బీఆర్ఎస్ రాజకీయం ఇంట్రెస్టింగుగా మారుతోందా ?

పార్లమెంటు ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా గెలవలేదు. దీంతో బీఆర్ఎస్ రాజకీయాలు ఇంట్రెస్టింగుగా మారబోతున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Update: 2024-06-07 10:19 GMT

ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాక్కోవటానికి కాంగ్రెస్ పార్టీ గాలంకూడా వేయాల్సిన అవసరం వచ్చేట్లులేదు. ఎందుకంటే వరుస ఓటములతో కేసీయార్ నాయకత్వంపై పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల్లో నమ్మకం తగ్గిపోతున్నట్లుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ డౌన్ ఫాల్ స్టార్టయ్యింది. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్కచోట కూడా గెలవలేదు. దీంతో తెలంగాణా రాజకీయాలు ప్రత్యేకించి బీఆర్ఎస్ రాజకీయాలు బాగా ఇంట్రెస్టింగుగా మారబోతున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవటం ఒక దెబ్బయితే అంతకుమించిన దెబ్బ డిపాజిట్లు కోల్పోవటం. మొత్తం 17 సీట్లలో 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఒక్క మెదక్ నియోజకవర్గంలో మాత్రమే పార్టీ గట్టిపోటీ ఇచ్చింది. మిగిలిన నియోజకవర్గాల్లో చాలాచోట్ల పోలింగుకు ముందే అభ్యర్ధులు చేతులెత్తేశారనే ప్రచారం నిజమయ్యింది. దీనితో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది.2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధి లాస్యనందిత గెలిచారు. అయితే కొద్దిరోజులకే రోడ్డు ప్రమాదంలో మరణించటంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కేసీయార్ ఇక్కడ అభ్యర్ధిగా మరణించిన నందిత చెల్లెలు లాస్య నివేదితకే టికెట్ ఇచ్చారు.

సెంటిమెంటు రాజకీయమే తమ అభ్యర్ధిని గెలిపిస్తుందని కేసీయార్ అనుకున్నట్లున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల ట్రెండు చివరకు అసెంబ్లీ అభ్యర్ధిని నివేదితను కూడా ముంచేసింది. సికింద్రాబాద్ పార్లమెంటులో బీజేపీ అభ్యర్ధి జీ కిషన్ రెడ్డి గెలిస్తే కంటోన్మెంటు అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీగణేష్ గెలిచారు. అంటే సెంటిమెంటు రాజకీయం కూడా బీఆర్ఎస్ కు పనిచేయలేదని అర్ధమవుతోంది. ఇక ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎంఎల్సీ నియోజకవర్గం ఎన్నికలో కూడా కారుపార్టీ అభ్యర్ధి రాకేష్ రెడ్డి వెనకబడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న మెజారిటీలో ఉన్నారు. ఇక్కడి ఫలితాన్ని అధికారులు ఇంకా ప్రకటించలేదు.

ఈ నేపధ్యంలోనే పార్టీలో, క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను ప్రజాప్రతినిధులు, నేతలు బాగా గమనిస్తున్నారు. ఇదే సమయంలో అంటే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడగానే బీఆర్ఎస్ ఎంఎల్ఏలను ఆత్మప్రభోదం మేరకు నడుచుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో జాయిన్ అవటానికి రెడీగా ఉన్నట్లు ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు కాంగ్రెస్ తీర్ధం పుచ్చేసుకున్నారు. మెదక్ జిల్లాకే చెందిన ఎంఎల్ఏలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్తా ప్రభాకరరెడ్డి, మాణిక్ రావు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మరో ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ను వదిలేయటానికి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ ను ఏ బీఆర్ఎస్ ఎంఎల్ఏ కలిసినా నియోజకవర్గం అభివృద్ధి కోసమే కలిసినట్లు చెబుతున్నారు.

జరుగుతున్నది చూస్తుంటే ముందుగా రేవంత్ కన్ను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎంఎల్ఏల మీదపడినట్లు అర్ధమవుతోంది. బీఆర్ఎస్ బలమంతా గ్రేటర్ పరిధిలో గెలిచిన ఎంఎల్ఏలే అని అందరికీ తెలిసిందే. కారుపార్టీ తరపున గెలిచిన 39 మంది ఎంఎల్ఏల్లో గ్రేటర్ పరిధిలోనే 16 మందున్నారు. వీరిని టోకుగా కాని లేదా విడివిడిగా కాని కాంగ్రెస్ లో చేర్చుకునే విషయాన్ని రేవంత్ ఆలోచిస్తున్నారు. బహుశా ఈనెలాఖరులోగా పదిమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలను చేర్చుకునే అవకాశం ఉందని ప్రచారం పెరిగిపోతోంది. మరి బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో ఎంతమంది కాంగ్రెస్ లో చేరుతారో చూడాల్సిందే.

Tags:    

Similar News