పుణ్యక్షేత్రాలకు బాబు.. విదేశాలకు జగన్
ఎన్నికల అనంతరం పార్టీల నాయకులు విశ్రాంతి కోసం టూర్ల బాట పట్టారు. చంద్రబాబు మాత్రం తీర్థ యాత్రల్లో బీజీగా ఉన్నారు.
మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబాలతో కలిసి సేద తీరేందుకు టూర్ల బాట పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన భార్య భారతిరెడ్డితో కలిసి శుక్రవారం రాత్రి లండన్ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఉంచి ఫ్రాన్స్, స్విట్జర్‌లాండ్ వంటి యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. తొలుత లండన్‌లో కుమార్తెలు ఉన్నందున వారితో కలిసి గడిపేందుకు జగన్ దంపతులు వెళ్లారు. టూర్ ప్రోగ్రామ్ రెడీ చేసుకున్న తర్వాత సీబిఐ కోర్టు అనుమతి తీసుకోవలసి వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో బెయిల్‌పై ఉన్నందు వల్ల కోర్టు అనుమతి తప్పనిసరైంది. కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన తర్వాత విదేశీ పర్యటనకు కోర్టు అనుమతినిస్తూ జగన్‌కు కొన్ని సూచనలు చేసింది. సీబీఐకి ఫోన్‌లో అందుబాటులో ఉండాలని, మెయిల్ ఐడీని వారికి అందజేయాలని, ప్రయాణ ప్రణాళికను సీబీఐకి పంపించాలని అదేశాల్లో పేర్కొన్నారు.