సివిల్స్ ఔత్సాహికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!

సివిల్స్ ఔత్సాహికులకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు.

Update: 2024-07-20 07:14 GMT

సివిల్స్ క్రాక్ చేయడం అనేది దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతకు ఒక డ్రీమ్. అందుకోసం కుటుంబానికి దూరంగా ఉంటూ రాత్రింబవళ్లు శ్రమిస్తారు. అలాంటి కలను సాధించాలని పోరాడే తెలంగాణ యువతకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ తీపి కబురు చెప్పింది. వారికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. సివిల్స్ ఔత్సాహికులకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. అందుకోసమే తమ ప్రభుత్వం ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని తీసుకొచ్చిందని సీఎం ప్రకటించారు. ప్రజాభవన్‌లో సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగానే ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన తెలంగాణ అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని సాధించుకున్న కారణాల్లో ఉద్యోగ నియామకాలు కూడా ఒక ప్రధాన అంశమేనని, తెలంగాణలో నిరుద్యోగులను తగ్గించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన చెప్పారు.

‘‘తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల త్యాగాలతో ఏర్పడింది. ఈ రాష్ట్ర ఏర్పాటులో యువతకు ఉద్యోగ నియామకాలు అందించడం కూడా ప్రధనాంశమే. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మా ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంది. 90 రోజుల్లో 30వేల ఉద్యోగాల భర్తీ చేశాం. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కోసం అనేక మంది ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారు. నిరుద్యోగుల బాధ మాకు బాగా తెలుసు. వారికి ఇచ్చిన హామీ ప్రకారమే అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేశాం. టీజీపీఎస్సీని పునఃవ్యవస్తీకరించాం. పరీక్షలు మాటిమాటికి వాయిదా పడటం ఏమాత్రం మంచిది కాదు. అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకుని గ్రూప్-2ను వాయిదా వేశాం’’ అని చెప్పారాయన.

నిరుద్యోగుల సమస్యలకే పెద్దపీట

‘‘నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికే మా ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. ప్రణాళిక ప్రకారమే ఈ భర్తీ ప్రక్రియను చేపడుతున్నాం. జూన్ 2న నోటిఫికేషన్, డిసెంబర్ 9 లోపు ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తాం. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున సాయం చేస్తున్నాం. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా జాబ్ సాధించాలి. సివిల్స్ సాధించి మన రాష్ట్రానికే తిరిగి రావాలి. ఐఏఎస్, ఐపీఎస్‌లు మన వారైతే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గత ఐదేళ్లలో ఏ నోటిఫికేషన్ కూడా సమయానికి ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకు ఏదైనా కారణం కావొచ్చు. కానీ యువత ఉజ్వల భవిష్యత్తును ఆగమైంది’’ ని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్.

అవకతవకలే ఎక్కువ

‘‘దురదృష్టవశాత్తూ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్న కలతో సన్నద్దం అయ్యేవారికంటే. ఆ పరీక్షల్లో జరిగే నిర్వహణ లోపాలపై కొట్టాడేందుకే వారి సమయం ఎక్కువ వృథా అయింది. యూపీఎస్సీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా.. వాటిపై ఆరోపణలు లేవు. అందుకే మేం గతంలో యూపీఎష్సీ ఛైర్మన్‌ను కలిశాం. యూపీఎస్సీ తరహాలో కొన్ని మార్పులు చేసి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తున్నాం’’ అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన పరీక్షల్లో జరిగిన అవకతవకలు అన్నీ ఇన్నీ కావని, ఆ కారణంగానే ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులు తమ భావితరాలైనా బాగుండాలన్న ఉద్దేశంతో రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేశారని, యువతలో ఈ తెగువ చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు రేవంత్.

Tags:    

Similar News