ప్రతి 50 కిమీకు సీసీ కెమేరాలు

రహదారులు భవనాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.;

Update: 2025-07-24 15:04 GMT

ప్రతి 50 కిమీ దూరంలో ఒక సీసీ కెమేరా చొప్పున రాష్ట్రంలోని అన్ని రహదారులపై సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, ఎక్కడ వాహనాల రద్దీ ఉందో తెలుసుకుని ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించాలని, ప్రమాదాలు జక్కుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆర్‌ అండ్‌ బీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 2,000 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులను రూ.1,000 కోట్లతో కొత్తగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అంచనాలు, టెండర్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని సూచించారు. మరో రూ.500 కోట్లతో రాష్ట్రంలో దెబ్బతిన్న మిగిలిన రహదారుల మరమ్మతులు వర్షాకాలంలోనూ కొనసాగించాలని... వీలున్నంత త్వరగా వీటిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేయాలి.. ఏవి కొత్తగా నిర్మించాలి.. నిర్వహణకు ఏ రహదారులు ఇవ్వాలి... అనేదానిపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సంప్రదాయ విధానంలో రోడ్లు నిర్మించడం వల్ల ఆర్ధికంగా భారం కావడంతో పాటు, నాణ్యత విషయంలోనూ అనుకున్నంత స్థాయిలో లేవని... అందుకే, రహదారుల నిర్మాణంలో అత్యాధునిక విధానాలను అనుసరించాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో 20,000 కిమీ మేర రహదారులను గుంతలు లేకుండా మరమ్మతులు పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర రహదారులు ఉండాలి. ప్రతీ రహదారి నిర్దేశిత ప్రమాణాలతో నిర్మించాలి. వర్షాకాలం ముగిసిన వెంటనే నవంబర్‌ నుంచి కొత్త రహదారుల నిర్మాణం చేపట్టాలి. ఏ రోడ్డు ఏ కాంట్రాక్టర్‌ నిర్మించారు, ఎవరు మెయింటైన్‌ చేస్తున్నారు.. అనే వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలి. రాష్ట్రంలోని అన్ని రహదారుల్లో మరమ్మత్తుల నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించి.. వర్షాకాలంలో రోడ్లు పాడవ్వకుండా కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
12,653 కిమీ పొడవున రాష్ట్ర హైవేలు ఉండగా... ఇందులో 20 కిమీ కన్నా పొడవైన రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 20 కిమీ కన్నా పొడవైన రాష్ట్ర హైవేలు మొత్తం 260 వరకు ఉన్నాయి. అంటే 10,200 కిమీ పొడవైన రాష్ట్ర హైవేలను పీపీపీ విధానంలో చేపట్టేందుకు వీలుంది. వీటిలో అత్యధిక రద్దీ ఉన్న 1,332 కిమీ పొడవైన 18 రహదారులను ఫేజ్‌ 1, ఏ కింద..., 40 కిమీ కన్నా ఎక్కువ పొడవున్న 67 రహదారులు మొత్తం 3,854 కిమీ మేర ఫేజ్‌ 1, బీ కింద, అలాగే, 20 నుంచి 40 కిమీ మధ్య ఉన్న 175 రహదారులు మొత్తం 5,039 కిమీ ఫేజ్‌ 2 కింద, అదనంగా 115 కిమీ పొడవున్న యలమంచిలి–గాజువాక, గాజులమండ్యం–శ్రీసిటీ(సెజ్‌) రోడ్లు కూడా పీపీపీ విధానంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. దీనిపై మరింత అధ్యయనం చేసి తుది నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
Tags:    

Similar News