రెచ్చగొట్టారని కేసులు పెట్టారు
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూటమి ప్రభుత్వం కేసుల పర్వం కొనసాగిస్తోంది.;
By : The Federal
Update: 2025-04-10 13:09 GMT
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసులు నమోదైన నేతల జాబితాలో మరో నాయకుడు చేరాడు. ఆయనది ఏలూరు జిల్లా అయితే గుంటూరు జిల్లాలో ఆయనపై కేసు నమోదు చేశారు. రేపో, మాపో అయనకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించనున్నారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించనున్నారు.
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు మీద తాజాగా కేసు నమోదు చేశారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన ఓ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శించడమే కాకుండా కూటమి నాయకులను నరుకుతాము అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు అందడంతో గురువారం ఆయన మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన కూటమి నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరావల మ్యానీ, అడకా శ్రీను గుంటూరు నగరపాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు.
తాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్దకు వెళ్లాను. కూటమి ప్రభుత్వం ఏమి చేసినా కూడా దానిని దాటి ప్రజలు వైసీపీకి ఓట్లేస్తారని చెప్పాను. తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం తమపై కక్ష పెట్టుకోవద్దు అని అంటున్నారు. అది మాత్రం జరగదు. గుంటూరు ఇవతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతారు. గుంటూరు అవతలి నుంచి నరికిపారేస్తారు. మనింటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో.. వాళ్ల ఇంటికి మన ఇల్లు కూడా అంతే దూరం అంటూ కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో దుమారం రేపాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కారుమూరి వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. దీంతో కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు త్వరలో ఆయనకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయనున్నారు.
ఏలూరు జిల్లా అధ్యక్షులు, కైకలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(డీఎన్‌ఆర్)అధ్యక్షతన రెండు రోజుల క్రితం వైఎస్‌ఆర్‌సీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జి కారుమూరి సునీల్‌కుమార్, మాజీ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్, నూజివీడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు, పోలవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు, ఉంగుటూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పుప్పాల వాసు బాబు, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయ రాజు, ఏలూరు జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.