బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ సంచలన నిర్ణయం
ఇక నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరిగి ధార్మిక కార్యక్రమాలు, సనాతన ధర్మ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనబోతున్నట్లు చెప్పారు.
బీజేపీ తరపున తెలంగాణా మొత్తంమీద గెలిచిన హ్యాట్రిక్ ఎంఎల్ఏ ఎవరైనా ఉన్నారా అంటే అది రాజాసింగ్ మాత్రమే. 2014 నుండి 2023 మద్యలో మూడు ఎన్నికల్లో నగరంలోని గోషామహల్(Gosha Mahal) నియోజకవర్గం నుండి గెలిచారు. 2018 ఎన్నికల్లో అయితే తెలంగాణాలో 109 మంది బీజేపీ అభ్యర్ధులు పోటీచేస్తే గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాజాసింగ్(MLA Raja Singh) మాత్రమే. రాజాసింగ్ గెలుస్తున్నది కూడా ఎంఐఎంకు బాగా ప్రాబల్యమున్న ఓల్డ్ సిటీ(Old City)లోని నియోజకవర్గంలో కావటం గమనార్హం. ఏఐఎంఐఎం(AIMIM)కు అత్యంత ప్రాబల్యమున్న ఓల్డ్ సిటీలో, వరుసగా మూడుసార్లు గెలుస్తున్నారంటే ఎంఎల్ఏ కెపాసిటి ఏమిటో అర్ధంచేసుకోవచ్చు. అలాంటి రాజాసింగ్ తొందరలోనే తాను రాజకీయాలకు దూరమైపోతున్నట్లు ప్రకటించారు. ఎంఎల్ఏ చేసిన ప్రకటన ఇపుడు సంచలనంగా మారింది.
ఇక నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరిగి ధార్మిక కార్యక్రమాలు, సనాతన ధర్మ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, కార్యక్రమాల్లో పాల్గొనటంపైనే తాను దృష్టిపెడతానని ఎంఎల్ఏ చెప్పారు. ఏదో రూపంలో తన నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులోనే ఉంటానని కూడా మాటిచ్చారు. రాజాసింగ్ సడెన్ గా ఇంతటి నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమయ్యుంటుంది ? ఏమిటంటే పార్టీ(BJP)తో ఎంఎల్ఏకి బాగా గ్యాప్ వచ్చేసింది. నిజానికి రాజాసింగ్ రాజకీయాల్లో ఇమడలేరు. ఎందుకంటే ఈయనకు చాలా షార్ట్ టెంపర్. తాను చెప్పినట్లే ఇతరులంతా వినాలని మంకుపట్టు పట్టే మనస్తత్వం ఎక్కువ. తన ఆలోనలకు ఎవరైనా భిన్నంగా మాట్లాడినా, తన నిర్ణయాలను ప్రశ్నించినా ఏమాత్రం తట్టుకోలేరు. ఈ విషయాలు ఇప్పటికే చాలాసార్లు బయటపడింది.
అందుకనే పార్టీలోని సీనియర్ నేతల్లో చాలామందితో పడటంలేదు. తెలంగాణా అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి(G Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) తో సరైన సంబంధాలు లేవు. సహచర ఎంఎల్ఏలతో కూడా పెద్దగా సంబంధాలు లేవని పార్టీవర్గాల సమాచారం. పార్టీ కార్యక్రమాలైనా, వ్యక్తిగతంగా చేపట్టే కార్యక్రమాలైనా ఎక్కువగా గోషామహల్ నియోజవర్గానికే పరిమితమవుతారు. ఇదేసమయంలో నియోజకవర్గంలోని ఎంఐఎం నేతలపై 24 గంటలూ కాలుదువ్వుతునే ఉంటారు. ఎంఎల్ఏ వైఖరితో పార్టీకి చాలాసార్లు సమస్యలు ఎదురయ్యాయి. హిందూమత వ్యాప్తికోసం, హిందు ధర్మ పరిరక్షణ కోసం తాను చావటానికి అయినా, ఎదుటివాళ్ళని చంపటానికి అయినా ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చేసిన ప్రకటనలతో ఈయనపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో కొంతకాలం జైలులో కూడా గడిపి బెయిల్ పైన బయటున్నారు.
రాజాసింగ్ వైఖరితో చాలామంది పార్టీనేతలు విసిగిపోయి దూరంగా ఉంటున్నారు. అందుకనే ఎంఎల్ఏ కార్యక్రమాలకు, అజెండాకు పార్టీ నుండి పెద్దగా మద్దతు దొరకటంలేదు. ఇదే సమయంలో పార్టీ కార్యక్రమాలకు, నేతలకు ఎంఎల్ఏ కూడా దూరంగానే ఉంటారు. ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్(Hyderabad) నియోజకవర్గానికి పోటీచేసిన కొంపల్లె మాధవి తరపున రాజాసింగ్ ప్రచారంలో ఎక్కడా కనబడలేదు. ఇక పార్టీ చేపట్టిన మూసీనది బస్తీల నిద్రలో కూడా రాజాసింగ్ పాల్గొనలేదు. గోషామహల్ నియోజకవర్గంలో కూడా మూసీనది(Musi river) పరివాహక ప్రాంతముంది. అయినా సరే పార్టీ కార్యక్రమాన్ని ఎంఎల్ఏ పట్టించుకోలేదు. తనకు ఇవ్వాల్సినంత గౌరవం పార్టీ ఇవ్వటంలేదన్నది ఎంఎల్ఏ భావన. ఇపుడున్న 8 మంది ఎంఎల్ఏల్లో తానే సీనియర్ కాబట్టి తనను బీజేఎల్పీ నేతగా నియమించాలని రాజాసింగ్ పార్టీ అధిష్టానాన్ని పదేపదే డిమాండ్ చేశారు. అయితే అధిష్ఠానం మాత్రం పార్టీ తరపున మొదటిసారి గెలిచిన నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా ఎంపికచేసింది. 2018లో కూడా బీజేఎల్పీ నేతగా ఎంపికచేయాలని ఎంఎల్ఏ అడిగినా అధిష్ఠానం పట్టించుకోలేదు.
రాజాసింగ్ అరెస్టయి జైలులో ఉన్నపుడు కూడా పార్టీ తరపున పరామర్శించిన సీనియర్లు పెద్దగా లేరు. ఇలాంటి అనేక ఘటనల కారణంగా ఎంఎల్ఏ పార్టీకి మానసికంగా దూరమైపోయినట్లున్నారు. అందుకనే పార్టీ ఆపీసుకు రావటం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం పెద్దగా చేయరు. ఇపుడు పరిస్ధితి ఎలాగ తయారైందంటే బీజేపీకి ఎంఎల్ఏ అవసరంలేదు, ఎంఎల్ఏకి పార్టీ మద్దతు అవసరంలేదన్నట్లుగా తయారైంది వ్యవహారం. బహుశా ఇలాంటి వ్యవహారాలను విశ్లేషించుకున్న తర్వాతనే తాను ప్రత్యక్ష రాజకీయాలనుండి తప్పుకోవాలని ఎంఎల్ఏ డిసైడ్ అయినట్లున్నారు. తన మద్దతుదారులతో మాట్లాడిన తర్వాతనే రాజాసింగ్ పై ప్రకటనచేసినట్లు అర్ధమవుతోంది. నిజానికి రాజాసింగ్ కాబట్టే గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ తరపున గెలుస్తున్నారు. అలాంటిది వచ్చే ఎన్నికల్లో రాజాసింగ్ కాకుండా మరోక నేత పోటీచేస్తే గోషామహల్ లో గెలుస్తారా ?