చంద్రబాబు అబద్ధానికి ప్రతిరూపం
కూటమి ప్రభుత్వ బరితెగింపును నిలువరిద్దామని వైసీపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్ధేశం చేశారు.;
By : The Federal
Update: 2025-08-24 14:16 GMT
సీఎం చంద్రబాబు అబద్ధానికి ప్రతిరూపం అని వైఎస్‌ఆర్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి «విమర్శించారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులతో (యాక్టివిటీ, మీడియా–సోషల్ మీడియా, ఆర్గనైజేషన్, అనుబంధ విభాగాలు, న్యాయ విభాగాలు) అవగాహన సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటి వారని, పార్టీ పునాదులను బలంగా నిర్మించడంలో మీరంతా క్రియాశీలక పాత్ర పోషించాలని, మీకు ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని నిలబడాలని, ప్రజల గొంతుకగా మారాలని, వైసీపీది ప్రజాపక్షం అని దీనిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
పార్టీకి బలమైన పునాదులను నిర్మించాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ధీటుగా ఎదుర్కోగలిగేలా సిద్దం కావాలి. పార్టీ కమిటీల నిర్మాణం అనేది ఇప్పుడు మండల స్ధాయి నుంచి గ్రామస్ధాయిలోకి వెళుతుంది. మనమంతా బలమైన వ్యవస్థగా రూపొందాం. పార్టీ ఆవిర్భావం నుంచి అనేక అంశాలలో క్రియాశీలకంగా ఉన్నాం. జగన్ కోట్లాదిమంది విశ్వాసం, నమ్మకం చూరగొని చక్కని పాలన అందించారు. సమిష్టిగా పనిచేసినప్పుడే మన పార్టీ బలోపేతం అవుతుంది. అందుకే ఈ ప్రయత్నంలో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శులను, జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకునేలా దిశానిర్ధేశం చేశామని మాట్లాడారు. జిల్లా నాయకులంతా శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం పార్టీ కల్పించింది. దీనిని ఛాలెంజ్‌గా తీసుకుని మీరు నిలబడాలి, పార్టీని నిలబెట్టాలి. అందుకు అవసరమైన టీమ్‌ను సిద్దం చేసుకోవాలి. మండల స్ధాయి నుంచి బలమైన నాయకత్వం ఉన్నప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. లోపాలు సరిదిద్దుకుని సమన్వయంతో ముందుకెళ్ళాలి. అందుకు అవసరమైన సమావేశాలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. ప్రజాసమస్యలపై నిరంతరం ప్రజలపక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల గొంతకగా మనం నిలబడాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. పార్టీ కోర్ టీమ్ సిద్ధమైతే వైసీపీ ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం. ఆకాశమే హద్దుగా మీరు పనిచేయగలిగే అవకాశాన్ని మన నాయకుడు జగన్ మీకు ఇచ్చారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంపై ఏడాది నుంచే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మోసగించారు. రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. వ్యవసాయాన్ని గాలికొదిలేశారు. రైతులు రోడ్లెక్కారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఘోరంగా ఉంది. విపరీతమైన అప్పులు చేస్తూ ఆ డబ్బులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్ధితి నెలకొందన్నారు. అడ్డగోలుగా దోపిడీ, విచ్చలవిడి అవినీతి, రోజుకో పేరుతో కొత్త కొత్త డ్రామాలు, చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుందన్నారు. కూటమి నాయకులు మాఫియా ముఠాల్లా తయారయ్యారు. జగన్ ఒక దార్శనికతతో వ్యవస్ధలు బలోపేతం చేస్తే చంద్రబాబు వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. పోలీస్ వ్యవస్ధను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులతో మన పార్టీ క్యాడర్‌ను వేధించడం, ప్రతిపక్షాన్ని నామరూపాల్లేకుండా చేయాలని కుట్రలు, కుతంత్రాలు, భయోత్పాతం ద్వారా చేయాలని చూస్తున్నారు అంటూ సీఎం చంద్రబాబుపైన, కూటమి ప్రభుత్వంపైన ఆయన మండిపడ్డారు. వైసీపీ వీటన్నింటిని ధీటుగా ఎదుర్కొంటోంది. మనం బలమైన పార్టీగా నిలబడ్డాం. ఇకముందు కూడా ఇదే పంథాతో ముందుకెళదాం. కూటమి ప్రభుత్వ బరితెగింపును నిలువరిద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.