ముస్లిం రిజర్వేషన్‌లపై బిజెపీ, ఆర్‌ఎస్‌ఎస్ మైండ్ గేమ్
ముస్లిం రిజర్వేషన్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా. తాము వ్యతిరేకం కాదంటున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్
Byline : Vijayakumar Garika
Update: 2024-04-29 09:14 GMT
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్‌లు ప్రధాన అజెండాగా మారాయి. ముస్లిం రిజర్వేషన్‌లపై బిజెపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ముస్లిం రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని బిజెపీ ప్రభుత్వ పెద్దలు చెబుతోంటే బిజెపీకి గుండెకాయ వంటి ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం ముస్లిం రిజర్వేషన్‌లకు వ్యతిరేకం కాదని రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ముస్లిం రిజర్వేషన్‌ల మీద కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఏమి మాట్లాడారో ఒక సారి చూద్దాం.
ముస్లిం రిజర్వేషన్‌లను తీవ్రంగా వ్యతిరేకించిన అమిత్‌షా
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా ముస్లిం రిజర్వేషన్‌లపై మండి పడ్డారు. ముస్లిం రిజర్వేషన్‌లను తీవ్రంగా వ్యతిరేకించారు. బిజెపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తి వేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న అమిత్‌షా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్‌లను తెచ్చిందన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే వీటిని రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణలో 4 శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్‌లను తొలగించాలని ఇప్పటికే బిజెపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముస్లింలకు రిజర్వేషన్‌లను తొలగించి ఎస్సీ,ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్‌లు తీసుకొస్తామన్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న అమిత్‌షా సిద్ధిపేట సభ వేదికగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ముస్లిం రిజర్వేషన్‌లకు వ్యతిరేకం కాదన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
ముస్లిం రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ముస్లిం రిజర్వేషన్‌లకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకం కాదని వెల్లడించారు. రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు స్వార్థంతోనే కాంగ్రెస్ నేతలు ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్‌లకు ఆర్‌ఎస్‌ఎస్ పూర్తి మద్ధతు ఇస్తుందన్నారు. రిజర్వేషన్లు ఎవరి కోసమైతే కేటాయించారో వారిలో అభివృద్ధి జరిగేంత వరకు వారికి రిజర్వేషన్లు ఉండాల్సిందేనని వ్యాఖ్యానించారు. వివాదం సృష్టించి కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఎంతో గౌరవిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయన్నారు. రిజర్వేషన్‌లకు ఆర్‌ఎస్‌ఎస్ మొదటి నుంచి అనుకూలంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా బంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గుల్‌లో ఏర్పాటు చేసిన విద్యాభారతి విజ్ఞాన కేంద్ర పాఠశాలను చినయజీయర్ స్వామితో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. ఇది సర్వస్వతి విద్యాపీఠం అనుబంధ సంస్థ. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ సానుకూలంగా ఉందని మోహన్ భగవత్ మాట్లాడారు.
ఆర్‌ఎస్‌ఎస్, బిజెపీలు కుట్రలు పన్నుతున్నాయి
ముస్లిం రిజర్వేషన్‌లకు బిజెపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యతిరేకమని, ముస్లింలకు రిజర్వేషన్లు ఉండ కూడదనేదే బిజెపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన లక్ష్యమని, దానిని అధికారంలో ఉండే బిజెపీ అమలు చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి, రిజర్వేషన్లు వద్దనుకుంటే బిజెపీకి ఓట్లేయాలని ఆయన పేర్కొన్నారు.