ఏపీలోని 7 డిస్టిలరీలపై ఏకకాలంలో సీఐడీ దాడులు

ఆంధ్రప్రదేశ్ లోని మద్యం తయారీ సంస్థలపై సీఐడీ అధికారులు దాడులు నిర్వహిస్తారు. ఏకకాలంలో 7 డిస్టిలరీలలో సోదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ వైసీపీ వారివిగా భావిస్తున్నారు

Update: 2024-10-22 11:18 GMT

ఆంధ్రప్రదేశ్ లో మద్యం తయారీ కేంద్రాలపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు. పలు డిస్టిలరీల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో జరుగుతున్న ఈ తనిఖీలతో ఆయా సంస్థల యజమానులు కంగారుపడుతున్నారు. రాష్ట్రంలోని ఏడు డిస్టిలరీలలో సోదాలు జరుగుతున్నాయి. మద్యం తయారీకి ఉన్న అనుమతులను ఇతర లావాదేవీలను సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సంస్థలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేస్తున్నారు.

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలో ఉన్న ఎస్వీఆర్ డిస్టిలరీస్‌పై దాడులు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని విశాఖ, జీఎస్పీ డిస్టిలరీస్‌లో తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా సింగారయకొండ మండలం పాత సింగరాయకొండ పరిధిలోని పెరల్‌ డిస్టిలరీని అధికారులు తనిఖీలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సెంటనీ బయోటెక్ కర్మాగారంలో మద్యం బాటిలింగ్ యూనిట్‌లో సీఐడీ అధికారుల సోదాలు నిర్వహించారు.
నంద్యాలలో ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్‌ను సీఐడీ అధికారులు పరిశీలించారు. తనిఖీలు నిర్వహిస్తున్న మాట నిజమేనని సీఐడీ అదనపు ఎస్పీ హుస్సేన్‌ పీర తెలిపారు. సుమారు 30 మంది అధికారులు ఈ తనిఖీలలో పాల్గొంటున్నారు. కడప శివారులోని ఈగల్ డిస్టిలరీ కేంద్రంలో సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. తిరుపతి నుంచి వచ్చిన సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏడాది నుంచి ఈ కేంద్రంలో ఎంత మొత్తంలో మద్యం తయారు చేశారనేదానిపై రికార్డులు పరిశీలిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని డిస్టిలరీ పరిశ్రమలో కూడా సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి.
తనిఖీలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు చెబుతామని సీఐడీ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి జప్తులు జరగలేదు. రికార్డుల పరిశీలన కొనసాగుతోంది. అనుమానం ఉన్న రికార్డులు, కంప్యూటర్ డిస్క్ లను స్వాధీనం చేసుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నూతన ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపధ్యంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేయడం గమనార్హం. గత ఐదేళ్లలో ఎంత మద్యాన్ని తయారు చేశారు, ఎంత ప్రభుత్వానికి సరఫరా చేశారు అనే విషయాన్ని కూడా సిఐడి అధికారులు పరిశీలించారు.  ఏ ఏ తేదీలలో ఎంతెంత మద్యం సరఫరా అయింది అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు/
Tags:    

Similar News