‘మందే’ ఇక రాష్ట్రాన్ని ముందుకు నెట్టేది!

పదండి బాబు మందుకు, పదండి బూబు ముందుకు!;

Update: 2025-05-18 04:37 GMT
AP CM Chandrababu Naidu

మందుబాబుల మహత్తర సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇది సాధ్యమని కూడా నమ్ముతున్నది.  మంచి మందు ఇచ్చి రాబడి పెంచే మార్గాలను అన్వేషించాలని ఆయన అధికారులకు సూచనలిచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న మందు వినియోగం నేపథ్యంలో  బాబు పట్టుబడితే లక్ష్యం సాధించగలరని అధికారులు నమ్ముతున్నారు.

 గత ఏడాది కంటే ఈ ఏడాది సుమారు 8వేల కోట్లు ఎక్సైజ్ ఆదాయం పెంచాలనే ఆలోచనలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ శాఖకు లక్ష్యం పెట్టారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ ఆదాయం ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఇది ప్రభుత్వాన్ని బాధిస్తూ ఉంది.  2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఎక్సైజ్ ఆదాయం రూ.28,842 కోట్లకు చేరింది. ఇది అంతకు ముందు ఏడాది కంటే 14.84 శాతం ఎక్కువ. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రూ.2,116 కోట్ల ఆదాయం సమకూరింది. దీనిని బట్టి మొత్తం సంవత్సరానికి రూ.33,882 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశగా ఉంది. రాబడి పెరిగే అవకాశం ఉందని దీనిని బట్టి అర్థమవుతుంది.కాబట్టి ధర ఎక్కువయినా మంచి మద్యం దండిగా సప్లయి చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంతా బాగా తాగి సంతోషించి ప్రభుత్వ రాబడి  పెంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఇదే ఆ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ అధికారులతో జరిపిన రివ్యూ సారాంశం. ఈ సమీక్షలో ఆదాయం పెంచాల్సిన అవసరాన్ని అధికారులతో పంచుకున్నారు. ప్రభుత్వంలో ప్రస్తుతం ఆదాయ వనరుగా మద్యం మాత్రమే కనిపిస్తోంది. అందువల్ల ఎన్నికల  హామీ అయిన ‘99 రుపాయల క్వార్టర్ ’ సంగతి మర్చిపోవాల్సిందే.

రు. 99 క్వార్టర్ ఏమయింది?

గతంలో ఉన్న మద్యం ధరలను కూటమి ప్రభుత్వం తగ్గిస్తుందని అందరూ భావించారు. అయితే ఏ ఒక్క బాటిల్ పై కూడా ధరలు తగ్గలేదు. రూ. 99 లకే మద్యం విక్రయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ విషయం కూడా పట్టిచుంకోవడం లేదు. ఎన్నికల హామీ ప్రకారం  సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని 2024 సెప్టెంబర్ 18 న జరిగిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రకటించే నూతన మద్యం పాలసీలో రూ 99కే క్వార్టర్ (180మి.లీ) క్వాలిటీ లిక్కర్‌ ఇస్తున్నట్లు మంత్రి పార్థసారధి క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు. బాబు నిర్ణయం అమలు అవుతుందని మందుబాబులు అప్పటి నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ క్యాబినెట్ నిర్ణయంతో సర్వత్రా చిందులేశారు. సోషల్  మీడియాలో వ్యంగ్యంగా " తల్లికి వందనం లేదు, నాన్నకు ఇంధనం రెడీ" అని చురకలేశారు. కాని జరిగిందేమిటి? వందలోపు ధర ఉన్న మద్యం బాటిల్స్ అందుబాటులో ఉండటమే లేదు. ఛీప్ లిక్కర్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందనే ఆలోచన కూడా  ఈ నిర్ణయం మానుకుని ఖరీదైనా మంచి మందు ఇచ్చేందుకు 99 క్వార్టర్ ని వదిలేసినట్లు తెలిసింది. అందుకే మినిమం క్వార్టర్ బాటిల్ రూ. 200లు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తున్నది.  దీనికితోడు సర్దుబాటు పేరుతో క్వార్టర్ బాటిల్ పై పది రూపాయలు పెంచేశారు.  ఇందులో ఆలోచించాల్సిందేమిటంటే క్వార్టర్ బాటిల్ పై కూడా పది రూపాయలు పెంచడం ఏమిటనే చర్చ మొదలైంది. ఫుల్ బాటిల్ పై రూ. 10లు పెంచినా ఇబ్బంది లేదు కానీ ప్రతి బాటిల్ పై పెంచడం చర్చనియాంశంగా మారింది. వ్యాపారులు నష్టపోకుండా పెంచామే తప్ప ప్రభుత్వానికి లాభం కోసం కాదని చెబుతోంది.

సాధ్యాసాధ్యాలు

సానుకూల అంశాలు: గత ఏడాది 14.84 శాతం పెరుగుదల సాధించిన నేపథ్యంలో 17.5 శాతం పెరుగుదల అసాధ్యం కాకపోవచ్చు. కొత్త పాలసీలోని ప్రతిఅంశం రాష్ట్ర ఆదాయ వృద్ధికి దోహదపడేలాగే తయారు చేశారు. సీజనల్ వ్యత్యాసాల వల్ల కొన్ని నెలల్లో ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ధరలుపెరిగాయని మందుమానేయడం జరగదనే సత్యాన్ని నమ్ముకుని రాబడి లక్ష్యం నిర్ణయించుకున్నారు.

దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే...

తెలంగాణ, తమిళనాడు, కర్నాటక వంటి దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ ఆదాయం తక్కువగా ఉంది. తమిళనాడు, కర్నాటకలో జనాభా ఎక్కువగా ఉండటం, మద్యం వినియోగం అధికంగా ఉండటం వల్ల ఆదాయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఎక్సైజ్ పన్నుల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పాలసీ ఆదాయాన్ని పెంచినప్పటికీ, ఇతర రాష్ట్రాల స్థాయికి చేరుకోవడానికి ఇది బాట వేయవచ్చు.


Tags:    

Similar News