పింగళికి చంద్రబాబు, జగన్‌ నివాళులు

సోషల్‌ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పింగళి వెంకయ్యకు నివాళులు అర్పిస్తున్నారు.

Update: 2025-08-02 06:29 GMT

జాతీయ జెండా రూపశిల్పి, స్వాతంత్య్ర పోరాట యోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా శనివారం సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి నారా లోకేష్‌ నివాళులు అర్పించారు. ఆజన్మాంతం భరతమాత సేవలో తరించిన గొప్ప మహనీయుడు అని పింళి వెంకయ్య సేవలను కొనియాడారు.

సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 149వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. ఆజన్మాంతం భరత మాత సేవలో తరించిన మహనీయుడు పింగళి వెంకయ్య. జాతీయ పతాకం వినువీధిలో ఎగురుతున్నంత కాలం పింగళి వెంకయ్య మనకు గుర్తుంటారు. ప్రతి భారతీయుడు ఎప్పటికీ గర్వించే త్రివర్ణ పతాకాన్ని అందించిన ఆ మహనీయుని స్మృతికి ఘననివాళి అర్పిద్దాం.. అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్‌ వేదిక ద్వారా నివాళులు అర్పించారు.

జగన్‌ ఏమన్నారంటే..
భారతదేశ జాతీయ పతాక రూపకర్త, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారత దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్పూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను.. అంటూ జగన్‌ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

లోకేష్‌ ఏమన్నారంటే..
జాతీయ పతాక రూపకర్త, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన పేరు గడించారు. దేశానికి, రాష్ట్రానికి పింగళి వెంకయ్య నిరూపమాన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం.. అంటూ మంత్రి లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News