పీ4 లో నేను సైతం అంటున్న చంద్రబాబు
తాను కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి;
By : V V S Krishna Kumar
Update: 2025-07-25 13:48 GMT
ఆంధ్రప్రదేశ్ లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రారంభించిన పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంగా సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాను తనతో పాటు కుటుంబ సభ్యులు బాగస్వాములు అవుతారని ప్రకటించారు. తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అమరావతిలో జీరో పావర్టీ-పీ4పై సీఎం సమీక్ష నిర్వహించి ,అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో మమేకం కావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు, ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేయాలని సూచించారు. బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్టు 10లోపు పూర్తిచేయాలని, ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలన్నారు.గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సూచించారు.
ఇప్పటి వరకు మార్గదర్శులుగా నమోదు చేసుకున్న వారి వివరాలను చంద్రబాబు దృష్టికి తెచ్చిన అధికారులు ,మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని తెలిపారు.ఇప్పటికి 57,503 మంది మార్గదర్శులు, 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకొన్నారని తెలిపారు.సోషల్ మీడియా, ఇతర ప్లాట్ ఫామ్‌ల ద్వారా పీ4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తలపెట్టిన డిజిటల్ ప్రమోషన్ కార్యకలాపాలపై కూడా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.పల్నాడు జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో కుటుంబాల దత్తత జరగగా ,విశాఖ జిల్లా చివరి స్థానంలో వుంది.