విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేసిన చంద్రబాబు
గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసింది. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడుతామని సీఎం చంద్రబాబు అన్నారు.
Byline : Vijayakumar Garika
Update: 2024-07-09 13:15 GMT
ఆంధ్రప్రదేశ్‌లో శ్వేత ప్రతాల విడుదల పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు శ్వేత పత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం మంగళవారం విద్యుత్ రంగంపై మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. గతంలో రెండు శ్వేత పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంపైనా మంగళవారం అమరావతి సచివాలయంలో మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలు లేకుండా, లో ఓల్టేజీల సమస్యలు లేకుండా చేస్తామని, ఈ విషయాలల్లో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తుందని, వీటిపైన పని చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లోఓల్టేజీ నియంత్రణలో విఫలమైన అధికారుల రికార్డులు తీసుకొని, క్షుణ్ణంగా పరిశీలించి అలాంటి వారిపైనా చర్యలు తీసుకుంటాం. లో ఓల్టేజీ ట్రాకింగ్ సిస్టమ్ తమ ప్రభుత్వ హయాంలో చాలా బాగా పని చేసిందని, గత ప్రభుత్వంలో దానిని కూడా నిర్వీర్యం చేశారన్నారని ముఖ్యమంత్రి మంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పెంచిన విద్యుత్ భారాలు లేకుండా చేస్తారా అనే దానిపై ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఇమ్మిడియట్‌గా భారం పడిపోయింది. తర్వాత రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ రావాలి. ఇది వచ్చే మార్చికి వస్తుంది. ఒక పక్క టారిఫ్‌ను ఎలా కంట్రోల్ చేయాలి, మరో పక్క దీన్ని ఎలా రివైవ్ చేయాలి, పేదవాళ్లకు లాంగ్ టర్మ్‌లో, షార్ట్ టర్మ్‌లోను ఏ విధంగా భారాలు లేకుండా చేయాలనే వేరియస్ చాలెంజెస్ ఉన్నాయి. దీనిపైన కేంద్రం ఎంత వరకు సహాయం చేయగలుగుతుందో ఆ హెల్ప్ తీసుకోవాలి. మన కష్టంతో మనం సరిదిద్దుకుంటూ కేంద్రం చేయూత కూడా తీసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. అలా కాకుండా మొత్తం భారం మీరే తీసుకోండి, మీరే చేయండని కేంద్రాన్ని అడిగినా, కేంద్రానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నా కేంద్రానికి కూడా కొని సమస్యలు ఉంటాయి. దీనిని ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు.
గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన స్మార్ట్ మీటర్ల రద్దుపై ఆయన మాట్లాడుతూ దీనిపైన వర్కవుట్ చేస్తున్నామన్నారు. ఓవరాల్ స్కీమ్‌ను స్టడీ చేయాలన్నారు. ఓవరాల్ స్కీమ్‌లో అవి ఎంత రేటుందనే కూడా చూసుకోవాలి, అగ్రిమెంట్లు ఏమున్నాయో చూసుకోవాలి, ఒక వేళ అలాంటి మీటర్లు పెట్టుంటే వాటిని వేస్ట్ చేయకుండా, అక్కడే సోలార్ ప్యానల్స్ కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ఇచ్చి, నాలుగైదేళ్లల్లోనే రీపేమెంట్ అయ్యేవిధంగా చూసి, వాళ్లే ఆపరేట్ చేసుకుంటారు, పవర్‌ను ఉపయోగించుకుంటారు, సర్‌ప్లస్ ఉంటే తిరిగి డిపార్ట్‌మెంట్ ఇస్తారు, తిరిగి డబ్బులు పే చేసే విధానాన్ని కూడా తీసుకొస్తామన్నారు.
గత ప్రభుత్వ అసమర్థత పాలన వల్ల విద్యుత్ రంగంలో రూ. 47,741 కోట్లు వరకు నష్టం వాటిల్లిందన్నారు. 2014లో 22.5 మిలియన్ల యూనిట్ల కరెంట్ కొరత ఉంటే దానిని కేవలం 3 మాసాల్లోనే అధిగమించడంతో పాటు మిగుల విద్యుత్ సాధించామన్నారు. 2014–19లో సౌర శక్తి, పవన విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచామన్నారు. కానీ గత ఐదేళ్లల్లో ప్రజలపై రూ. 32,166 కోట్ల చార్జీల భారం మోపారని, విద్యుత్ రంగంలో రూ. 49,496 కోట్ల అప్పులు చేశారని అన్నారు.
అంతేకాకండా ట్రూ ఆప్, ఇంధన సర్‌ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీల పేరుతో వివిధ రకాల చార్జీలు వైసీపీ ప్రభుత్వం వసూలు చేసిందని విమర్శించారు. గృహ వినియోగదారులపై 45 శాతం భారాలు పెంచారన్నారు. దీంతో 1.30 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. 50 యూనిట్ల కరెండు వాడిన పేదలపైన భారాలు మోపారన్నారు. వంద శాతం చార్జీలు పెంచారని, టారిఫ్ ద్వారా రూ. 16,699 కోట్లు, ట్రూ ఆప్ ద్వారా రూ. 5,886 కోట్లు, ఇంధన ఛార్జీల ద్వారా రూ. 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో రూ. 5,607 కోట్లు వసూలు చేశారని మండి పడ్డారు. గత ఐదేళ్లల్లో విద్యుత్ సంస్థల అప్పు 79 శాతం పెరిగిందన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి కలిపి గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రూ. 1,29,503 కోట్ల నష్టం జరిగిందన్నారు. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని, వాటి డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలన్నారు. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడుతామన్నారు. దీని కోసం కేంద్ర సహాయం తీసుకుంటామన్నారు.