మిర్చి పంటపై నల్ల తామర పురుగు దాడి
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా మిర్చి పంటలపై విస్తరిస్తున్న నల్ల తామర పురుగు (బ్లాక్ థ్రిప్స్) దాడిపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం నుంచి ఉద్యానవన శాఖ డైరెక్టర్ డా. కే శ్రీనివాసులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, ప్రస్తుత పరిస్థితులపై పూర్తి నివేదికను తక్షణమే సమర్పించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని, దీనికోసం తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
పురుగు ప్రభావం ఉన్న ప్రాంతాలకు శాస్త్రవేత్తలను వెంటనే క్షేత్రస్థాయికి పంపించాలని మంత్రి నిర్దేశించారు. మందుల పిచికారీపై శాస్త్రీయ సూచనలు, సాంకేతిక సలహాలు రైతులకు అందించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పని చేయాలని సూచించారు. 2021 నుంచి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈ పురుగు దాడి జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా శిక్షణలు నిర్వహించాలని ఆదేశించారు. ఉద్యాన శాఖ సిబ్బందితో పాటు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు క్షేత్ర సందర్శనలు చేపట్టి, రైతులకు ప్రత్యక్ష మార్గదర్శకత్వం అందించాలని మంత్రి సూచించారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నివారణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని హార్టికల్చర్ డైరెక్టర్ మంత్రికి వివరించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సమస్య నివారణకు డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సూచించిన సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలని ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు సూచించారు.