విశాఖ తీరానికి ముంపు ముప్పు!?

- 2040 నాటికి 1.02 శాతం భూభాగం నీట మునిగే ప్రమాదం. సముద్రమట్టాల పెరుగుదల ఫలితం. విశాఖ పోర్టు, రుషికొండ, మంగమారిపేటలు ప్రభావితం

By :  Admin
Update: 2024-08-21 12:36 GMT

- 50 ఏళ్లలో బీచ్ రోడ్డుకు ప్రమాదం ఉందంటున్న పర్యావరణ నిపుణులు

-బొల్లం కోటేశ్వరరావు

పెరుగుతున్న సముద్రమట్టాల ప్రభావం విశాఖ మహా నగరంపై పడనుందా? వచ్చే 50 ఏళ్లలో విశాఖ తీర ప్రాంతం కొంతమేర ముంపు ముప్పునకు గురి కానుందా? కొన్నాళ్ల నుంచి పలువురి మదిలో ఇదే ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్ఈపీ) సంస్థ జరిపిన అధ్యయనం కూడా మరింత 'అల’జడికి కారణమవుతోంది. ఈ సంస్థ 'సముద్ర మట్టాల పెరుగుదల-తీర ప్రాంతాలకు ముప్పు' అనే అంశంపై అధ్యయనం చేసింది. రానున్న 15 ఏళ్లలో అంటే 2040 నాటికి దేశంలో ముంబై తర్వాత హల్దియా, విశాఖ నగరాలు సముద్ర ముంపునకు గురయ్యే మహా నగరాల్లో ఉన్నట్టు తేల్చింది. విశాఖలో 1992 నుంచి 2021 వరకు ఏటా 0.18 సెం.మీల చొప్పున 2.38 సెం.మీలు సముద్రమట్టం పెరిగి సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చినట్టు పేర్కొంది. ఇలా 2040కల్లా సముద్రమట్టం 16.7 నుంచి 18.3 సెం.మీల మేర పెరుగుతుందని, ప్రధానంగా విశాఖ పోర్టు నుంచి మంగమారిపేట వరకు తీర ప్రాంతంలో 6.96 చదరపు మీటర్ల మేర తీరప్రాంతంలో 1.02 శాతం భూభాగం నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. దీంతో తీరానికి చేరువలో ఉన్న పోర్టు, తెన్నేటి పార్కు, రుషికొండ, మంగమారిపేట ప్రాంతాలు ముంపు బారిన పడతాయని పేర్కొంది. కొన్నేళ్లుగా పోర్టు నుంచి మంగమారిపేట వరకు సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుండడంతో తీరప్రాంతం కోతకు గురవుతూనే ఉంది. ముంపు బారిన పడే వాటిలో మంగమారిపేట, ఆ తర్వాత రుషికొండలోను ఎక్కువ జనావాసాలున్నాయి. అందువల్ల మిగిలిన ప్రాంతాలకంటే మంగమారిపేట ఎక్కువగాను, రుషికొండలో కొంత ఆ ప్రాంతం ముంపు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు కోస్టల్ బ్యాటరీ, సబ్మెరైన్ మ్యూజియం, వైఎంసీఏ ఎదురుగా సముద్ర తీరం కోత బారిన పడుతోంది. ఒకప్పుడు నగరానికి ఆనుకుని ఉన్న ఆర్కే బీచ్ కు సముద్రం దూరంగా ఉండేదని, ఇప్పుడు రుతుపవనాల సీజనులో సముద్రపు నీరు తాకుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 131 కి.మీల తీర ప్రాంతం ఉంది. తీరం వెంబడి ఉన్న 43 మత్స్యకార గ్రామాల్లో 15 గ్రామాల పరిధిలో తరచూ తీరం కోతకు గురవుతూనే ఉంది. 


ఆర్కే బీచ్ కు గుండె‘కోత'..

విశాఖలో పర్యాటకులను ఎంతగానో అలరించే ఆర్కే బీచ్ కొన్నేళ్లుగా కోతకు గురవుతోంది. గడచిన పదేళ్లుగా (హుద్ హుద్ తుపాను తర్వాత) అది మరింత తీవ్రమవుతోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్కు వరకు మధ్యలో 4-5 కి.మీలు కొట్టుకుపోయిన సందర్భాలున్నాయి. దీంతో రోజుల తరబడి బీచ్ రోడ్డు మూసివేయాల్సి వచ్చింది.

సముద్ర మట్టాలు పెరిగితే..

సీఎస్ ఈపీ అధ్యయనం ప్రకారం.. సముద్రమట్టాలు పెరిగితే విశాఖ విమానాశ్రయం పక్కన ఉన్న మేహాద్రిగెడ్డలోకి సముద్రపు నీరు ప్రవేశించి ఆ ప్రాంతంలోని చెట్లు, మడ అడవులు ముంపునకు గురవుతాయి.  భూగర్భ జలాలు ఉప్పు నీటిగా మారతాయి. ఇప్పటికే విశాఖకు మకుటాయమానంగా ఉన్న ఆర్కే బీచ్ కోతకు గురవుతోంది. మున్ముందు సముద్రమట్టాలు పెరిగితే ఇది మరింతగా దెబ్బతిని క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.  సముద్రమట్టాల పెరుగుదలతో పోర్టు, వైఎంసీఏ, తెన్నేటి పార్కు, రుషికొండ, పెద జాలరిపేట, మంగమారిపేటలు ముంపునకు లోనై వాటి స్వరూపాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అక్కడ ఆవాసాలకు ఆస్కారం లేకుండా పోతుంది.

వైజాగ్ తో పాటు ఆ ప్రాంతాలకూ..

భూతాపం ప్రభావం సముద్రమట్టాల పెరుగుదలకూ కారణమవుతోందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. 'భూతాపం 2 డిగ్రీలు పెరిగితే 2080 నాటికి సముద్రమట్టం 1.5 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది. దీనివల్ల సముద్రమట్టానికి ఒక మీటరు ఎత్తులో ఉన్న విశాఖ నగరంలోని బీచ్ రోడ్డు, లాసన్స్బ కాలనీ, పెదజాలరిపేట, రుషికొండ వంటి ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు.. విశాఖ నగరంకంటే సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, మచిలీపట్నం, చీరాల, నెల్లూరు కోట, శ్రీహరికోట, నిజాంపట్నం తదితర పట్టణాలు ముందుగా ముంపు బారిన పడతాయి. అందువల్ల అలాంటి ప్రాంతాల్లో మున్ముందు జనావాసాలు పెరగకుండా, కొత్తగా కట్టడాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి' అని ప్రముఖ పర్యావరణవేత్త, ఏయూ పర్యావరణ విభాగం పూర్వ అధిపతి ప్రొఫెసర్ కె.కామేశ్వరరావు 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్'కు చెప్పారు.

తీరం కోతతోనూ ముప్పే..

సుందర విశాఖకు ఇప్పటికే కోత బెడద ఉంది. దానికి అదనంగా సముద్ర మట్టాల పెరుగుదల తోడయితే వైజాగ్ తీరం మరింతగా ముప్పు గుప్పెట్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. యారాడ కొండ, గంగవరం పోర్టు వంటి వాటి వల్ల ఇసుక సహజ ప్రయాణానికి ఆటంకం ఏర్పడి ఆర్కే బీచ్, సబ్మెరైన్ మ్యూజియం ప్రాంతాల వద్ద తరచూ తీరం కోతకు గురవుతోంది. 'డ్రెడ్జింగ్ సక్రమంగా చేయకపోవడం కోత సమస్యకు ఒక కారణం. సీఎస్ టీఈపీ నివేదిక ప్రకారం 2040 నాటికి సముద్రమట్టాల పెరుగుదల ప్రభావం విశాఖపై స్వల్పంగానే ఉండవచ్చు. అయితే మంగమారిపేట, రుషికొండ ప్రాంతాలు ఒకింత ముంపునకు గురి కావచ్చు. విశాఖకు సముద్రమట్టాల పెరుగుదలతో పాటు తీరం కోత వల్ల కూడా ఎక్కువ నష్టం వాటిల్లుతుంది' అని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం పూర్వ అధిపతి కోనేరు ప్రసాద్ 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్'కు చెప్పారు. సీఎస్ఈపీ అధ్యయనం ప్రకారం 2040 నాటికి సముద్రమట్టం 18 సెం.మీలు, 2060కి 37.7 సెం.మీలు, 2080కి 62.5 సెం.మీల 2100 నాటికి 91.3 సెం.మీల చొప్పున పెరగనుంది. ఫలితంగా మరో 50 ఏళ్ల నాటికి విశాఖలో ఇప్పుడున్న బీచ్ చాలావరకు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని అటు అధ్యయనాలు, ఇటు నిపుణుల అభిప్రాయాన్ని బట్టి తేటతెల్లం అవుతోంది.




Tags:    

Similar News