సీఎం చంద్రబాబు ప్రైవేటు ప్రేమ

ప్రైవేట్ రంగంపై ముఖ్యమంత్రి చూపిస్తున్న ప్రేమ ప్రభుత్వ రంగంపై చూపించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.;

Update: 2025-09-07 04:10 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ పారిశ్రామిక వేత్తలతో సమావేశమై, రాష్ట్ర అభివృద్ధికి ప్రైవేటు రంగాన్ని మాత్రమే ఆధారం చేసుకున్నట్టుగా మాట్లాడటం విమర్శలకు దారి తీస్తోంది. శనివారం క్యాంపు కార్యాలయంలో ఎంట్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ సభ్యులతో జరిగిన భేటీలో అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో అవకాశాలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు.

విశాఖ-చెన్నై మధ్య నాలుగు లేన్ల రైల్వే లైన్, అమరావతి-హైదరాబాద్-బెంగుళూరు-చెన్నై కారిడార్, గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కారిడార్, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రైవేటు ఆధారిత ప్రాజెక్టులను ప్రస్తావించారు. అయితే అధికారం చేపట్టిన 14 నెలల కాలంలో ప్రభుత్వ రంగంలో ఒక్క కొత్త సంస్థను కూడా స్థాపించకపోవడం, దాని పట్ల మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేవీవీ ప్రసాద్ విమర్శించారు.


సీఎం చంద్రబాబు ఇంట్లో జరిగిన యువ పారిశ్రామికవేత్తల సమావేశం

ప్రభుత్వ రంగం నిర్వీర్యమవుతున్న నేపథ్యంలో సీఎం ఈ వైఖరి మరింత వివాదాస్పదంగా మారింది. "పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలి" అంటూ యువతకు పిలుపునిచ్చిన చంద్రబాబు, "ఆంధ్రా ప్రెన్యూర్స్ అనే పేరు నిలబెట్టండి" అని సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారు చేయాలని, సంస్థలను వృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పారు. కానీ ఈ సమావేశంలో ప్రభుత్వ రంగం గురించి ఒక్క మాట కూడా ప్రస్తావనకు రాలేదు.

రాష్ట్రంలో 33 శాతం పచ్చదనాన్ని 50 శాతానికి పెంచే ప్రయత్నాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి వంటి అంశాలను ఎత్తి చూపిన సీఎం, ఇవన్నీ ప్రైవేటు రంగానికి మద్దతుగా మాత్రమే పని చేస్తున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తే విధంగా ఉన్నాయని పర్యావరణ యాక్టివిస్ట్ జేవీ రత్నం అన్నారు. రాష్ట్రంలోని సముద్ర తీరం అంతా ఇప్పటికే ప్రైవేట్ పారిశ్రామిక వేత్తలకు అప్పగించారని, 33 శాతంగా ఉన్న పచ్చదనం 50 శాతంగా రావాలని కోరుకోవడంలో అర్థం లేదన్నారు. ఇప్పటికే సముద్ర తీరం అంతా కలుషితమైందని, త్వరలో రాబోతున్న ధర్మల్ విద్యుత్ ప్లాంట్ల వల్ల పూర్తి స్థాయిలో పచ్చదనం హరించుకు పోతుందని రత్నం అన్నారు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు, ఆదాయం, సామాజిక సేవలలో కీలక పాత్ర పోషించాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047ను ప్రస్తావిస్తూ పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను సిద్ధం చేస్తున్నామని చెబుతోంది. కానీ ఇందులో ప్రభుత్వ రంగం పాత్ర ఎక్కడా కనిపించడం లేదు. "ప్రైవేటు సంస్థలు లేకుంటే రాష్ట్ర అభివృద్ధి జరగదు" అన్నట్టుగా సీఎం మాట్లాడటం, లోకేష్‌ను గొప్పగా ప్రస్తావించడం వంటివి రాజకీయ విశ్లేషకులలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. లోకేష్‌ను ప్రస్తావించడం వెనుక కుటుంబ రాజకీయాలు ఉన్నాయా? ప్రభుత్వ రంగాన్ని పక్కనపెట్టి ప్రైవేటు రంగానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సామాన్యులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పార్కుల సుందరీకరణ వంటి ప్రకటనలు చేస్తున్నా, ఇవి ప్రైవేటు పెట్టుబడులకు మాత్రమే మద్దతుగా మారుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగం నిర్వీర్యమవుతున్న ఈ తరుణంలో సీఎం ప్రైవేటు రంగ ప్రేమ రాష్ట్ర అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తుందా? లేక వర్గ విభేదాలను పెంచుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ భరత్ సహా వివిధ ప్రాంతాల యువ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News