంపెనీలు ఇవే..
1. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో మొదటిదశలో రూ.1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 200 మందికి ఉపాధి లభించనుంది. రెండవదశలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు... 400 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
2. సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం–మధురవాడలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా, 25,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.
3. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం–ఎండాడలో రూ.1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 15,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి.
4. ఏఎన్‌ఎస్‌ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం–మధురవాడలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తద్వారా 10,000 ఉద్యోగావకాశాలు వస్తాయి.
సిఫీ టెక్నాలజీస్ ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటి. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి సొల్యూషన్స్, సర్వీసెస్ ప్రొవైడర్‌గా పనిచేస్తుంది. సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.3,621 కోట్ల టర్నోవర్, సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ రూ.1,114 కోట్ల టర్నోవర్ కలిగివుంది. రెండు ప్రాజెక్టులుగా వివిధ దశల్లో ఏపీలో తమ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది.
సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ ఐటీ, ఐటీఈఎస్ పార్కులకు సంబంధించిన ప్రాజెక్టులను అభివద్ధి చేయడంలో అనుభవం ఉంది. ప్రస్తుతం 8 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సత్వా... 80 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయ సముదాయాలను నిర్మిస్తోంది.
కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ, రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖలో మినీ స్మార్ట్ టెక్ సిటీ ఏర్పాటు చేయనుంది. గ్రేడ్ ఏ ప్లస్ ఆఫీస్ స్పేస్, కోవర్కింగ్ స్పేస్, ఎంప్లాయీ రెసిడెన్సెస్ వంటివి ఏర్పాటు చేయనుంది. కపిల్ గ్రూపు సంస్థకు గతంలో ఫైనాన్సియల్ సర్వీసెస్, స్టార్ హోటల్స్, ఐటీ పార్క్స్ నిర్మాణంలో అనుభవం ఉంది.
ఏఎన్‌ఎస్‌ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజైనింగ్, ఎస్టాబ్లిషింగ్, జీసీసీ ఆపరేటింగ్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. ఇండియాతో సహా పోలాండ్, యూఏఈలో కూడా కార్యకలాపాలు సాగిస్తోంది. లక్షా 50 వేల మంది ఉద్యోగులతో ఉన్న 12 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ సముదాయం కలిగిఉంది.
కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశాల్లో 113 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగలో 11, ఐటీలో 11, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు ఎస్‌ఐపీబీ ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా రూ.5,94,454 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 5,56,568 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి.