అంతర్థానమౌతున్న తెలంగాణ చిందు కళారూపాలు

ప్రభుత్వం గనుక తమ కళను ఆదుకోకపోతే తొందరలోనే అంతరించిపోవటం ఖాయమని ఆవేధన వ్యక్తంచేశారు.;

Update: 2025-04-05 10:30 GMT
Chindu Artistes

ఇదేదో పొడుపుకథలాగుందా ? పొడుపుకథే కాని నిజజీవితంలో జరుగుతున్నదిదే. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణలో అంతరించిపోతున్న కళారూపాల్లో చిందు కళారూపం కూడా ఒకటి. చిందుకళారూపాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులు నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఈ కళాకారులు కూడా కుటుంబపరమైన వారసత్వంగా కళను అందిపుచ్చుకున్నవారే. గురుశిష్యపరంపరలో చిందుకళ(Chindu Art)ను నేర్చుకునే వారు లేరు, నేర్పేవారు కూడా పెద్దగా లేరు. అందుకనే కుటుంబంలోని వారసత్వంగా ఎవరైనా ముందుకువస్తే వాళ్ళకు మాత్రమే కుటుంబాల్లోని పెద్దవాళ్ళు నేర్పుతున్నారు. ఇలాంటి కుటుంబాల్లో నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలోని మునిపల్లిలో పులింటి కృష్ణయ్య కూడా ఉన్నారు. అసలు పేరు పులింటి అయినా చిందు కళారూపాల ప్రదర్శనలో దిట్టగా పేరొచ్చింది కాబట్టి కృష్ణయ్య ఇంటిపేరు చిందుల కష్ణయ్యగా పాపులరైపోయారు.


48 ఏళ్ళ వయసున్న కృష్ణయ్య తన తండ్రి చిందుల శ్యామ్ వారసుడిగా చిందు కళాకారుడిగా చిన్నపుడే మారారు. చిందుకళాకారులు పౌరాణిక పాత్రలనే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ప్రదర్శిస్తుంటారు. రామాయణ(Ramayan), మహాభారతా(MahaBharath)ల్లోని పౌరాణిక పాత్రలైన హిరణ్యకశిపుడు, భక్తప్రహ్లాదాడు, శ్రీరాముడు, రావణాసురుడు, భీష్ముడు, భీముడు, దుర్యోదనుడు, కీచకుడు, చెంచులక్ష్మి లాంటి అనేక పాత్రలను సోలోగాను, సహనటులతోను వేదికపైన ఆలవోకగా నటించేయగలరు. పాత్రలకు తగ్గట్లుగా అలంకరణ, ఆభరణాలు, మేకప్ తదితరాలన్నింటినీ కళాకారులే సొంతంగా తయారుచేసుకుంటారు. చిందు కాళారూపాల్లో కళాకారులు ధరించే ఆభరణాలు, వేసుకునే మేకప్ రంగులు, ధరించే దుస్తులు బయట ఎక్కడా దొరకవు అన్నింటినీ వీళ్ళే తాయరుచేసుకుంటారు. అందుకనే చిందు కళారూపాలు కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయాయి.


పులింటి కృష్ణయ్య నానమ్మ చిందుల ఎల్లమ్మ లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చారు. ఆమె నుండి కొడుకు చిందుల శ్యామ్ వారసత్వంగా కళను అందిపుచ్చుకున్నారు. శ్యామ్ తన కెరీర్లో సుమారు 35 వేల ప్రదర్శనలు ఇచ్చుంటారు. తండ్రి శ్యామ్ నుండి కృష్ణయ్య చిన్నవయసులోనే వారసత్వాన్ని అందుకున్నారు. ఈయన కూడా ఇప్పటికి సుమారు 30 వేల ప్రదర్శనలిచ్చారు. కృష్ణయ్య కూతురు బీఏ మొదటిసంవత్సరం చదువుతున్న శరణ్య వారసత్వాన్ని అందుకున్నారు. ఒకవైపు చదువుతునే మరోవైపు ఐదేళ్ళుగా శరణ్య కూడా చిందు కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. సొంతంగా ప్రదర్శనలు ఇవ్వటం కాకుండా తన తండ్రి బృందం చేసే ప్రదర్శనల్లోనే పాల్గొంటు సోలోగా ప్రదర్శనలు మొదలుపెట్టారు. శరణ్య తాత చిందుల శ్యామ్ దేశంలోని చాలా చోట్ల ప్రదర్శనలిచ్చారు. 1986 ఢిల్లీలో అప్నాఉత్సవ్ అనే కార్యక్రమం జరిగింది. ఆకార్యక్రమంలో శ్యామ్ తనబృందంతో ప్రదర్శించిన చిందు కళారూపాన్ని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి(Rajiv Gandhi), రష్యా అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ మెచ్చుకున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి టీ అంజయ్య, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్(YSR) కూడా శ్యామ్ ప్రదర్శనలను చూసి అభినందించారు. శ్యామ్ కళారత్న బిరుదును కూడా సొంతంచేసుకున్నారు.


ఇదే విషయాన్ని పులింటి కృష్ణయ్య తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు తమ ప్రదర్శనలకు ఆధరణ తగ్గిపోతోందన్నారు. ప్రభుత్వం గనుక తమ కళను ఆదుకోకపోతే తొందరలోనే అంతరించిపోవటం ఖాయమని ఆవేధన వ్యక్తంచేశారు. రాత్రి ప్రదర్శనల్లో చక్రవర్తులుగా, రాజులుగా వేషాలు వేసే తాము పగటిపూట మాత్రం బిచ్చగాళ్ళలాగ బతుకుతున్నట్లు చెప్పారు. గురుశిష్య పరంపరలో చిందుకళను బతికించేవాళ్ళ సంఖ్య చాలా తక్కువన్నారు. తమ వారసులే చిందుకళను కొద్దోగొప్పో బతికిస్తున్నట్లు చెప్పారు. ప్రదర్శనలకు అవసరమైన ఆభరణాలు, మేకప్ సామగ్రి, దుస్తులన్నింటినీ తామే సొంతంగా సమకూర్చుకుంటామన్నారు. దేవాదాయ, సాంస్కృతిక శాఖలు ప్రదర్శనలు ఏర్పాటుచేసి తమను కొంతవరకు ఆదుకుంటున్నట్లు తెలిపారు. తన తండ్రి చిందుల శ్యామ్ కు కళారత్న బిరుదు దక్కితే తన నానమ్మ చిందుల ఎల్లమ్మను ప్రభుత్వం హంస అవార్డుతో సత్కరించినట్లు కృష్ణయ్య చెప్పారు.


నెలలో తమబృందం సగటున 10 ప్రదర్శనలు ఇస్తున్నదన్నారు. ప్రతి ప్రదర్శనకు రు. 12 వేలు అందుతోందని ప్రదర్శనల ద్వారా అందుతున్న రు. 1.2 లక్షలను మొత్తం 15 మంది పంచుకుంటున్నట్లు చెప్పారు. మాదిగల్లో తమది చిందు ఉపకులమన్నారు. తాము ఎస్సీ సామాజికవర్గానికి చెందినా ప్రభుత్వం నుండి అందుతున్న పథకాలు మాత్రం ఏమీలేవన్నారు. తమ కుటుంబాల ఆర్ధికపరిస్ధితి చాలా దయనీయంగా ఉంది కాబట్టే తమను రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఆదుకోవాలని కృష్ణయ్య విజ్ఞప్తిచేశారు.


సమాజమే కళను పోషించాలి

చిందు కళారూపాన్ని ప్రభుత్వమే బతికించాలని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు, రచయిత, సాహితీకారుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు చెప్పారు. తెలంగాణ ఫెడరల్ తో చిందు కళను గురించి వివరిస్తు తెలంగాణలో చిందు కళారూపం చనిపోలేదు కాని చనిపోయే దశలో ఉందన్నారు. చిందాట ఆడేవాళ్ళ కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. చిందుకళ గురించి భరతశాస్త్రంలో కూడా ఉందన్నారు. అందుబాటులోని సమాచారం ప్రకారం చిందుకళ క్రీస్తుశకం 2వ శతాబ్దంనుండి ఉందన్నారు. బుర్రకథలు, సినిమాలు, టీవీలకు ఆధరణ పెరగటంతో చిందు కళారూపం బాగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు.

చిందుకళాకారులుగా సమాజంలో గుర్తింపు ఉందికాని మాదిగలోని చిందు ఉపకులంగా ఈ కళాకారులకు గుర్తింపు దక్కలేదని వాపోయారు. చిందుకళ బతకటానికి ప్రభుత్వపరంగా పెద్దగా జరిగిన కృషి ఏమీలేదన్నారు. చిందుకళ బతకాలంటే సమాజమే పోషించాలని అబిప్రాయపడ్డారు. ఒకపుడు కులాల్లోని పెద్దలు చిందుకళాకారులను, కళారూపాలను అదుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఇపుడు చిందుకళను ఆధరించే కులాలు లేవన్నారు.

Tags:    

Similar News