విశాఖ సెంట్రల్ జైలులో ఏం జరుగుతోంది?
కుటుంబాలతో సహా వార్డర్ల తిరుగుబాటు. గంజాయి, ఇతర అక్రమాలపై చెక్ పెట్టడంపై ఆందోళన. 37 మందిపై క్రమశిక్షణ చర్యలు. ఈ కేంద్ర కారాగారంలో ప్రక్షాళన మొదలు.;
నేరాలు, ఘోరాలు చేసి శిక్ష పడిన వారు, అవినీతి అక్రమాలకు పాల్పడి చిక్కిన వారు జైలుకు వెళ్తుంటారు. నిబంధనల ప్రకారం జైలు సిబ్బంది, అధికారులు నడచుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది. కానీ విశాఖ సెంట్రల్ జైలులో పరిస్థితి అదుపు తప్పింది. అది అలా ముదిరి ముదిరి ఇప్పుడు ఏకంగా ఉన్నతాధికారులపైనే తిరుగుబాటు చేసే స్థాయికి వచ్చింది. ఎందుకిలా? కొన్నేళ్లుగా విశాఖ కేంద్ర కారాగారం (సెంట్రల్ జైలు) వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తరచూ ఏదో అలజడితో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ జైలులోకి గంజాయి సరఫరాతో పాటు అవినీతి వ్యవహారాల్లో అధికారులు, సిబ్బంది కూరుకుపోయారు. చాలా ఏళ్లుగా వీరు ఈ పంథాకు అలవాటు పడ్డారు.
ఇలా జైలు అధికారులు, సిబ్బంది అంతర్గతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ దండిగా దండుకుంటున్నారు. ఈ జైలులో శిక్షను అనుభవిస్తున్న, రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారి బంధువుల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. సాధారణంగా రిమాండ్ లో ఉన్న ఖైదీల తో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ములాఖత్ అవ్వాలన్నా, వారికి అవసరమైనవి సమకూర్చాలన్నా జైలు అధికారుల సహకారంతో వార్డర్లు సాయపడుతున్నారు. ఇందుకు ఖైదీ స్థాయిని బట్టి రూ. వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా వ్యవహారాలు మరింత శృతిమించాయి. కొన్నాళ్ల క్రితం శ్రీనివాసరావు అనే ఫార్మసిస్టు జైలులో ఉన్న ఖైదీలకు తన లంచ్ బాక్స్ లో గంజాయిని తీసుకెళ్తూ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలో దొరికిపోయాడు.
ఇటీవల రిమాండ్ ఖైదీగా ఉన్న గుర్రాల సాయి అనే ఓ రౌడీషీటర్ను ఏఆర్ పోలీసులు కోర్టులో హాజరుపరచి తిరిగి జైలుకు తీసుకొచ్చారు. జైలులోకి ప్రవేశించే ప్రధాన ద్వారం వద్ద ఈ రౌడీషీటర్ అరుపులు, కేకలతో హల్చల్ చేశాడు. జైలు సిబ్బందికి తాను లంచాలిస్తున్నానని, ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనమైంది. అలాగే అప్పటి జైలు సూపరింటెండెంట్ కిషోర్కుమార్, అదనపు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావులు రాత్రి వేళ ఖైదీల కుటుంబీకులతో సెల్ఫోన్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించారన్న ఫిర్యాదులతో జైళ్ల శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఆ విచారణలో ఆ ఆరోపణుల నిజమని నిర్ధరణ అయ్యాయి. దీనిపై తొలుత సూపరింటెండెంట్ను అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలుకు, అదనపు సూపరింటెండెంట్ను నెల్లూరు జైలుఉ బదిలీ చేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే వారిద్దరినీ సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరి సస్పెన్షన్ అనంతరం ఈ కారాగారంలో నిఘాను పటిష్టం చేశారు. దీంతో ఇన్నాళ్లూ వీరితో అంటకాగిన, అవినీతి వ్యవహారాల్లో సహకరించిన వార్డర్ల అక్రమ ఆదాయానికి గండి పడింది.
ఏకంగా తిరుగుబాటుకు తెగించిన వార్డర్లు..
ఇన్నాళ్లూ జైలు అధికారుల సహకారంతో అక్రమాలు సాగించిన కొంతమంది వార్డర్లకు ఇటీవల పరిణామాలు మింగుడు పడలేదు. ఆరోపణలతో జైలు సూపరింటెండెంట్, అదనపు సూపరింటెండెంట్లు సస్పెండయిన తర్వాత వారి స్థానంలో మహేష్ బాబు అనే సూపరింటెండెంటు, మరో ఇద్దరు డిప్యూటీ జైలు సూపరింటెండెంట్లను నియమించారు. ఈ జైలులో జరుగుతున్న అక్రమాలకు ఫుల్స్టాప్ పెట్టాలని, జైలు నిబంధనలు విధిగా అమలు చేయాలని ఉన్నతాధికారులు వీరిని ఆదేశించి పంపారు. ఇలా ఈ సెంట్రల్ జైలును ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. నిఘా పెంచడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా విధుల్లోకి వచ్చిన అనుమానిత వార్డర్లను నిశితంగా తనిఖీలు చేపట్టారు.
ఇప్పటికే కొన్నాళ్లుగా తమ ఆదాయానికి గండిపడిన నేపథ్యంలో.. తమను తనిఖీ చేయడం అవమానకరమంటూ ఓ వార్డరు జైలు అధికారితో వాదనకు దిగాడు. మిగిలిన వార్డర్లు ఆయనకు వంతపాడి ఆందోళనకు దిగారు. ఒకడుగు ముందుకేసి శనివారం రాత్రి (ఈనెల 28న) వారి కుటుంబ సభ్యులతో కలిసి జైలు ఎదుట ధర్నా చేపట్టారు. అంతేకాదు.. ఉన్నతాధికారులపై రాజకీయ ఆరోపణలూ చేశారు. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. బాధ్యులపై చర్యలకు ఆదేశించింది. జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ వెనువెంటనే సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. అదే సమయంలో విశాఖ జిల్లా జడ్జి గిరిధర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీల సమక్షంలో ఈ ఘటనపై విచారణ జరిపారు. జైలు నిబంధనల ప్రకారమే జైలు అధికారులను, సిబ్బందిని తనిఖీ చేయడం జరుగుతోందని, వార్డర్ల ఆరోపణలు క్రమశిక్షణ ఉల్లంఘనేనని డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు.
37 మంది వార్డర్లపై బదిలీ వేటు..
విశాఖ సెంట్రల్ జైలులో 89 మంది వార్డర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. వీరిలో అధికారులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వార్డర్లు 37 మందిగా గుర్తించారు. తనిఖీలు చేసిన జైలు డిప్యూటీ సూపరింటెండ్పై దురుసుగా ప్రవర్తించిన వాసుదేవరావును సస్పెండ్ చేశారు. మిగిలిన 36 మందిని రాష్ట్రంలోని వివిధ జైళ్లకు బదిలీ చేశారు. వీరి స్థానంలో ఇతర జైళ్లలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వార్డర్లను బదిలీపై ఇక్కడకు తీసుకురానున్నారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో వార్డర్లను బదిలీ చేయడం రాష్ట్ర జైళ్ల చరిత్రలో ఇదే ప్రథమం కావడం విశేషం.
వార్డర్ల వెనక ఎవరైనా ఉన్నారా?
ఏకంగా 37 మంది వార్డర్లు ఉన్నతాధికారులపై తిరగబడడం వెనక ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల సస్పెండైన జైలు సూపరింటెండెంట్, అదనపు సూపరింటెండెంట్లు, అలాగే ఖాళీ అయిన వారి స్థానంలోకి రావాలని ప్రయత్నించిన వారు వార్డర్లను ఉసిగొల్పి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్న అధికారులు త్వరలోనే నిగ్గు తేల్చే అవకాశం ఉంది. తాజా పరిణామాలతోనైనా విశాఖ సెంట్రల్ జైలులో ప్రక్షాళన అవుతుందో లేదో చూడాలి!
రాజమండ్రి జైలుకు 200 మంది ఖైదీలు
మరోవైపు ఈ కేంద్ర కారాగారంలో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారు. ఈ జైలు కెపాసిటీ 914 మందికే ఉండగా ప్రస్తుతం 2072 మంది ఉన్నారు. దీంతో సిబ్బంది కొరత కూడా తోడై ఇక్కడ జైలు నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ జైలు నుంచి 200 మంది ఖైదీలను కొన్నాళ్లపాటు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపాలని నిర్ణయించారు. అక్కడ 1200 మంది ఖైదీలుండే సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 1280 మంది ఉన్నారు. కొద్దిరోజుల్లోనే విశాఖ నుంచి రాజమండ్రి జైలుకు ఈ 200 మంది ఖైదీలను పోలీస్ ఎస్కార్ట్ విడతల వారీగా పంపనున్నారు.