ఆంధ్రాలో మిర్చి ప్రైస్ వార్! జగన్ v/s చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో మిర్చి వార్ నడుస్తోంది. ధర లేదని రైతులు వీధుల్లో నిరసన వ్యక్తం చేస్తుంటే మిర్చి ధరల ఘాటు నుంచి లబ్ధి పొందాలని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.;

Update: 2025-02-20 07:08 GMT
ఆంధ్రప్రదేశ్ లో మిర్చి వార్ నడుస్తోంది. గిటుబాటు ధర రావడం లేదని రైతులు వీధుల్లో నిరసన వ్యక్తం చేస్తుంటే మిర్చి ధరల ఘాటు నుంచి లబ్ధి పొందాలని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని మాట ఎల్లప్పుడూ ఉండే నగ్నసత్యం. దాన్ని పట్టించుకోవడానికి బదులు మేముండగా అంత చేశాం అని ఒకరంటే అంతకుమించి చేశామని మరొకరు దెప్పిపొడుచుకుంటున్నారు తప్ప రైతుకు మేలు జరిగే వ్యవహారం చూడడం లేదు. రెండేళ్ల కిందట క్వింటాల్ మిర్చి 20 వేలు పలికితే ఇప్పుడు రూ.10,12 వేలకు కూడా ఎందుకు కొనడం లేదో ఆలోచించడం లేదు.
మిర్చికి ధర రావడం లేదని రైతులు కొంతకాలంగా ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని వాపోతున్నారు. రాష్ట్రంలోని కర్నూలు, నంద్యాల, దాచేపల్లి, సత్తెనపల్లి వంటి ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ నుంచి కూడా రైతులు అధిక ధర వస్తుందేమోనని గుంటూరు యార్డుకు మిర్చిని తీసుకువచ్చి నష్టాల భారాన్ని మోస్తున్నారు.
ఆసియాలో అతిపెద్ద మిర్చి మార్కెట్ సెంటర్ గుంటూరు. ఇక్కడి మిర్చి యార్డ్ నుంచి ప్రతి ఏటా 1.5 లక్షలకు పైగా మిర్చి టిక్కీలను (40 కిలోల సంచులు) 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తుంది. దీని వలన రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 10,000 కోట్ల టర్నోవర్, రూ. 100 కోట్ల ఆదాయం వస్తుంది. అయితే, ఈ ఏడాది అన్ని రకాల మిర్చి ధరలు బ్యాగ్‌కు రూ. 1,000 నుండి రూ. 2,000 వరకు తగ్గాయి. ****-
అంతర్జాతీయ వాణిజ్యం గణనీయంగా మందగించిందని, ముఖ్యంగా చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి కీలక మార్కెట్ల నుండి ఆర్డర్లు బాగా తగ్గాయని యార్డులోని వ్యాపారులు చెబుతున్నారు. "ఇండోనేషియా, వియత్నాం, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాలు తమ ఆర్డర్‌లను తగ్గించుకున్నాయి. ఫలితంగా ధరలు పడిపోయాయన్నది అటు రైతులు ఇటు ప్రభుత్వం కూడా చేస్తున్న వాదన.
అధికారిక డేటా ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 1.94 లక్షల హెక్టార్లలో మిరప సాగైంది. ఈ సీజన్‌లో 11.29 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. అయితే, వరుసగా తెగుళ్లు సోకడం వల్ల సాగు ఖర్చులు 30% పైగా పెరిగాయి. అకాల వర్షాలు, తెగుళ్లతో కాయ నాణ్యత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో గిరాకీ తగ్గింది. దీంతో చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను నష్టాలకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎకరా మిర్చి సాగుకి దాదాపు రూ. 2.5 లక్షలకు పైగా ఖర్చవుతుంటే ఈ ఏడాది వస్తున్న ధరల్ని చూస్తుంటే అసలు పెట్టుబడులైనా వస్తాయా అని రైతులు వాపోతున్నారు.
మిర్చి ధరల సంక్షోభం, విదేశాల్లో గిరాకీ తగ్గడం వంటి అంశాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ముందే పసిగట్టి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో చర్చించారు. ముఖ్యమంత్రి వెంటనే మార్కెటింగ్, వ్యవసాయం, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ధరలను స్థిరీకరించడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత వ్యాపారులు, విక్రేతలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. వ్యాపారులు తమ కొనుగోలు కార్యకలాపాలను పెంచుకోవాలని, మార్కెట్ స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన చర్యల కోసం రైతులు ఎదురుచూస్తున్నందున, వారి ఆర్థిక భారాలను తగ్గించడానికి వారు ధరల పునరుద్ధరణ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పార్లమెంటులో గుంటూరు మిరప..
కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు, టిడిపి పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు గత ఏడాది చివర్లో వచ్చిన అకాల వర్షాలకు నష్టపోయిన మిర్చి రైతులకు పరిహారం అందించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. మిరప రైతులను ఆదుకోవడానికి క్వింటాలుకు రూ.11,600 చొప్పున మిరపకాయను కొనుగోలు చేయాలని వారు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖల్ని కూడా కేంద్ర మంత్రికి లేఖను సమర్పించారు.
జగన్ రాకతో మొదలైన కాక...
సరిగ్గా ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులకు సాయం చేయకపోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ మూలన పడేశారన్నారు. రైతుల్ని దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలివేశారని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూ లేని విధంగా మేలు చేకూర్చినట్టు చెప్పారు. 2019–­20లో రూ.90.24 కోట్లు.. 2020–21­­లో రూ.36.02 కోట్లు... 2021–22లో రూ.439.79 కోట్లు చొప్పున రైతులకు పంటల బీమా అందించామన్నారు.
దిగుబడుల వివరాలు..
ఆంధ్రప్రదేశ్ లో మిర్చి సాగు 2023-24 లో ఖరీఫ్ +రబీ కలిపి 2,70,000 హెక్టార్లు. దిగుబడి 12,13,000 టన్నులు. హెక్టారుకు సరాసరి దిగుబడి 4496 కిలోలు. 2022లో క్వింటాల్ మిర్చి నాణ్యమైన కాయల్ని రూ.18 నుంచి 20వేల వరకు కొనుగోలు చేశారు.
2024-25 లో సాగు 1,94,000 హెక్టార్లు. దిగుబడి 7,21,000 టన్నులు. హెక్టారుకు సరాసరి దిగుబడి 4006 కిలోలని అంచనా. దిగుబడి ప్రారంభంలో వ్యాపారులు రైతుల్ని దోపిడీ చేయడం ప్రారంభించారు. తేజ వంటి నాణ్యమైన కాయల్ని కూడా క్వింటాల్ కి రూ. 12వేలకి మించనీయడం లేదు.
ఎకరా సాగు ఖర్చు పెరిగింది. మార్కెట్ లో ధరలు పడిపోయాయి. దీంతో మిర్చి రైతు తీవ్ర సంక్షోభం లో ఉన్నాడు. ఈ సంక్షోభానికి గల కారణాల పై సరైన దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
జగన్ తన పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఖండించారు. నిజాలు తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
జగన్ పర్యటన మర్నాడే చంద్రబాబు ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసేందుకు వెళ్లారు. బహుశా ఏదైనా గట్టి హామీ తీసుకువస్తారేమో చూడాలి.
Tags:    

Similar News