చెవిరెడ్డికి ’చెస్ట్‘ పెయిన్..ఆసుపత్రికి తరలింపు
లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కీలక సీనియర్ నేత, మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న ఆయన, సోమవారం ఉదయం చెస్ట్ పెయిన్‌తో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పోలీసు అధికారులు ఆయనను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొన్ని రోజులుగా వెరికోస్ వెయిన్స్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అది ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు తక్షణ చికిత్స అందిస్తున్నారు. చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించిన వివరాలను అధికారుల మీడియాకు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. చెవిరెడ్డికి సంబంధించిన ఆస్తులను జప్తు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయన మానసిక ఆందోళనలకు గురైనట్లు సమాచారం.
మరో వైపు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలపై తెరపైకొచ్చిన ఏపీ లిక్కర్ స్కాం కేసు ఇప్పటికీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ కేసును చాలా రోజులుగా దర్యాప్తు చేస్తోంది. ఈ స్కాంలో మద్యం వ్యాపారం ద్వారా భారీ మొత్తంలో అక్రమ డబ్బు పార్టీ ఎన్నికల ప్రచారాలకు ఉపయోగించినట్లు SIT నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 39 మంది నిందితులుగా ఉండగా వీరిలో 9 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో చెవిరెడ్డి ఒకరు.
మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (A-38) కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూన్ 17, 2025న బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో శ్రీలంకకు వెళ్తుండగా SIT అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు వెంకటేష్ నాయుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. SIT ప్రకారం, ప్రధాన నిందితుడు రాజ్ కాసిరెడ్డి నుంచి రూ.285 కోట్లు భాస్కర్ రెడ్డికి వచ్చాయి. ఇవి 6 జిల్లాల్లో వైసీపీ ప్రచారాలకు ఉపయోగించారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి (A-39) కూడా డబ్బు పంపిణీలో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ స్కాం దర్యాప్తులో వచ్చిన ముడుపులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం భారీ ఆస్తులు కొనుగోలు చేసినట్లు SIT గుర్తించింది. ఆయన భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ (KVS ఇన్‌ఫ్రా MD), కుమారులు మోహిత్, హర్షిత్ రెడ్డి పేర్లతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరులో ఆస్తులు ఉన్నాయని, ఇవి మద్యం వ్యాపారం, బెనామీ ల్యాండ్ డీల్స్ ద్వారా వచ్చిన అక్రమ డబ్బుతో కొనుగోలు చేసినవని అధికారులు నివేదించారు. ఈ క్రమంలో నవంబర్ 19న ఏపీ ప్రభుత్వం CIDకు ఈ ఆస్తులను జప్తు చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఘటనలు వైసీపీలో ఆందోళనలు పెంచాయి. భాస్కర్ రెడ్డిని కావాలనే అరెస్టు చేశారని, రాజకీయ ప్రతీకార కక్షలకు పాల్పడుతోందని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.