తరగతి గదిలోనే 10వ తరగతి విద్యార్థిని ఉరి

ఏలూరు జిల్లా గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలంగా మారింది.

Update: 2025-11-21 12:42 GMT

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని గురుకుల పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం దారుణ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పొడపాటి కావ్య (15) తరగతి గదిలోనే చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

ఘటన ఎలా జరిగిందంటే.. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పాఠశాల అయిన తర్వాత భోజన విరామం ప్రకటించగానే విద్యార్థులంతా భోజనం కోసం డైనింగ్ హాల్ కి వెళ్లారు. అయితే కావ్య మాత్రం ప్లేట్ తీసుకొచ్చుకోవడానికి తరగతి గది వైపు వెళ్లింది. అయితే కావ్య ఎంత సేపటికి ప్లేటు తీసుకుని భోజనానికి రాకపోవడంతో తోటి విద్యార్థులు కావ్య కోసం తరగతి గదికి వెళ్లారు. తరగతి గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఉన్న కావ్యను చూసి కేకలు వేశారు. వెంటనే ఉపాధ్యాయులు, సిబ్బంది ఆమెను కిందికి దించి జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె మృతి చెందినట్టు వైద్యులు  నిర్థారించారు. 

కుటుంబ నేపథ్యం

  • కావ్య నివాసం: జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం గ్రామం
  • తండ్రి పొడపాటి గంగాధర్ – ప్రైవేటు కారు డ్రైవర్
  • తల్లి ఉష – డయాలసిస్ రోగి, కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నారు
  • కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని స్థానికులు తెలిపారు

పోలీసుల విచారణ

జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్, ఎస్సై వీరప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తేలలేదు. పాఠశాలలో ఒత్తిడి, కుటుంబ ఆర్థిక సమస్యలు, తల్లి అనారోగ్యం వంటి అంశాలు ప్రభావం చూపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రి తరలించారు. ఈ దారుణ ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో తీవ్ర విషాదం నింపింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని, పాఠశాలల్లో కౌన్సెలింగ్ విభాగాలను బలోపేతం చేయాలని స్థానికులు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News